వాగులో గాలిస్తున్న స్థానికులు,బాలిక మృతదేహాన్ని బయటకు తీసుకొస్తున్న దృశ్యం
సాక్షి, నాదెండ్ల(గుంటూరు) : మండలంలోని సంక్రాంతిపాడు వద్ద నక్కవాగులో గల్లంతైన యువ రైతు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. సంక్రాంతిపాడు గ్రామానికి చెందిన ప్రత్తి సాంబశివరావు కుమారుడు శ్రీకాంత్ (29) రెండేళ్ల క్రితం గుంటూరు సమీపంలోని బుడంపాడు గ్రామానికి చెందిన స్వప్నతో వివాహమైంది. అరెకరం సొంత భూమికి తోడు మరి కొంత కౌలుకు తీసుకుని తండ్రితో కలిసి పంటలు సాగు చేస్తున్నాడు. గురువారం ఉదయం తండ్రితో కలిసి బ్రిడ్జి మీదుగా పొలానికి వెళ్లి తిరిగి వస్తూ వాగు దాటేందుకు ప్రయత్నించాడు. వాగు ఉధృతికి అదుపుతప్పి పడిపోయాడు. అదే సమయంలో ద్విచక్రవాహనాలపై వెళ్తున్న రైతులు చూసి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. నాదెండ్ల ఇన్‌చార్జి తహసీల్దార్ నాంచారయ్య, డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఎస్‌ఐ చెన్నకేశవులు, అగ్నిమాపక దళ అధికారి చంద్రమౌళి సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను తెప్పించారు. ఈలోగా రైతులే శ్రీకాంత్ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలతోనే ప్రమాదాలు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు అడ్డగోలుగా ఇసుక, మట్టి తవ్వకాలు జరిపారు. నక్కవాగులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వటంతో గుంతలు ఏర్పడ్డాయి. వాగు ఉధృతి కారణంగా శ్రీకాంత్ ఈ గుంతల్లో పడి మృతి చెందాడు.
గల్లంతైన బాలిక మృత్యుఒడికి..
సత్తెనపల్లి: మండలంలోని పాకాలపాడు వాగులో గల్లంతైన విద్యార్థిని పెరవల్లి భువనేశ్వరి (11) మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని గురువారం రెంటపాళ్ళ వద్ద వాగులో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు గుర్తించారు. చందవరం గ్రామానికి చెందిన బాలిక ఐదో తరగతి చదువుతోంది. అమ్మమ్మ పార్వతితోపాటు దుస్తులు శుభ్రం చేసేందుకు పాకాలపాడులోని శివాలయం వెనుక ఉన్న వాగుకు బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వెళ్లింది. కాలు జారి వాగులో పడి కొట్టుకుపోయింది. బాలిక మృతితో అమ్మమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటన పలువురిని కలిచివేసింది. మృతదేహాన్ని అధికారులు పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment