మామిళ్లపల్లి దీప్తి
సాక్షి, గుంటూరు: విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి అమాయకులను మోసం చేసి ఉద్యోగాలు ఇప్పిస్తాననీ, ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న పనులు చక్క పెడతానని ఘరానా మోసాలకు పాల్పడిన కిలాడీ లేడీ మామిళ్లపల్లి దీప్తి బాధితులు ఒక్కక్కరిగా బయటకు వస్తున్నారు. ఆమె సీఎంవోలో పీఏగా పని చేస్తున్నానని నమ్మించి మోసం చేసినట్లు వెల్లడిస్తున్నారు. ఈ కిలాడీ లేడీ గురించి గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనం సంచలనం రేపింది. కిలాడీ లేడీ గురించి సాక్షి జరిపిన విచారణలో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అమాయకుల నుంచి దాదాపు రూ.70 లక్షలకుపైగా దీప్తి నమ్మించి మోసాలకు పాల్పడినట్లు తెలిసింది.
బయటకు వస్తున్న బాధితులు...
రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా గ్రామ, సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిని కూడా దీప్తి క్యాష్ చేసుకుంది. సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురికి నమ్మబలికింది. ఈ నేపథ్యంలో గుంటూరుకు చెందిన ఓ యువకుడికి సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని, అందుకు రూ.3 లక్షలు ఇవ్వాలని చెప్పింది. దీంతో ఆ యువకుడు అప్పు చేసి రూ 1.50 లక్షలు ఇచ్చానని సాక్షి ఎదుట వాపోయాడు. వైజాగ్‌కు చెందిన వ్యక్తికి గురుకుల సంక్షేమ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. అందుకు రూ.15 లక్షలు కావాలని అడిగితే.. ఆయన ఇల్లు అమ్ముకొని వచ్చిన రూ.5 లక్షలు తెచ్చి ఇచ్చాడు.
మాచర్లకు చెందిన నాయక్ అనే వ్యక్తికి విధ్యుత్ సబ్ స్టేషన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని ఏడాది క్రితం రూ.4.50 లక్షలు వసూలు చేసింది. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన బాధితుడు, గుంటూరుకు చెందిన మన్నవ వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు, పొలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి నుంచి రూ.12 లక్షలు, కడప జిల్లాకు చెందిన వ్యక్తి నుంచి రూ.12 లక్షలు, నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తి నుంచి రూ.10 లక్షల చొప్పున తీసుకున్నట్లు తెలిసింది. దాదాపుగా ఇప్పటి వరకు రూ.70 లక్షలకుపైగా నమ్మించి డబ్బు కాజేసిందని ప్రచారం జరుగుతోంది.
గుంటూరు నుంచి హైదరాబాద్
దీప్తిపై ఫిర్యాదులు అందుతుండటంతో ముందు జాగ్రత్త పడింది. గుంటూరు నుంచి స్నేహితుల సహకారంతో హైదరాబాద్ చేరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో దీప్తి తనపై వచ్చిన ఫిర్యాదుల నుంచి బయట పడేయాలని టీడీపీ నాయకులకు ఫోన్ చేసి కోరుతున్నట్లు సమాచారం. బాధితులు మాత్రం మోసకారి ఎక్కడ ఉన్నా ఆమెను అరెస్టు చేయడంతోపాటు ఇతర దేశాలకు పారిపోకుండా ఉండేలా పాస్‌పోర్టు సీజ్ చేయాలని కోరుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తులో ఉన్న కారణంగా వివరాలు తెలియజేయడం సాధ్యం కాదని అంటున్నారు. ఏది ఏమైనా కిలాడీ లేడీని అరెస్టు చేసి మరొకరు ఇలాంటి మోసాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. (చదవండి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఏనంటూ..)
Comments
Please login to add a commentAdd a comment