ఆర్టీసీ బస్సు టైరు కిందపడిన సైకిల్.. ఇన్‌సెట్.. పూజిత (ఫైల్)
గుంటూరు, యడ్లపాడు: రోడ్డు ప్రమాదంలో బస్సు ఢీకొని సైకిల్‌తో పాటు బస్సు కిందకు వెళ్లిపోయిన బాలిక క్షేమంగా బయటపడి మృత్యుంజయురాలు అనిపించుకున్న వైనం నాదెండ్ల మండలం గణపవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని రాజీవ్‌గాంధీ కాలనీకు చెందిన జిన్నింగ్‌మిల్లులో ఫిట్టర్‌గా పనిచేసే వంకరబోయిన వెంకటేశ్వరరావు కుమార్తె పూజిత స్థానిక కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. నిత్యం సైకిల్‌పై 16వ నంబర్ జాతీయ రహదారిని దాటి పాఠశాలకు వెళ్లి వస్తుంది. రోజూ మాదిరిగానే బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికి వెళ్లేందుకు హైవే రహదారిని దాటుతుండగా అదే సమయంలో గుంటూరు వైపు నుంచి ఒంగోలు వెళ్తున్న ఒంగోలు డిపో ఆర్టీసీ బస్సు విద్యార్థిని సైకిల్‌ను ఢీకొంది. దీంతో సైకిల్‌తో పాటు పూజిత కూడా బస్సు కిందకు వెళ్లిపోయింది. తమ కళ్లెదుటే క్షణాల్లో జరిగిన ఈ సంఘటనకు స్థానికులు హతాశులయ్యారు. హైవే సమీపంలో ఉన్నవారంతా టెన్షన్‌తో కేకలు వేస్తూ పరుగుపరుగున రహదారిపైకి వచ్చారు. ప్రమాదాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి వాహనాన్ని నిలిపివేశాడు. బస్సులోని ప్రయాణికులు సైతం కంగారుగా కిందకు దిగి గమనించారు. అయితే ప్రమాదంలో సైకిల్‌పై బస్సు ముందు టైరు ఎక్కడంతో సైకిల్ పూర్తిగా దెబ్బతింది. విద్యార్థిని పూజిత మాత్రం బస్సు రెండు టైర్ల మధ్య ఖాళీలో పడటంతో ప్రాణాపాయం లేకుండా స్వల్పగాయాలతో బయటపడింది. దీంతో అక్కడ చేరిన స్థానికులంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
హైవేపై ధర్నా నిర్వహించిన స్థానికులు
పూజితను ఢీకొన్న ఆర్టీసీ బస్సును ముందుకు పోనివ్వకుండా అడ్డుకుని, విద్యార్థినికి కొత్త సైకిల్ ఇప్పించి ఆసుపత్రి ఖర్చులను భరించి న్యాయం చేయాలంటూ విద్యార్థిని తండ్రి వెంకటేశ్వరరావుతో పాటు స్థానికులు కొందరు హైవేపై ధర్నా నిర్వహించారు. బస్సు డ్రైవర్ మాత్రం తన తప్పేమీ లేదని, హైవేపై వస్తున్న క్రమంలో విద్యార్థిని అడ్డుగా రావడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పడంతో స్థానికులు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కల్పించుకుని అటు ట్రాఫిక్‌కు, ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సును పక్కకు పెట్టించారు. బస్సులోని ప్రయాణికులను మరోబస్సులోకి ఎక్కించి పంపించేశారు. స్థానికులకు సర్దిచెప్పి వివాదాన్ని సద్దుమణిగించారు.
ప్రమాదాల నిర్మూలనకు వంతెన ఏర్పాటు చేయాలి
నిత్యం కాలనీ ప్రజలు నూలుమిల్లులకు, విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాలంటే హైవేను దాటాల్సిందే. దీంతో నడకదారిగా మారిన ఈ ప్రాంతంలో గతంలోనూ అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు లైటింగ్, సూచికలు, కరపత్రాలు పంపి అవగాహన కల్పిస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో హైవేను దాటేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జిగాని, అండర్‌పాస్ వంతెనగాని ఏర్పాటు చేసి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment