బస్సు ఢీకొని మృతి చెందిన శివపార్వతి
లక్ష్మీపురం(గుంటూరు): ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో బంధువులను పరామర్శించి పెదకాకాని శివాలయానికి ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులను ప్రైవేటు బస్సు ఢీ కొనడంతో బస్సు టైర్ కింద మహిళ పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు నగరంలో కాకాని రోడ్డులో ఉన్న బెస్ట్‌ప్రైస్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ సీఐ పూర్ణచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు రూరల్ మండలం ఓబులునాయుడుపాలెంకు చెందిన ఏమినేని సాంబశివరావు మిర్చి యార్డులో ముఠా కూలీగా జీవనం సాగిస్తుంటారు. భార్య శివపార్వతి. వీరికి ఇద్దరు కుమారులు గణేష్, సాయికుమార్ చెన్నైలో సాఫ్ట్‌వేర్ కంపెనీలలో పనిచేస్తున్నారు. శివపార్వతి తల్లి సింహాద్రి నాగేశ్వరమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో చికిత్స పొందుతూ ఐసీయూలో ఉన్నారు. సాంబశివరావు, శివపార్వతి గురువారం సాయంత్రం ఓబులునాయుడుపాలెం నుంచి గుంటూరు వచ్చి ఆసుపత్రిలో తల్లి నాగేశ్వరమ్మను పరామర్శించి తిరిగి రాత్రి ఓబులునాయుడుపాలెం వెళ్లారు.
శుక్రవారం ఉదయం కార్తీక పౌర్ణమి సందర్భంగా పెదకాకాని దేవాలయంలో దీపారాధన చేసేందుకు ద్విచక్రవాహనంపై దంపతులిద్దరూ బయల్దేరారు. గుంటూరు బెస్ట్ ప్రైస్ వద్దకు చేరుకునే సరికి యామినీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆటోను తప్పించే యత్నంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనం నడుపుతున్న సాంబశివరావు, శివపార్వతి కిందపడ్డారు. శివపార్వతి (50) తలభాగం బస్సు వెనుక టైర్ కింద పడటంతో నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్త సాంబశివరావుకు తీవ్రగాయాలయ్యాయి. సాంబశివరావును ఆసుపత్రికి తరలించడం కోసం స్థానికులు 108కు ఫోన్ చేయగా, ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది.. అంటూ 108 సిబ్బంది కాలయాపన చేయడంతో ఆటోలో సాంబశివరావును జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఈస్ట్ ట్రాఫిక్ సీఐ పూర్ణచంద్రరావు సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతురాలు శివపార్వతి పెద్ద కుమారుడికి ఇటీవల నిశ్చితార్థం అయింది. 2019 ఫిబ్రవరి 9వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. పోలీసులు శివపార్వతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment