మృతదేహాలను బయటికి తీసుకొస్తున్న దృశ్యం
గుంటూరు, మంగళగిరి: రాజధాని పరిధిలో హత్యకు గురైన తండ్రీకొడుకుల మృతదేహాలను ఆదివారం వెలికితీశారు. మండలంలోని రాజధాని పరిధిలోని కురగల్లు– నీరుకొండ గ్రామాల మధ్య ఈ–14 రోడ్డులో పోలీసులు పొక్లెయిన్లతో తవ్వకాలు చేపట్టిన పోలీసులు మృతదేహాలను స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం మేలవాయికి తరలించారు. మేలవాయికి చెందిన వేముల లక్ష్మయ్య, సురేష్ పొక్లెయిన్ డ్రైవర్ల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. శనివారం మృతదేహాలను వెలికితీయడానికి సమయం చాలక ఆదివారం ఉదయం ఏఎస్సీ లక్ష్మీనారాయణ, నార్త్‌జోన్ డీఎస్పీ జీ రామకృష్ణ, రూరల్ సీఐ బాలాజి, ఎస్‌ఐ వీరనాయక్‌లు సిబ్బందితోపాటు గుంటూరు డాక్టర్‌లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒడ్డుకు చేర్చిన మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.
పోలీసుల అదుపులో నిందితుడు!
జంట హత్యలలో ప్రధాన ముద్దాయి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ నరేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తండ్రీకుమారులు వేముల లక్ష్మయ్య, సురేష్‌లు అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ నరేష్ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ హత్య కేసులో మరెవరైనా ఉన్నారా ?ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment