గణేష్‌ది ముమ్మూటికి హత్యే.. | Ganesh Parents Daught on Suicide Case | Sakshi
Sakshi News home page

గణేష్‌ది ముమ్మూటికి హత్యే..

Published Mon, Feb 18 2019 1:12 PM | Last Updated on Mon, Feb 18 2019 1:12 PM

Ganesh Parents Daught on Suicide Case - Sakshi

మార్చురి వద్ద నిరసన తెలుపుతున్న గణేష్‌ తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు గణేష్‌ (ఫైల్‌)

గుంటూరు ఈస్ట్‌: తమ కుమారుడిది ఆత్మహత్య కాదని హత్యేనని, నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని మేకల గణేష్‌ తల్లిదండ్రులు నాగేశ్వరరావు, నాగమల్లేశ్వరి డిమాండ్‌ చేశారు. వడ్లమూడి సమీపంలోని రైలు పట్టాల వద్ద అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన బీటెక్‌ విద్యార్థి గణేష్‌ తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు జీజీహెచ్‌ మార్చురి వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఫిరంగిపురం ఎర్రగుంట్లపాడులో తాము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. తమ మూడో కుమారుడు గణేష్‌ శుక్రవారం మధ్యాహ్నం మిత్రుడైన రవి కళాశాల నుంచి బయటకు తీసుకువెళ్లాడన్నారు. గణేష్‌ క్లాసులకు హాజరుకాకపోవడంతో కళాశాల యాజమాన్యం కూడా సెల్‌ ద్వారా మెసేజ్‌ పంపిందన్నారు.

అయితే, శనివారం గణేష్‌ మృతదేహం వడ్లమూడి సమీపంలోని రైలుపట్టాలపై ఉన్న విషయం తమకు పోలీసులు తెలిపారన్నారు. తమ కుమారుడిని తీసుకువెళ్లిన రవిని పట్టుకు పోలీసులకు అప్పగించామని చెప్పారు. తనతో పాటు మరో ముగ్గురు ఉన్నారని, అంతా కలసి మద్యం తాగినట్లు ఒప్పుకున్నాడని వివరించారు. గణేష్‌ అస్థిపంజరం బొమ్మ చుట్టూ పుర్రెల బొమ్మలు పెట్టిన పోస్టింగ్‌ను గణేష్‌ సెల్‌కు రవి శనివారం పంపించాడని చెప్పారు.  ఘటనా స్థలం సమీపంలో కర్రలకు రక్తం మరకలు ఉన్నాయని, దీన్ని బట్టి తన కుమారుడిది హత్యేనని ఆరోపించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నవ్యాంధ్ర స్టూడెంట్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామి, బీసీ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడు కర్రం శ్రీనివాస్‌ మాట్లాడుతూ గణేష్‌ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ,సమగ్ర విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని డిమాండు చేశారు. పోలీసులు ఇప్పటికైనా గణేష్‌ మృతికి కారణాలను తల్లిదండ్రులకు స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement