ఆత్మహత్యకు గణేష్ వినియోగించిన నైట్రోజన్ ఆక్సిజన్ సిలిండర్, పాలిథిన్ కవర్లు గణేష్ (ఫైల్)
బంజారాహిల్స్: ‘చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది’ అంటూ బీటెక్ విద్యార్థి గణేష్ సూసైడ్ నోట్ రాసి.. నైట్రోజన్ ఆక్సిజన్ కలిగి ఉన్న సిలిండర్ పైపులను బిగించుకొని.. ముఖంపై పాలిథిన్ కవర్‌తో కప్పుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ వినాయకనగర్‌లో జరిగిన అతని ఆత్మహత్య తీరు కుటుంబ సభ్యులను నివ్వెరపోయేలా చేసింది.
యూ ట్యూబ్‌లో చూసి..
వారం పది రోజులుగా తేలికగా ఎలా చనిపోవాలో గణేష్ యూట్యూబ్ సెర్చ్ చేసినట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే ఎర్రగడ్డలోని ఓ గ్యాస్ ఏజెన్సీస్‌లో ఈ నెల 14న రూ.3,154 వెచ్చించి సిలిండర్‌ను, పైపులు, పాలిథిన్ కవర్లు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంట్లోని స్టోర్ రూంలో వీటిని భద్రపరిచాడు. నైట్రోజన్ ఆక్సిజన్ సిలిండర్ పైపులను ముక్కులోకి పెట్టుకొని రసాయన వాయువులు బయటికి రాకుండా తన శరీరంలోకి వెళ్లేలా ముఖాన్ని పాలిథిన్ కవర్లతో గట్టిగా చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నేను నా రాక్షసి’ సినిమాలో ఇలాగే తేలికగా చనిపోయే కొన్ని దృశ్యాలు చూసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ సినిమాలో బండరాళ్లు కట్టుకొని నీటిలో దూకడం, ఇంజక్షన్లు తీసుకొని శరీరం బండబారేలా చేసుకోవడం వంటివి చూసినట్లుగా కూడా తెలుస్తోంది.
స్మార్ట్ ఫోనే కారణమా..?
గణేష్ వద్ద స్మార్ట్ ఫోన్ లేకుంటే ఇలాంటి పని చేసి ఉండేవాడు కాదని గణేష్ అతని స్నేహితులు చెబుతున్నారు. స్మార్ట్ పోన్ ఉండటంతోనే ఇంటి వద్ద సెర్చ్ చేసి మరీ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. బండ్లగూడలోని మహవీర్ కాలేజీలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న గణేష్ మొదటి సంవత్సరంలోనే పరీక్షలు సరిగా రాయకపోవడంతో డిటెండయ్యాడు. మరోసారి పరీక్షలు రాసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మూడు రోజులుగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడకుండా అన్యమనస్కంగా ఉంటున్నాడు. ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టాడు. ఈ నెల 14నే ఆత్మహత్య చేసుకోవాలని పథకం రచించుకున్నాడు. ఇందులో భాగంగానే మూడు రోజుల ముందే సామగ్రిని తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాత్రమే ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. సోమవారం కుటుంబ సభ్యులు బయటికి వెళ్లడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నేను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నా’నంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment