
చిన్నారి అక్షితతో తల్లి మేరీ మార్గెట్ (ఫైల్)
ఉప్పల్: కుటుంబ కలహాలు..చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా గృహిణులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు... తమతో పాటు అభం శుభం తెలియని పసి పిల్లలను కూడా బలి తీసుకుంటున్నారు... నగరంలో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు పరిపాటిగా మారాయి. తాజాగా ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ శ్రీనివాసపురం ప్రాంతానికి చెందిన సెమన్ ప్రభాకర్, కర్నూలు జిల్లా బనగానపల్లి, టంగుటూరు ప్రాంతానికి చెందిన మేరీ మార్గెట్ (38)తో 2017లో వివాహం జరిగింది. వీరికి బ్లేస్సి అక్షిత (8 నెలల పాప) ఉంది.
ప్రభాకర్ ప్రతి రోజూ మద్యం తాగి వచ్చే వాడు. భార్య ఎంత వారించినా మానేస్తానని చెప్పి మానేయడం లేదు. ఈ కారణంతోనే భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు మొదలయ్యాయి. రోజూ భర్త తాగి రావడంతో పాటు ఇతర సమస్యలతో తీవ్ర మనస్తాపానికి లోనైన మేరీ మార్గెట్, కూతురు చిన్నారి అక్షితను తీసుకొని సోమవారం తాము నివాసం ఉంటున్న భవాని రెసిడెన్సీ 4వ అంతస్తుకు వెళ్లింది. కూతురిని మొదట అక్కడి నుంచి కిందకు విసిరేసి.. ఆ తర్వాత తాను కూడా దూకేసింది. తల్లీకూతుళ్లకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఉప్పల్ సీఐ రంగస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment