కాల్‌మనీ కేసులో ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు | Two Men Arrest in Call Money Case Guntur | Sakshi
Sakshi News home page

కాల్‌మనీ కేసులో ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు

Published Thu, Jan 2 2020 12:33 PM | Last Updated on Thu, Jan 2 2020 12:33 PM

Two Men Arrest in Call Money Case Guntur - Sakshi

గుంటూరు ఈస్ట్‌: కాల్‌మనీ కేసులో గురుశిష్యులను అరెస్టు చేసిన పోలీసులు, ఇద్దరిపై రౌడీషీట్‌లు సైతం తెరిచారు. నిందితులపై గతంలో 9 కేసులు ఉన్నా టీడీపీ అండదండలతో రెచ్చిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదలకు సంబంధించి పాత నేరస్తుల చరిత్రను పరిగణనలోకి తీసుకున్న అర్బన్‌ ఎస్పీ పి.హెచ్‌డి.రామకృష్ణ వారి ఆగడాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాల్‌మనీ వ్యాపారులు ఇద్దరినీ లాలాపురం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.   లాలాపేట పోలీస్టేషన్‌లో ఈస్ట్‌ డీఎస్పీ కె.సుప్రజ, ఎస్‌హెచ్‌ఓలు ఫిరోజ్, రాజశేఖరరెడ్డి, సురేష్‌ బాబు ఈ కేసు వివరాలను వెల్లడించారు. వారి కథనం మేరకు..

గుంటూరు విద్యానగర్‌ ఒకటో లైను ఎక్స్‌టెన్షన్‌కు చెందిన ఇమడాబత్తిని కల్యాణచక్రవర్తి అలియాస్‌ పప్పుల నాని లాలాపేట పరిధిలోని హజార్‌ వారి వీధిలో తొలుత పప్పుల వ్యాపారం చేశాడు. అనంతరం 25 ఏళ్లుగా మీటర్‌ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. నెహ్రూనగర్‌ 4వ లైనుకు చెందిన మాజేటి శేఖర్‌ తొలి నుంచి పప్పుల నానికి అనుచరుడిగా ఉంటు న్నాడు. పప్పుల నాని మీటర్‌ వడ్డీ, వంద రోజుల వడ్డీ, రోజువారి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. బాకీ చెల్లించని వారిని తన కార్యాలయానికి పిలిపించి బంధించి కొట్టి చెక్కులు, ప్రామిసరీ నోట్‌లపై అధిక మొత్తం రాయించి సంతకాలు చేయించుకుని పంపేవాడు. కొందరి వద్ద ఖాళీ నోట్‌లు, చెక్‌లపై సంతకాలు చేయించుకునేవాడు. కార్యాలయానికి రాని వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేసేవాడు. బాకీ వసూలు చేసే క్రమంలో వంటరిగా జీవించే మహిళలతో నాని, శేఖర్‌ అసభ్యంగా ప్రవర్తించారు. కొందరిని తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. ఓ మహిళపై లైంగికదాడికి యత్నించడంతో కొత్తపేట స్టేషన్‌లో శేఖర్‌పై ఇటీవల కేసు నమోదైంది. పప్పుల నానికి ఉన్న పలుకుబడి కారణంగా అతని బారినపడిన మహిళలు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు.

వడ్డీ కోసం గురుశిష్యులు పెట్టే వేధింపులను తట్టుకోలేక గతంలో కొంతమంది ధైర్యం చేసి ఆధారాలతో ఎస్పీలకు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో పలు పోలీస్‌స్టేషన్లలో పప్పుల నానిపై ఆరు, శేఖర్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. వీరు రిమాండ్‌కు వెళ్లినా వారి అనుచరులు యథావిధిగా కార్యకలాపాలను కొనసాగించేవారు. పప్పులనాని వద్ద గత మార్చి, ఏప్రిల్‌ నెలల్లో నెహ్రూనగర్‌ పదో లైనుకుచెందిన ఏలే దుర్గాప్రసాద్, అతని తండ్రి కొండయ్య మీటరు వడ్డీకి ఒకసారి రూ.50 వేలు, మరోసారి రూ.2 లక్షలు తీసుకున్నారు. రోజుకు రూ.5 వేల చొప్పున 50 రోజులు చెల్లించిన అనంతరం, చెల్లింపులు నమోదు చేసిన పుస్తకాన్ని తండ్రీకొడుకుల నుంచి నాని, శేఖర్‌ లాక్కున్నారు. వడ్డీకి వడ్డీ వేసి ఎక్కువ మొత్తం డిమాండు చేశారు. మొదట ఇచ్చిన ప్రామిసరీ నోట్లు పోయాయంటూ, డిసెంబర్‌ 28వ తేదీ తండ్రీకొడుకులను నాని, శేఖర్‌ తమ కార్యాలయంలోబంధించి ఆరు ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకుని వదిలిపెట్టారు. బాధితులు పోలీస్‌ స్పందన కార్యక్రమంలోలో ఫిర్యాదు చేయడంతో అర్బన్‌ ఎస్పీ పి.హెచ్‌.డి.రామకృష్ణ స్పందించారు. నిందితుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్టుచేసి రూ.30,32,900 నగదు, 9 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 10 ఖాళీ బ్యాంకు చెక్‌లు, రోజువారి, మీటర్‌ వడ్డీ లెక్కల పుస్తకాలు స్వాధీనం చేసుకునిరిమాండుకు తరలించారు.

రౌడీ ఆగడాలకు అంతేలేదు
పప్పుల నాని, శేఖర్‌ రాజకీయంగా, పోలీసుల వద్ద పలుకుబడి సంపాదించి హోల్‌సేల్‌ కిరాణా, ఇతర వ్యాపారులపై జులుం ప్రదర్శించే వారు. పప్పుల నాని తన దౌర్జన్య కార్యకాలాపాల కోసం వివిధ కాలనీలకు చెందిన వ్యక్తులు, యువకులను అనుచరులుగా పెట్టుకున్నాడు. ఆ అనుచరులు కిరాణా, ఫ్యాన్సీ, జ్యూస్‌ షాపులు, చికెన్‌ షాపులు, తోపుడు బండ్ల వ్యాపారుల వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వకుండానే తమకు కావాల్సినవి తీసుకెళ్లేవారు. గురుశిష్యులు ఇద్దరు గతంలో ఫోర్జరీ దస్తావేజులు పుట్టించి మోసగించేవారు. నిందితుల రోజువారీ వసూళ్లు రూ.80 వేలు. పోలీసులు వారి కార్యాలయంపై దాడి చేసినప్పుడు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదుకు సంబంధించి వడ్డీకి తీసుకున్న వారి పేరుతో చీటీలు రాసి రబ్బరు బ్యాండులు వేసిన కట్టలులభించడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement