వివరాలు వెల్లడిస్తున్న సీఐ కిశోర్‌కుమార్, పక్కన ఎస్‌ఐ అంజయ్య, పీఎస్‌ఐ శ్రావణి
గుంటూరు, తెనాలి రూరల్ : గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మూడు కార్లు, 60 గ్రాముల బంగారు ఆభరణాలు, ఎల్‌ఈడీ టీవీ స్వాధీనం చేసుకున్నారు. స్థానిక టూ టౌన్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ఆర్.ఎస్. కిశోర్‌కుమార్ చోరీలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. యడ్లపాడు మండలం ఉప్పరపాలేనికి చెందిన డేరంగుల కోటేశ్వరరావు కారు డ్రైవర్ పని చేస్తుంటాడు. మార్చి 2న కారు రిపేరు చేయాలంటూ తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న షెడ్డు వద్దకు రాగా, రూ. 25వేలు అవుతుందని మెకానిక్ చెప్పాడు. కారుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టే బదులు గంగానమ్మపేట ఉమ్మారెడ్డి కాంప్లెక్సులోని షెడ్డులో మరో కారు అమ్మకానికి ఉందని మెకానిక్ చెప్పాడు. దీంతో కోటేశ్వరరావు అక్కడకు వెళ్లి ట్రయల్ వేస్తానంటూ కారుతో ఉడాయించేశాడు. తెనాలి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
♦ ఏప్రిల్ 11న నర్సరావుపేటలోని పల్నాడు సెంటరులో కొనుగోలు చేసిన టీవీని తీసుకెళ్లేందుకు నలుగురు వ్యక్తులు వాహనం కోసం వేచి ఉండగా, బాడుగకు వస్తానంటూ వారితో బేరమాడి, ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లాక కారు ఇంజిన్ ఆపివేసి, తోయాలంటూ చెప్పాడు. వారు దిగి తోస్తుండగా, స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నకరికల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
♦ అదే నెల 29న నర్సారావుపేట నుంచి ఒంగోలులోని వివాహానికి వెళ్లేందుకు ఇద్దరు పిల్లలతో నలుగురు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉండగా, వారిని బాడుగకు ఒప్పించి, ఎక్కించుకున్నాడు. వివాహానికి సంబంధించి ఆభరణాలు తీసుకెళుతున్నారని వారి మాటల ద్వారా కోటేశ్వరరావు తెలుసుకున్నాడు. కొద్ది దూరం వెళ్లాక కారు ఇంజిన్ ఆపివేసి, తోయాలంటూ వారికి చెప్పాడు. దిగి తోస్తుండగా, కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. దీనిపై ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెనాలిలో కారుతో ఉడాయించిన ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడు కోటేశ్వరరావు అని నిర్ధారించుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నర్సరావుపేటలోని బరంపేటలో అతను ఉంటున్న అద్దె ఇంట్లో తనిఖీ చేయగా, బంగారు ఆభరణాలు, ఎల్‌ఈడీ టీవీ, ఒక కారు లభించాయి. నిందితుడి సమాచారం మేరకు తెనాలిలో వదిలి వెళ్లిన కారు, మరో కారునూ స్వాధీనపర్చుకున్నారు. రూరల్ ఎస్పీ కార్యాలయంలో పోలీసు శాఖకు చెందిన ఐటీ కోర్ విభాగం అందించిన సాంకేతిక సహాయంతో నిందితుడి ఆచూకీ గుర్తించినట్టు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్‌ఐ గన్నవరపు అంజయ్య, పీఎస్‌ఐ శ్రావణి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment