
కావూరులో మనవడి దాడిలో మృతి చెందిన కోటయ్య (ఇన్‌సెట్) కోటయ్య (ఫైల్)
గుంటూరు, చిలకలూరిపేట: ఆస్తి తన పేర రాయలేదని తాతను మనవడు కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చిన సంఘటన బుధవారం చిలకలూరిపేట మండలం కావూరు గ్రామంలో జరిగింది. చిలకలూరిపేట రూరల్ సీఐ విజయచంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కావూరు గ్రామానికి చెందిన కందుల కోటయ్య(63), సీతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చిన్న కుమారుడు ఆదినారాయణ గుంటూరులో నివాసం ఉంటున్నాడు. పెద్ద కుమార్తె వెంకట రమణమ్మ, చిన కుమార్తె సుజాతను కావూరు గ్రామంలోనే ఇచ్చి వివాహాలు జరిపించాడు.
కన్నీంటిపర్యంతమైన కుటుంబ సభ్యులు
పెద్ద కుమార్తె వెంకటరమణమ్మ నాలుగేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి పెద్ద అల్లుడు పెడవల్లి కోటయ్య, అతని కుమారుడు నాగేశ్వరరావుతో కలిసి అల్లుడు ఇంట్లోనే మృతుడు కందుల కోటయ్య, సీతమ్మ దంపతులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్న కందుల కోటయ్యను ఆస్తి తన పేరున రాయాల్సిందిగా మనవడు పెడవల్లి నాగేశ్వరరావు కోరుతూ వచ్చాడు. స్థిరాస్తి బదలాయింపు విషయంలో ఇరు కుటుంబాల మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం కూడా తాత, మనవడి మధ్య వివాదం జరిగింది. కోపోద్రికుడైన నాగేశ్వరరావు మంచంపై పడుకొని ఉన్న తాతపై కత్తితో మెడ, తలభాగంలో విచక్షణారహితంగా పొడవటంతో కోటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలంలో రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధుడి భౌతికాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ ఎస్.విజయచంద్ర, ఎస్‌ఐ జి.అనీల్‌కుమార్‌లు కావూరు గ్రామానికి వెళ్లి శవ పంచనామా చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగేశ్వరరావు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment