ప్రియుడితో బంధం భర్తకు చెప్తాడనే భయంతో.. | Mother Arrested For Son Murder Case Sattenapalli Guntur | Sakshi
Sakshi News home page

ప్రియుడితో బంధం భర్తకు చెప్తాడనే భయంతో..

Sep 20 2019 11:53 AM | Updated on Sep 20 2019 12:26 PM

Mother Arrested For Son Murder Case Sattenapalli Guntur - Sakshi

సాక్షి, రాజుపాలెం(సత్తెనపల్లి): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో తొమ్మిదేళ్ల కన్న కొడుకుని ప్రియుడితో కలసి కిరాతకంగా హత్య చేసిన తల్లి ఉదంతం ఇది. తొమ్మిది నెలల తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించారు. పోలీసుల కథనం మేరకు... మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన షేక్‌ జాన్‌వలి, సైదాబీ దంపతులకు కుమారుడు విజ్వాన్‌ (9), ఓ కుమార్తె ఉన్నారు. జాన్‌వలి కరెంటు పనులు చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. దీనిని ఆసరాగా తీసుకున్న భార్య సైదాబీ అదే గ్రామానికి చెందిన అవివాహితుడు వడ్లమాను శ్రీకాంత్‌రెడ్డితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో రోజూ శ్రీకాంత్‌రెడ్డి సైదాబీ ఇంటికి వచ్చి వెళుతున్నాడు. ఇది గమనించిన కుమారుడు తల్లిని మన ఇంటికి అతను ఎందుకు వస్తున్నాడని ప్రశ్నించాడు. విషయాన్ని నాన్నకు చెబుతానని అన్నాడు. దీంతో భయపడిన జాన్‌బీ తన వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడని భావించింది. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలసి పన్నాగం పన్నింది.

పథకం ప్రకారమే హత్య...
తల్లి, ప్రియుడు కలసి విజ్వాన్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 2018 డిసెంబర్‌ 15వ తేదీ సాయంత్రం ఇంటి ముందు ఆడుకునే విజ్వాన్‌ను శ్రీకాంత్‌రెడ్డి మీ అమ్మ నిన్ను తీసుకురమ్మన్నదని బైకుపై ఎక్కించుకొని బీరవల్లిపాయ అడవి సమీపంలోకి చేరాడు. అప్పటికే అక్కడ సైదాబీ వేచి ఉంది. ద్విచక్ర వాహనంపై సైదాబీని కూడా ఎక్కించుకుని దట్టమైన బీరవల్లిపాయ కొండల సమీపంలోకి తీసుకెళ్లారు. విజ్వాన్‌ను తల్లి రెండు కాళ్లు పట్టుకోగా ప్రియుడు శ్రీకాంత్‌రెడ్డి బాలుడి తలపై అతి కిరాతకంగా రాయితో కొట్టి చంపారు. తరువాత మృతదేహాన్ని ఇద్దరూ కలసి ఈడ్చుకుంటూ గుట్టల్లోకి విసిరి పడేశారు. ఆ తరువాత వారిద్దరూ ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోయారు. 

ఫోన్‌కాల్‌ లిస్టు ఆధారంగా...
ఇటీవల రూరల్‌ ఎస్పీ జయలక్ష్మి పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించడంతో సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో పిడుగురాళ్ల రూరల్‌ సీఐ ఎం.రత్తయ్య, ఎస్‌ఐలు అనంతకృష్ణ, రాజశేఖర్‌బాబు, ట్రైనింగ్‌ ఎస్‌ఐ వెంకటరవి దర్యాప్తును ముమ్మరం చేశారు. తల్లి సైదాబీ ఫోన్‌కాల్‌ లిస్టు ఆధారంగా ప్రియుడు శ్రీకాంత్‌రెడ్డి ప్రమేయం ఉందని భావించారు. తల్లిని, ప్రియుడు శ్రీకాంత్‌రెడ్డిని  విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారే బాలుడిని హత్య చేశారని తేల్చారు. దీంతో నిందితులిద్దరినీ గురువారం సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచారు. చదవండి : అత్తారింటికి వెళ్తే.. మర్మాంగాన్ని కోసేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement