
నుజ్జునుజ్జు అయిన కారు
గుంటూరు, దాచేపల్లి : క్రిస్మస్ పండుగను ఆనందంతో జరుపుకున్న ఓ కుటుంబాన్ని పొగమంచు కాటేసింది. క్రిస్మస్ పండుగకు కుమారుడు, కుమార్తెకు కావాల్సిన దుస్తులు..ఇతర వస్తువులను తాత, తండ్రి కలిసి కొన్నారు. పండుగ సందర్భంగా చర్చిలో జరిగిన ప్రార్థనలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మను పలకరించేందుకు తండ్రి, భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి బయలు దేరారు. మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుతామని అనుకుంటున్న సమయంలో మృత్యువు పొగమంచు రూపంలో వచ్చి కాటేసింది. దాచేపల్లి గ్రామ సమీపంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై భవ్య పెట్రోల్ బంక్ ఎదురుగా బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెనాలికి చెందిన బేతపూడి పరంజ్యోతి(60), బేతపూడి బిపిన్‌చంద్(34) అక్కడికక్కడే మృతిచెందగా బిపిన్‌చంద్ భార్య చైతన్య తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. దాచేపల్లి ఎస్‌ఐ షేక్ మహ్మద్ రఫీ కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
తెనాలికి చెందిన బేతపూడి పరంజ్యోతి దంపతులు, వారి కుమారుడు బిపిన్‌చంద్, చైతన్య దంపతులు, బిపిన్ చంద్ కుమారుడు, కుమార్తె అర్నాల్డ్, ఏంజిలిన్‌తో కలిసి గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. బిపిన్‌చంద్ ట్రావెల్స్ సర్వీస్‌ను నడుపుతున్నాడు. క్రిస్మస్ వేడుకలను ముగించుకుని తెనాలిలో అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మను పలకరించేందుకు బిపిన్‌చంద్ భార్య, పిల్లలు, తండ్రి పరంజ్యోతితో కలిసి ఏపీ09 ఎజెడ్ 7703 నంబర్ కారులో బయలు దేరారు. మార్గమధ్యంలో దాచేపల్లిలో ఆగి టీ తాగారు. అనంతరం బిపిన్‌చంద్ కారు నడుపుతూ తెనాలికి బయలు దేరారు. పొగమంచు బాగా కురుస్తుండటం వలన రోడ్డు సక్రమంగా కన్పించలేదు. ఈ క్రమంలో భవ్య పెట్రోల్‌బంక్ ఎదురుగా ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు బలంగా ఢీకొట్టింది. కంటైనర్ లారీ వెనుకభాగంలో ఉన్న టైర్ల వరకు కారు దూసుకుపోవటంతో టాప్ లేచి నుజ్జునుజ్జు అయ్యింది. కారు నడుపుతున్న బిపిన్‌చంద్, ముందు సీట్లో కుర్చున్న పరంజ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వెనుక సీట్లో కుర్చోన్న బిపిన్ చంద్ భార్య చైతన్య తీవ్రంగా గాయపడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయి మృతిచెందిన బిపిన్‌చంద్, పరంజ్యోతిల మృతదేహాలను ఎంతో శ్రమించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన చైతన్యను హైవే అంబులెన్స్ వాహనం ద్వారా పిడుగురాళ్లకు తరలించారు.
మృత్యుంజయులు
రోడ్డు ప్రమాదంలో బిపిన్‌చంద్ కుమారుడు అర్నాల్డ్, కుమార్తె ఏంజిలిన్ మృత్యుంజయులుగా బయటపడ్డారు. కారు వెనుక సీట్లో తల్లి చైతన్య పక్కనే కూర్చున్న వీరు స్వల్ప గాయాలతో ప్రాణాలను దక్కించుకున్నారు. లారీని కారు ఢీకొట్టిన వెంటనే కారు వెనుకడోర్లు తెరుచుకొని వీరు కిందపడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. కళ్లముందు మృతిచెందిన తాత, తండ్రి మృతదేహల వద్ద అర్నాల్డ్, ఏంజిలిన్‌లు భోరున విలపించారు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లిని అంబులెన్స్‌లో వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment