తీగలాగితే కదిలిన అవినీతి డొంక | Home Guard Arrest In Prostitution Scandal Guntur | Sakshi
Sakshi News home page

తీగలాగితే కదిలిన అవినీతి డొంక

Published Mon, Nov 5 2018 1:08 PM | Last Updated on Mon, Nov 5 2018 1:08 PM

Home Guard Arrest In Prostitution Scandal Guntur - Sakshi

గుంటూరు రూరల్‌: వ్యభిచార గృహాల నిర్వాహకులను బెదిరించడంతో పాటు పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి భారీస్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్న హోంగార్డ్, గతంలో ఓ న్యూస్‌ చానల్‌ (సాక్షికాదు) లో పని చేసిన కెమేరామన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను బెదిరించి నగదు వసూలుకు పాల్పడిన ఘటనలో ఏఆర్‌ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు ఊహించని నిజాలు బయటపడ్డాయి. నగరంలోని నగరాలు ప్రాంతానికి చెందిన మల్లేశ్వరి వ్యభిచార గృహం నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో నగరంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డ్, గతంలో న్యూస్‌ చానల్‌లో పనిచేన కెమేరామన్‌లు ఆమెను బెదిరించి నగదు వసూలు చేశారు. నెలానెలా మూమూళ్లు ఇస్తే ఎవ్వరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడేవారు.

ఏఆర్‌ కానిస్టేబుల్‌ బెదిరింపులు
ఈ క్రమంలో రెండు రోజుల కిందట 6వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ మల్లేశ్వరి వద్దకు వెళ్లి రూ. 20 వేలను బెదిరించి వసూలు చేశాడు. దీంతో ఆమె గతంలో తనకు హామీ ఇచ్చిన హోంగార్డు, కెమేరామన్‌కు ఫోన్‌ ద్వారా విషయాన్ని చెప్పింది. దీంతో ఇద్దరు కలసి ఏఆర్‌ కానిస్టేబుల్‌పై నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఊహించని నిజాలు బయట పడ్డాయి. కెమేరామన్, హోంగార్డులే బెదిరిపులకు పాల్పడుతూ వసూళ్లు చేస్తుంటారని తెలిసింది. దీంతో వారినీ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా బాగోతం బయటపడింది.

పలు స్టేషన్లలో కేసుల నమోదు
గతంలోనూ హోంగార్డు, మాజీ కెమేరామన్‌ ఇదే విధంగా వసూళ్లకు పాల్పడ్డ ఘటనల్లో నగరంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కెమేరామన్‌ గతంలో పాత గుంటూరుకు చెందిన ఒక మహిళను  బెదిరించి నగదు వసూలు చేశాడు. దీంతో ఆమె జిల్లా ఎస్పీని సంప్రదించగా పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.  నగరంలోని ఈస్ట్, వెస్ట్‌ పరిధిలో మరో రెండు పోలీస్‌స్టేషన్లలో ఇద్దరిపై కేసులు నమోదైనట్లు సమాచారం. అయినా, వారిలో మార్పు రాలేదు. నగరంలోని పలు వ్యభిచార గృహాల నిర్వాహకుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. గతంలో నగరంపాలెంలో ఓ పత్రికా విలేకరి ఇదే విధంగా వ్యభిచారం నిర్వాహకురాలిని బెదిరించి నగదు వసూళ్లకు పాల్పడిన ఘటనలో ప్రస్తుతం అదుపులోఉన్న కెమేరామన్‌ హస్తం ఉన్నట్లు సమాచారం. బెందిరింపులే ప్రవృత్తిగా హోంగార్డు అండతో నగరంలోని నగర శివారుల్లోని వ్యభిచార గృహాల్లో లక్షలాది రూపాయలు వసూళ్లు చేశాడని సమాచారం.

బెదిరింపులకు పాల్పడేది ఇలా...
ముందుగా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారి ఆచూకీ  తెలుసుకుని అది ఏస్టేషన్‌ పరిధిలోకి వస్తుందో చూస్తారు. అనంతరం ఆ స్టేషన్‌కు వెళ్లి అక్కడ వారికి అనుకూలమైన కానిస్టేబుల్‌ను ఎంచుకుని అతని సహాయంతో హోంగార్డ్, కెమేరామన్‌లు వారిని బెదిరిస్తారు. ఒకవేళ కానిస్టేబుల్‌ వారికి అనుకూలించకపోతే అతనిపై లేనిపోని ఆరోపణలు చూపి అతనిని బెదిరించి వారి వైపునకు మలుచుకుంటారు. దీంతో చేసేదిలేక కానిస్టేబుల్స్‌ సైతం వారు చెప్పినట్లు ఆడుతుంటారని సమాచారం. ఈ క్రమంలో వ్యభిచార గృహాల నిర్వాహకుల నుంచి వచ్చే నగదును అందరూ పంచుకునేవారని తెలిసింది. ఈ విధంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారి వద్ద నుంచి లక్షల్లో నగదును వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.

నిందితుల అరెస్టు
ఎట్టకేలకు నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని తెలిసింది. అయితే, వీరితో పాటు వ్యభిచార గృహాల నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తేగానీ ఇటువంటి అరాచక శక్తులకు అడ్డుకట్ట పడదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement