
సాక్షి, సత్తెనపల్లి: ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని మనస్థాపానికి గురైన ప్రేమికులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లి పట్టణంలోని స్వామి వివేకానంద నగర్‌లో సోమవారం వెలుగు చూసింది. పట్టణంలోని 14వ వార్డుకు చెందిన బోండాట ప్రదీప్తి (17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పట్టణంలోని 23వ వార్డుకు చెందిన దేవళ్ల కిరణ్‌కుమార్ అలియాస్ సాయి కిరణ్‌కుమార్ (21) తాపీ పనులు చేస్తుంటాడు. గతంలో ఇద్దరి ఇళ్లూ దగ్గరగా ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు.
ఐదు నెలల క్రితం పెద్దలకు తెలియడంతో ఇరు కుటుంబాల పెద్దలు మందలించారు. మూడు నెలల క్రితం పట్టణ పోలీసు స్టేషన్‌లో యువతి తల్లి అరుణ ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్ కుమార్‌ను రాజమండ్రికి పంపారు. ఇద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ ఆదివారం రాత్రి 2.30 గంటల సమయంలో ప్రదీప్తి ఇంటి నుంచి బయటకు రాగా, కిరణ్‌కుమార్ రాజమండ్రి నుంచి వచ్చాడు. ఇదరూ కలిసి వివాహం చేసుకుని స్వామి వివేకానంద నగర్‌లోని చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
‘అమ్మ, నాన్న, అత్త, మామయ్య మమ్మల్ని క్షమించండి. మేము విడిపోయి బతకలేము.. అందుకే చచ్చి పోతున్నాం.. మా చావుకు ఎవరూ బాధ్యులు కాదు... అందుకే పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా చచ్చిపోతున్నాం.. మమ్మల్ని క్షమించండి’... అంటూ డి.సాయికిరణ్‌కుమార్, డి.ప్రదీప్తి పేర్లతో సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ సీఐ నరసింహారావు, ముప్పాళ్ల ఎస్సై నజీర్ బేగ్‌లు సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.