సాక్షి, యనమదల (ప్రత్తిపాడు): సర్వే అంటూ ఇంటి తలుపుతట్టాడు.. బీమా అంటూ కల్లబొల్లి మాటలు చెప్పాడు.. ముఖంపై పౌడర్ చల్లి బంగారు నగలతో ఉడాయించాడు.. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోనికి వెళితే.. యనమదల గ్రామానికి చెందిన గట్టు మల్లేశ్వరికి ముగ్గురు సంతా నం. అందరికీ వివాహాలు చేసింది, నాలుగేళ్ల కిందట భర్త చనిపోవడంతో యనమదలలో ఒంటరిగా నివసిస్తోంది.
బుధవారం ఉదయం ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో సుమారు 40 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పిలిచాడు. మీకు పింఛన్ వస్తుందా? రేషన్ బియ్యం సక్రమంగా అందుతున్నాయా? పొలం ఎంత ఉంది? ఆదాయమెంత? అంటూ మాటలు కలిపాడు. మీకు భర్త లేడు కదా..మీకు ఇన్సూరెన్స్ డబ్బులు రూ.16 లక్షలు వస్తాయి, ముందస్తుగా డిపాజిట్‌గా రూ.లక్షా ఇరవై ఐదు వేలు చెల్లించాలని చెప్పాడు. ఇప్పటికప్పుడు డబ్బులు కట్టలేని పక్షంలో మీ దగ్గర బంగారం ఉంటే ష్యూరిటీ కింద ఇవ్వండి, ఫొటో తీసుకుని మీ బంగారం మీకు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికాడు.
దీంతో మల్లేశ్వరి ఇంట్లోకి వెళ్లి బీరువాలో నాలుగు సవర్ల చంద్రహారం, గొలుసు తెచ్చి ఆగంతకుడికి ఇచ్చింది. ఫొటోలకని మరో రూ.వెయ్యి కూడా ఇచ్చింది. అంతే ఆగంతకుడు మల్లేశ్వరి ముఖంపై పౌడర్ చల్లాడు. దీంతో ఆమె మగతకు గురైంది. తేరుకుని చూసేలోపలే ఆగంతకుడు బైక్‌పై పారిపోయాడు. ఆ వ్యక్తి ఆనవాళ్లను బాధితురాలు పోలీసులకు తెలిపింది. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment