పచ్చని కాపురాల్లో చిచ్చు! | Extra Marital Affair Cases Are Rampant In Guntur District | Sakshi
Sakshi News home page

పచ్చని కాపురాల్లో చిచ్చు!

Published Thu, Aug 15 2019 8:03 AM | Last Updated on Thu, Aug 15 2019 8:03 AM

Extra Marital Affair Cases Are Rampant In Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: వివాహేతర సంబంధాల కారణంగా కొందరు నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కారణం ఏదైనా తీసుకునే నిర్ణయాలతో పచ్చని కాపురాల్లో అంధకారం నింపుకుంటున్నారు. వివాహేతర సంబంధాలను నెరుపుతూ ఆపై భార్య లేదా భర్తను అడ్డు తొలగించుకునేందుకు హత్యలకు సైతం వెనుకాడటం లేదంటే మానవత్వం వారిలో ఎంతగా దిగజారి పోయిందో అర్థం చేసుకోవచ్చు. అభం శుభం తెలియని చిన్నారులు చేయని తప్పుకు జీవిత కాలం తల్లిదండ్రులు లేక శిక్షను అనుభవిస్తున్నారు.  పెద్దలు చెప్పిన మాటలు పెడచెవిన పెడుతున్న కొంతమంది వారి జీవితాలను చేజేతులా అంధకారం చేసుకోవడంతో పాటుగా జైలు పాలవుతున్నారు. సమాజంలో గౌరవాన్ని కోల్పోతున్నారు.

ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు పరిశీలిస్తే...
జిల్లాలో ఇటీవల జరిగిన పలు ఘటనలను పరిశీలిస్తే అసలు మానవ సంబంధాలు ఉన్నాయా... మంటగలిసిపోయాయా.. అనే అనుమానం కలగకమానదు. గడచిన వారం రోజుల వ్యవధిలో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే... ఇటీవల దుగ్గిరాలలోని చెన్నకేశవనగర్‌కు చెందిన సీహెచ్‌ వెంకట పద్మావతి (35) భర్తతో విడిపోయి కుమారుడితో కలసి ఉంటుంది. పెనుమాలి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డితో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఆమె ప్రవర్తన పై అనుమానం రావడంతో సుబ్బారెడ్డి ఈ నెల 10న బలవంతంగా ఆమెతో సల్ఫస్‌ మాత్రలు మింగించి హతమార్చాడు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అంకె ఏడుకొండలు భార్యతో తోటి గొర్రెల కాపరి పి.నాగయ్య వివాహతేర సంబంధం కొనసాగిస్తున్నాడు.  తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని ఎలాగైనా ఏడుకొండలను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని సమీప అటవీ ప్రాంతంలో తల మొండం వేరు చేసి పాశవికంగా హతమార్చాడు. 

పిడుగురాళ్ళ పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన మీసాల మధు సమీపంలోని మరో యువతితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని భావించి యువతి తల్లితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ఈ నెల 9న దారుణంగా హతమార్చి రైల్వే ట్రాక్‌ పక్కన పడేశారని బంధువులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టడంతో  పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా చివరకు బాధితులు, నిందితుల కుటుంబాల్లోని చిన్నారులు తల్లిదండ్రులకు దూరం కావాల్సి రావడం విచారకరం. 

జీవితాలను అంధకారం చేసుకోవద్దు
కొద్దిపాటి మనస్పర్ధలు కారణంగా నిండు జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. సమస్యలు ఉంటే ఇరు కుటుంబాల్లోని పెద్దల సమక్షంలో కూర్చొని పరిష్కరించుకోవాలి. అవగాహన లేకుండా అహంభావాలకు వెళ్లి పుట్టిన పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయవద్దు. వారిని అమ్మానాన్నాల ప్రేమ నుంచి దూరం చేయవద్దు. వివాహేతర సంబంధాలను పెట్టుకొని ఇద్దరు జీవితాలను నాశనం చేసుకోవద్దు. సమస్యలు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయండి. చట్ట పరిధిలో న్యాయం చేస్తాం. 
- పీహెచ్‌డీ రామకృష్ణ, అర్బన్‌ ఎస్పీ

యువత అప్రమత్తంగా ఉండాలి
పెళ్లి అనే పవిత్ర బంధానికి ఇద్దరూ విలువ ఇవ్వాలి. ఇద్దరూ ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. అర్థం చేసుకోవడంలో ఏర్పడే తేడాల కారణంగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరం. విచక్షణ కోల్పోతే జీవితం నాశనం కావడంతో పాటుగా విలువలు కోల్పోయి సమాజంలో జీవించాల్సి ఉంటుంది. జన్మనిచ్చిన పిల్లల భవిష్యత్‌ను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా యువత మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 
- ఆర్‌.జయలక్ష్మి, రూరల్‌ ఎస్పీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement