వచ్చీరాని వైద్యం.. ప్రాణాలతో చెలగాటం | RMP Doctors Giving Fake Medicines To Patients In Guntur | Sakshi
Sakshi News home page

అను‘మతి’ లేకుండానే వైద్యం

Published Fri, Sep 13 2019 12:48 PM | Last Updated on Fri, Sep 13 2019 12:53 PM

RMP Doctors Giving Fake Medicines To Patients In Guntur - Sakshi

వారు కేవలం ఫస్ట్‌ ఎయిడ్‌... అంటే ప్రాథమిక చికిత్స మాత్రమే చేయడానికి అర్హులు. కాని వారు ఎంఎస్‌  సర్జన్ల మాదిరిగా ఆపరేషన్లు కూడా చేసి పారేస్తుంటారు. కమీషన్ల కోసం ఇబ్బడిముబ్బడిగా నోటికొచ్చిన మందులు, యాంటీబయాటిక్స్‌ రాసి పారేస్తుంటారు. అవి వాడిన రోగులకు కొత్తరోగాలు, రావడం, కిడ్నీలు ఫెయిలవడమే కాకుండా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. వీరిపై ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో గ్రామీణుల ప్రాణాలతో వీరు చెలగాటమాడుతున్నారు.

సాక్షి, గుంటూరు మెడికల్‌ : పట్టుమని పదో తరగతి కూడా చదవరు... అయినా పల్లెటూరులో పెద్ద డాక్టర్‌గా చెలామణి అవుతుంటారు...చిన్న గదిలోనే పెద్ద ఆస్పత్రి మాదిరిగా సెలైన్‌లు పెట్టడం, మందులు పెట్టి అమ్మటం, గాయాలకు కుట్లు వేయటం చేస్తూ అను‘మతి’ లేని వైద్యంతో గ్రామీణుల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. గ్రామంలోనే ఉండటంతో గ్రామీణుల ఆర్థిక స్థితిగతులపై అవగాహన కల్గి ఏదైనా రోగం వచ్చినప్పుడు వారిని వైద్యం పేరుతో దోచేస్తున్నారు. వారిపై పర్యవేక్షణ ఎవరు చేయాలనే దానిపై వైద్యాధికారుల్లో స్పష్టత లేకపోవటంతో ఇష్టానుసారంగా వైద్యం చేస్తూ ఒక రోగంతో వెళ్లిన వారికి ఇతర రోగాలు సోకే విధంగా వైద్యం అందిస్తున్నారు.

మచ్చుకు కొన్ని ఉదాహరణలు...
ఆర్‌ఎంపీల వైద్యంతో ముఖం నల్లగా మారి కంటిచూపు పోయిందని ఫిరంగిపురానికి చెందిన కేసనపల్లి కుమారి 2017 మే నెలలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు జ్వరం రావటంతో గ్రామంలోని ముగ్గురు ఆర్‌ఎంపీల వద్ద వైద్యసేవలను పొందింది. వారు ఇచ్చిన మందులను మింగటం వల్లే తన ముఖం నల్లగా మాడిపోవటంతో పాటుగా కంటిచూపు కూడా పోయిందని బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. గర్భం ధరించిన ఓ మహిళకు 2018లో అమరావతిలో ఓ ఆర్‌ఎంపీ అబార్షన్‌ చేయటం, తీవ్ర రక్తస్రావమై సదరు మహిళ ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి రాకుండా రాజీపడే కేసులు చాలా ఉంటాయి. కేవలం ఫస్ట్‌ ఎయిడ్‌ చేసే అర్హత మాత్రమే ఉన్న కొంతమంది ఆర్‌ఎంపీలు, పీఎంపీలు స్పెషాలిటీ పీజీ చేసిన వైద్యులు కూడా చేయని ఆపరేషన్‌లు, వైద్యాన్ని చేస్తూ గ్రామీణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

జ్వరాల సీజన్‌లో అప్రమత్తంగా లేకపోతే...
నేడు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జ్వరాల కేసులు నమోదవుతూ ఉన్నాయి. జ్వరాలతో పాటుగా అప్పుడప్పుడు డయేరియా కేసులు కూడా నమోదువుతున్నాయి.  గ్రామీణ రోగులకు ఆర్‌ఎంపీలు అందుబాటులో ఉండటంతో జ్వరపీడితులు వెంటనే వారిని ఆశ్రయిస్తున్నారు. కొంతమంది గ్రామీణ వైద్యులు జ్వరపీడితులను  ప్లేట్‌లెట్స్‌ తగ్గాయంటూ భయపెట్టి పట్టణాల్లో ఆస్పత్రుల్లో చేర్పించి ఆర్థికంగా గుల్ల చేస్తున్నారు. పట్టణాల్లోని ఆస్పత్రుల్లో రోగిని చేర్పించినందుకు రోగికి లక్ష రూపాయలు బిల్లు అయితే అందులో రూ.30,000 నుంచి రూ.40,000 ఆర్‌ఎంపీ, పీఎంపీలకు పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు కమీషన్‌గా ఇస్తున్నారు.

కొన్ని పట్టణాల్లో కేవలం ఆర్‌ఎంపీలు, పీఎంపీలు పంపించే రోగులపైనే ఆధారపడి ప్రైవేటు ఆస్పత్రులు నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఏ రోగికి ఎంత వరకు బిల్లు వేయవచ్చనే విషయాన్ని ఆర్‌ఎంపీలు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులకు తెలియజేస్తారు. అందుకు ప్రతిఫలంగా ఆస్పత్రుల నిర్వాహకులు నెలకోమారు, లేదా మూడు నెలలకు ఒకసారి ఆర్‌ఎంపీలకు సమావేశాలు ఏర్పాటు చేసి విందు భోజనాలతో పాటుగా భారీగా బహుమతులు, కమీషన్లు ఇచ్చి ప్రసన్నం చేసుకుంటున్నారు. వైద్యాధికారులు ఈ సీజన్‌లో ప్రైవేటు వైద్యులపై, ఆర్‌ఎంపీలు తప్పుడు ప్రాక్టీస్‌లపై ఓ కన్ను వేసి ఉంచకపోతే రోగులు బలైపోయే ప్రమాదం లేకపోలేదు.

కొంతమందికే అనుమతి...
జిల్లాలో సుమారు 4,000 మంది రూరల్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌(ఆర్‌ఎంపి), ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌(పీఎంపీ) వైద్యసేవలు అందిస్తున్నారు. కనీస అర్హతలు లేకుండా వీరు ఇష్టానుసారంగా వైద్యం చేసి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉండటంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ఏడాదిపాటు శిక్షణ కోర్సు ఏర్పాటుచేశారు. ఆ కోర్సు పూర్తిచేసిన వారు ప్రాక్టీస్‌ చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో 1,400 మంది మాత్రమే 2008–09లో శిక్షణ పొందారు. వైఎస్సార్‌ మరణంతో ఆ శిక్షణ కార్యక్రమం ఆగిపోయింది. టీడీపీ ప్రభుత్వం ఆర్‌ఎంపీలకు ప్రాక్టీస్‌ చేసుకునేందుకు ఇచ్చిన జీఓ వివాదాస్పదమై ఐఎంఏ వైద్యులు కోర్టులో కేసు వేశారు. శిక్షణ పొందకుండా ప్రాక్టీస్‌ చేసేవారిపై, అత్యాశతో పెద్ద డాక్టర్ల మాదిరిగా ఫస్ట్‌ఎయిడ్‌ కాకుండా ఇతర వైద్యసేవలు అందించేవారిపై, మందులు రాసే అర్హత లేకున్నా మందులు రాస్తూ షాపు కూడా నిర్వహిస్తున్న వారిపై, బయో మెడికల్‌ వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడే పడేసి అంటువ్యాధులు ప్రబలే విధంగా ప్రాక్టీస్‌ చేస్తున్న ఆర్‌ఎంపీలపై వైద్యాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

కిడ్నీలు ఫెయిల్యూర్‌ అవుతున్నాయి
గ్రామీణ వైద్యులు కొంత మంది రోగి తమ వద్దకు వెళ్లగానే డైక్లోఫినాక్, జెంటామైసిన్, ఎమికాసిన్‌ లాంటి నొప్పి నివారణ ఇంజెక్షన్లు, మాత్రలు ఇస్తున్నారు. బీపీ, షుగర్‌ బాధితులకు అధిక మొత్తంలో నొప్పి నివారణ మాత్రలు, ఇంజెక్షన్లు ఇవ్వటం ద్వారా వారికి కిడ్నీలు ఫెయిల్యూర్‌ అవుతున్నాయి. ఇలాంటి బాధితులు మా వద్దకు చికిత్స కోసం తరచుగా వస్తున్నారు. కొన్ని రకాల నొప్పి నివారణ మాత్రలు వారం నుంచి పదిరోజులు వాడితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది.
– డాక్టర్‌ చింతా రామకృష్ణ, సీనియర్‌ నెఫ్రాలజిస్ట్, గుంటూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement