నెక్కల్లు ఘటనలో మరో మహిళ మృతి | Woman Dies in Nekkallu Incident Guntur | Sakshi
Sakshi News home page

నెక్కల్లు ఘటనలో మరో మహిళ మృతి

Published Tue, Apr 16 2019 1:30 PM | Last Updated on Tue, Apr 16 2019 1:30 PM

Woman Dies in Nekkallu Incident Guntur - Sakshi

టీడీపీ నేతలు కారుతో తొక్కించడంతో మృతి చెందిన మహిళ(ఫైల్‌)

గుంటూరు, తుళ్లూరు(తాడికొండ): నెక్కల్లు గ్రామంలో ఈ నెల 5న జరిగిన ఘటనలో మరో మహిళ మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. టీడీపీ నేతల దాడిలో గాయపడిన బీసీలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయడానికి వెళుతుండగా, టీడీపీ నేతల  వెంటపడి కారుతో తొక్కించిన ఘటనలో మరో మహిళ పసుపులేటి వీరకుమారి(35) సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇళ్ల మధ్య ఉన్న ఇంటి స్థలాల విషయంలో చెలరేగిన వివాదంలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు అలూరి బ్రహ్మయ్య, ఆయన కుమారులు కలసి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు. కారుతో తొక్కించిన ఘటనలో  పసుపులేటి మహాలక్ష్మి(65) అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైం అప్పటినుంచి చికిత్స పొందుతున్న వీరకుమారి సోమవారం మరణించింది. పసుపులేటి కాటరాలు, పసుపులేటి బ్రహ్మయ్య, పసుపులేటి బాపయ్య, పసుపులేటి శిరీష, పసుపులేటి పిచ్చయ్య,  వెంకటలక్ష్మిలకు కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి.

అమ్మలేని అనాథలుగా చిన్నారులు
మృతురాలు వీరకుమారికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారు 9వ తరగతి, 8వ తరగతి చదువుతున్నారు. భర్త పసుపులేటి బాపయ్య కూడా ఈ ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. దంపతులిద్దరూ కూలి పనులకు వెళుతూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. తల్లి మృతి చెందడంతో చిన్నారులిద్దరూ తల్లి మృతదేహం వద్ద  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇద్దరు పిల్లల రోదన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. తల్లి మృతదేహం వద్ద ఇద్దరు చిన్నారులు.. ‘అమ్మా... లే అమ్మా అంటూ.. విలపిస్తున్న తీరు అక్కడికి చేరుకున్న వారి హృదయాలను కదిలించింది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బీసీ సంఘ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.

బాధితులకు న్యాయం చేయాలి
ఇద్దరు మహిళల మరణానికి కారణమైన నిందితులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలి. న్యాయం కోరుతూ పోలీస్‌ స్టేషన్‌కు వెళుతున్న బీసీలపై టీడీపీ నేతలు మానవత్వం మరచి కారుతో తొక్కించడం రాక్షస చర్య. పోలీసులు కేసును పక్కదోవ పట్టించకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. దుర్ఘటనలో మృతి చెందిన, గాయపడిన బీసీ కుటుంబాలకు న్యాయం జరిగేవరకూ వైఎస్సార్‌సీపీ వారికి అండగా ఉంటుంది.–ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement