
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సి.హెచ్.విజయారావు, వెనుక ముసుగులో ఉన్న నిందితులు
గుంటూరు: తండ్రీ కొడుకులను పథకం ప్రకారం హతమార్చిన ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సి.హెచ్.విజయారావు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం చంపాపేట గ్రామానికి చెందిన వేముల లక్ష్మయ్య, అతని కుమారుడు సురేష్ పొక్లయినర్‌ను రెండు నెలల క్రితం సచివాలయం నుంచి నూతనంగా నిర్మిస్తున్న సీడ్‌యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులకు తీసుకొచ్చారు. పొక్లయినర్ ఆపరేటర్‌గా జార్ఖండ్ రాష్ట్రంలోని కర్ఖేలా జిల్లా సుర్తాద్ గ్రామానికి చెందిన నాగేశ్వరకుమార్ బోక్తా అలియాస్ నరేష్‌ను, అతనికి అసిస్టెంట్‌లుగా అదే రాష్ట్రంలోని చాత్రా తాలూకా డెహురి గ్రామానికి చెందిన డెహురి అరవింద్ గంజు అలియాస్ చుల్హాన్, మరో మైనర్‌బాలుడిని నియమించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు చేస్తున్న క్రమంలో పొక్లయినర్‌లోని డీజిల్‌ను ముగ్గురూ కలిసి దొంగిలించి పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన శ్రీను, ధనుంజయ, అమర్‌బాబులకు విక్రయించారు.
విషయం పొక్లయినర్ యజమానులకు తెలియడంతో గత నెలలో వారు ముగ్గురిని లక్ష్మయ్య పనుల నుంచి తొలగించి, వారి స్థానంలో బీహార్ రాష్ట్రానికి చెందిన మరో ఆపరేటర్‌ను నియమించుకున్నాడు. తమను ఉద్దేశపూర్వకంగా పని నుంచి తొలగించారని పొక్లయినర్ యజమానులైన లక్ష్మయ్య, అతని కుమారుడు సురేష్‌లపై వారు కక్ష కట్టారు. ఈ క్రమంలో గతనెల 14వ తేదీ రాత్రి సమయంలో పొక్లయినర్ వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్లతో తండ్రీ కొడుకులను హతమార్చి సమీపంలోనే పది అడుగుల లోతు గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. తండ్రీ కొడుకుల వద్ద ఉన్న రూ.14వేల నగదు, సెల్‌ఫోన్‌లు తీసుకున్నారు. పొక్లయినర్‌లో ఉన్న 90 లీటర్ల డీజిల్‌ను కూడా దొంగిలించి, విక్రయించుకుని హైదరాబాద్ పరారయ్యారు.
అక్కడ వారి స్నేహితుడు ప్రతాప్‌కు సెల్‌ఫోన్లు అప్పగించి వారి స్వగ్రామానికి వెళ్లారు. ఇదిలా ఉంటే 14వ తేదీ ఇంటికి వస్తామని చెప్పిన తండ్రీ కొడుకులు రాకపోవడంతో అదేనెల 19వ తేదీన లక్ష్మయ్య భార్య కాలమ్మ, కుమారులు మంగళగిరి వచ్చి విచారించారు. ఆచూకీ తెలియకపోవడంతో మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పొక్లయినర్ నిలిపిన సమీపంలో అనుమానం రావడంతో తవ్వి చూడగా తండ్రీ కొడుకుల మృతదేహాలు లభించాయి. నిందితులు ముగ్గురూ శుక్రవారం పనుల కోసం మళ్లీ రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి మైనర్ బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచామని ఎస్పీ వివరించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులకు వస్తున్న ఇతర రాష్ట్రాల కూలీల వివరాలు సేకరిస్తున్నామని వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు వై.టి.నాయుడు, లక్ష్మీనారాయణ, డీఎస్పీ రామకృష్ణ, సీఐలు బాలాజీ, రవిబాబు పాల్గొన్నారు.