సాక్షి, తెనాలి: తాళి కట్టిన భర్త, చావు...చావు...అంటూ నిత్యం భౌతిక హింసకు పాల్పడటం, అడ్డుకోవాల్సిన అత్తమామలు ప్రోత్సహించటంతో మనస్తాపానికి లోనైన మహిళ, అందరి కళ్లెదుటే పురుగుమందు తాగి అత్తింటివారి ఆకాంక్షను నెరవేర్చాలని ప్రయత్నించింది. అయితే కోడలు మరణిస్తే, పోలీసు కేసవుతుందని భయపడినవారు హుటాహుటిని వైద్యశాలకు తరలించటంతో బాధితురాలు ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టిన తనను వరకట్నం కోసం వేధించి, హింసిస్తూ, పురుగుమందు తాగి చావమంటూ పదేపదే రెచ్చగొడుతూ చావుకు దగ్గర దాకా వెళ్లేలా చేసిన భర్త, అత్తమామలను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను వేడుతోంది. స్థానికంగా ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఆమె పేరు సునీత. చేబ్రోలు మండలం శేకూరుపాలెం గ్రామం. తండ్రి ఆర్టీసీ డ్రైవరు. తల్లి గృహిణి. ముగ్గురు సంతానంలో చివరి కుమార్తె సునీతను, మండల కేంద్రమైన దుగ్గిరాలకు చెందిన బండి కిశోర్‌కు ఇచ్చి 2017 ఆగస్టులో వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.4.5 లక్షల నగదు, అల్లుడుకి వాచి, ఉంగరం ఇచ్చారు. దుగ్గిరాల మండలంలోని చిలువూరులో విద్యుత్ సబ్‌స్టేషనులో కాంట్రాక్టు పద్ధతిపై ఆపరేటరుగా పనిచేస్తుండే కిశోర్, సునీతల కాపురం తొలి నెలరోజులు సజావుగానే సాగింది. తర్వాత నుంచి వేధింపుల పర్వం ఆరంభమైంది. భార్య అనాకారి అయింది. తెచ్చిన కట్నం కంటికి ఆనలేదు. అందంగా లేవు...కట్నం హీనంగా తెచ్చావ్...ఇంటి సామానులు ఏవీ తేలేదు..అంటూ భర్త సణగటం మొదలుపెట్టాడని సునీత చెప్పారు.
ఆ విధంగా సూటిపోటి మాటలతో మొదలైన వేధింపుల్లో భాగంగా, ఫోను వాడొద్దని షరతు పెట్టారు. తల్లిదండ్రులతో సహా పుట్టింటి తరఫు నుంచి ఎవరూ ఇంటికి రాకూడదని ఆంక్షలు విధించారు. తర్వాతర్వాత చీటికిమాటికి కొట్టటం ఆరంభించినట్టు సునీత కంటనీరు పెట్టారు. కారణం ఏమీ ఉండదు...బంధువులు ఎవరైనా వచ్చివెళ్లారన్న సాకు చాలు భర్తకు...వరసగా రెండురోజులు అకారణంగా హింసించటం అలవాటు చేసుకున్నాడని ఆరోపించారు. ఇలా హింసాపర్వ కాపురంలో 8 నెలల కిందట వారికి బాబు కలిగాడు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ, ఇప్పటివరకు అత్తమామలు బాబును ఒక్కసారి కూడా కనీసం దగ్గరకు తీసుకోలేదని సునీత చెప్పారు. తనపై హింసను అడ్డుకోలేదన్నారు.
అన్నయ్య వచ్చి వెళ్లాడని..
ఈ నేపథ్యంలో గత నెలలో విశాఖపట్నంలో ఉండే అన్నయ్య వచ్చి చెల్లిని, మేనల్లుడిని పలకరించి వెళ్లాడు. సునీత భర్త కిశోర్‌కు గత శనివారం ఈ విషయం మరోసారి గుర్తొచ్చింది. ‘మీ అన్న ఎందుకొచ్చాడు? నువ్వెందుకు రానిచ్చావు?’ అంటూ బాదటం మొదలుపెట్టాడట! సమీప గృహాల్లోని ఎవరో? సునీత తల్లిదండ్రులకు ఈ విషయాన్ని ఫోనులో తెలియపరిచారు. తల్లడిల్లిపోతూ దుగ్గిరాల వెళ్లిన సునీత తండ్రిని పట్టుకుని ‘మా ఇంటికెందుకు వచ్చారు? నేను రావద్దంటున్నా మీరెందుకు వస్తున్నారు’అని అల్లుడే స్వయంగా గద్దించటంతో, కూతురుని ఓదార్చాలని వచ్చిన ఆ తండ్రి మనసు రాయిచేసుకుని తిరిగివెళ్లిపోయాడు.
అది కూడా నేరమైందా ఇంటికి... చావు, చావు అంటూ భర్త మళ్లీ మళ్లీ కొట్టటమే కాకుండా, ఎనిమిది నెలల పసికందును ఎత్తి పడేయటంతో బతుకుపై విరక్తి చెందిన సునీత, ఇంట్లోనే ఉన్న కలుపు నివారణ మందు ‘గ్లైసిల్’ తాగేసింది. ఆ బాధతో యాతన పడుతున్న ఆమెను చూసి ‘యాక్టింగ్’ అని ఎగతాళి చేశారంట! అనుమానించిన మామ, ‘ఆస్పత్రికి తీసుకెళ్లండ్రా...చస్తే కేసవుతుంది...!’ అని హెచ్చరించటంతో తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం అక్కడే కోలుకుంటోంది. విచారించటానికి వచ్చిన పోలీసులకు భర్త చేసిన దారుణాలను ఏకరువు పెట్టి, కేసు నమోదుచేసి, న్యాయం చేయాలని అభ్యర్థించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment