
సాక్షి, గుంటూరు:క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ బుకీల ఆట కట్టించి మరికొందరు ఈ వ్యసనానికి బలికాకుండా చూడాలనే ఉద్దేశంతో గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేట కొనసాగిస్తున్నారు. అయితే జిల్లాకు చెందిన కీలక క్రికెట్ బుకీలంతా సెల్‌ఫోన్లు పక్కన పడేసి గత వారం రోజులుగా కుటుంబ సభ్యులతో సైతం సంబంధాలు లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, కారంపూడి, సత్తెనపల్లి, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన క్రికెట్ బుకీలంతా వైజాగ్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకుంటూ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నరసరావుపేట, గుంటూరుకు చెందిన పలువురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని వీరి నుంచి బుకీల సమాచారంతో పాటు, వీరికి సహకరిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లను సైతం వారి నుంచి సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో కీలక క్రికెట్ బుకీలంతా టీడీపీ నేతల అండతో పోలీసుల కంటపడకుండా కలుగులోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న కొందరు కీలక బుకీలు మాత్రం పోలీసులు తమ జోలికి రాకుండా కొందరు టీడీపీ ముఖ్యనేతలు, పోలీసు అధికారులకు సైతం భారీ మొత్తంలో ఆఫర్లు పెడుతున్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు, రాజధాని ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, డెల్టా ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి సైతం క్రికెట్ బుకీలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
క్రికెట్ బుకీల కోసం టాస్క్‌ఫోర్స్ బృందాల గాలింపు
జిల్లాలో రూరల్ ఎస్పీ ఎస్.వి. రాజశేఖర్‌బాబు ఇద్దరు సీఐలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి క్రికెట్‌బుకీల కోసం వేట కొనసాగిస్తున్నారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు, చిలకలూరిపేట, పిడుగురాళ్ళ తదితర ప్రాంతాలకు చెందిన మరికొందరు కీలక బుకీలంతా రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిసింది. సెల్‌ఫోన్లు ఉంటే టెక్నాలజీ ద్వారా, ఎక్కడ పోలీసులు తమ ఆచూకీ తెలుసుకుంటారోననే భయంతో వాటిని సైతం పక్కన పడేసి కుటుంబం సభ్యులతో సైతం మాట్లాడకుండా వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వ్యవహారంలో ఎవరిని నమ్మాలో తెలియని ఎస్పీలు కొందరు పోలీసు అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బుకీల కోసం వేట సాగిస్తున్నారు. ఇవి కొంతమేరకు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్న ఇంటి దొంగలపై రూరల్ ఎస్పీ సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలిసింది. క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకుని బెట్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు, సిబ్బంది పనిపట్టేందుకు రూరల్ ఎస్పీ సంకల్పించారు. జిల్లాలో క్రికెట్ బెట్టర్ల నుంచి నెలవారి మామూళ్లు తీసుకుంటున్న పోలీసు అధికారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
అవినీతి పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు
క్రికెట్ బుకీల నుంచి భారీ మొత్తంలో మామూళ్లు వసూలు చేస్తున్న అవినీతి పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలైనప్పటి నుంచి క్రికెట్ బుకీల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ వారికి సహకరిస్తున్న పోలీసు అధికారులు టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటుతో వణికిపోతున్నారు. ఇప్పటికే గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో గుట్కా మాఫియా నుంచి డబ్బులు వసూలు చేసిన పోలీసు అధికారులపై రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు చర్యలకు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సైతం అవినీతి పోలీసు అధికారులపై చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ఎవరిపై వేటు పడుతుందోననే భయాందోళనలో కొందరు పోలీసు అధికారులు ఉన్నారు. తమకు మామూళ్లు ఇచ్చిన క్రికెట్ బుకీలను అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలంటూ సదరు పోలీసు అధికారులే సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment