మారని తీరు.. బెట్టింగుల జోరు! | Cricket Betting Gang Arrest In Guntur | Sakshi
Sakshi News home page

మారని తీరు.. బెట్టింగుల జోరు!

Published Sat, Aug 4 2018 1:24 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Cricket Betting Gang Arrest In Guntur - Sakshi

నరసరావుపేట రామిరెడ్డిపేటకు చెందిన రహీం డిగ్రీ చదివాడు. ఆటోకన్సల్‌టెంట్‌గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తనకు వస్తున్న ఆదాయం సరిపోక బెట్టింగ్‌లు నిర్వహిస్తూ అక్రమ ధనార్జనకు అలవాటు పడ్డాడు. ఇతడిపై నరసరావుపే–1, నరసరావుపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు ఉన్నాయి. సుమారు నెల రోజుల కిందట నరసరావుపేట రూరల్‌ పోలీస్‌ అధికారులు ఇతడిని అరెస్టు చేయగా బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయినా ఇతని ప్రవర్తనలో మార్పురాలేదు. మళ్లీ బెట్టింగ్‌లు మొదలుపెట్టి గురువారం అర్ధరాత్రి గుంటూరు రూరల్‌ పోలీసులకు పట్టుబడ్డాడు.

సాక్షి, గుంటూరు: ఐపీఎల్‌ సీజన్‌ అయిపోయినా బెట్టింగ్‌ రాయుళ్ల జోరు మాత్రం తగ్గడం లేదు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో జరిగే ప్రీమియర్‌ లీగ్‌లు, టెస్ట్‌లు, వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు దాడుల్లో చాలా మంది పట్టుబడుతూ, జైల్లో శిక్ష కూడా అనుభవిస్తున్నారు. కానీ వారిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అరెస్టయిన ప్రతిసారీ బెయిల్‌పై బయటికి వచ్చి దందా సాగిస్తున్నారు. ఫంటర్‌లుగా అరెస్టు అయిన వారు సబ్‌బుకీలు, బుకీలుగా మారుతున్నారు. జిల్లాలో రోజు రోజుకి బెట్టింగ్‌లు నిర్వహించే వారు, వారి మాయ మాటలు నమ్మి బెట్టింగ్‌లకు పాల్పడి సర్వం కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు అరికట్టాలని ప్రయత్నిస్తున్నా బెట్టింగ్‌ మాఫియా మాత్రం ఎక్కడో చోట దందా సాగిస్తూనే ఉంటోంది.

రూరల్‌ పరిధిలో భారీగా అరెస్టులు..
ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ పోలీసులు 190 మందికి పైగా క్రికెట్‌ బెట్టింగ్‌ బుకీలు, సబ్‌బుకీలు, బెట్టింగ్‌ రాయుళ్లని అరెస్టు చేశారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రా>వడం లేదు. బెయిల్‌పై బయటికి వచ్చి తిరిగి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 20–20 మ్యాచ్‌లపై నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న 15 మంది సభ్యులతో కూడిన భారీ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను గుంటూరు రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఆరు మంది పాత నేరస్తులే ఉండటం గమనార్హం. వీరిపై వివిధ ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్‌లలో క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులు ఉన్నాయి. అరెస్టయి తర్వాత బెయిల్‌ పై బయటికి వచ్చి వివిధ ప్రాంతాల్లోని బెట్టింగ్‌ నిర్వాహకులతో చానళ్లుగా ఏర్పడి భారీగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.

విద్యార్థులు, చిరుద్యోగులు..
సులువైన మార్గంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా చాలా మంది బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బుకీలు, సబ్‌బుకీల్లో చాలా వరకూ విద్యార్థులు, చిరుద్యోగులు ఉండటం కలవర పెడుతున్న అంశం. కొందరు క్రికెట్‌ బుకీలు యువకులకు మాయ మాటలు చెప్పి సబ్‌ బుకీలు మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మాటలు నమ్మిన అమాయక యువకులు సర్వం కోల్పోవడమే కాకుండా జైలు పాలవుతున్నారు.    

గేమింగ్‌ యాక్టునుకఠినతరం చేస్తాం..
క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ అరెస్టయిన వారు బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గేమింగ్‌ యాక్టును కఠినతరం చేస్తాం. బెయిల్‌పై బయట తిరుగుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నాం.  – సీహెచ్‌. వెంకటప్పల నాయుడు, గుంటూరు రూరల్‌ ఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement