దంపతుల మృతదేహాలను పరిశీలిస్తున్న ఎస్‌ఐ సత్యనారాయణ
గుంటూరు, ముసునూరు (నూజివీడు): తాగుబోతు భర్త ప్రవర్తనకు విసిగిపోయిన భార్య ఆత్మహత్యకు పాల్పడగా, భార్య మృతితో కేసులకు భయపడి భర్త ఉరి వేసుకుని చనిపోయిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కేవీజీవీ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాట్రేనిపాడు శివారు రాజీవ్‌నగర్‌కు చెందిన మేశపాము శివరామకృష్ణ (32), అతని భార్య నాగమల్లేశ్వరి ఆదివారం ఉదయం చనిపోయి ఉన్నట్లుగా తండ్రి కృపావరం గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన మేశపాము కృపావరం కుమారుడు శివరామకృష్ణకు కొండపర్వ గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరితో 3 నెలల క్రితం వివాహం జరిగింది. వీరిరువురికి గతంలో వేర్వేరుగా వివాహాలు జరిగాయి. ఆ సంబంధాల్లో అతనికి పాప, ఆమెకు బాబు ఉన్నారు. ఇటీవలే వీరిరువురికి వివాహం జరిగింది.
పెయింటర్‌గా పని చేస్తున్న శివరామకృష్ణ తాగి వచ్చి గొడవ చేస్తూ ఉండటంతో ఆమెకు అతనిపై విసుగు కలిగింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఉంగుటూరు మండలం పొట్టిపాడులో ఉంటున్న అతని తమ్ముడు కిషోర్ ఇంటికి వెళ్లారు. అక్కడ కూడా ఇదే విధంగా గొడవలు జరుగుతుండడంతో ఆమె గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమెను పొట్టిపాడు, వీరవల్లి, హనుమాన్ జంక్షన్‌లలోని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చినఅవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. శనివారం రాత్రి ఒంటి గంట సమయంలో మృతదేహాన్ని ఆటోలో కాట్రేనిపాడులోని ఇంటికి తీసుకు వచ్చారు. భార్య మృతి చెందగా, భయభ్రాంతుడైన శివరామకృష్ణ పురుగు మందు సేవించి, తర్వాత ఉరి వేసుకుని మృతి చెందాడు. నూజివీడు సీఐ మేదర రామ్‌కుమార్ మృతదేహాలను పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాలను నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తహసీల్దార్ కేబీ సీతారామ్ పంచనామా నిర్వహించారు. నవ దంపతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే విషయం మండలాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment