యదిత్యరాజు (ఫైల్)
గుంటూరు లీగల్/పట్నంబజారు(గుంటూరు): బాలుడిని కిడ్నాప్ చేసి, ఆపై అడిగినంత డబ్బులు ఇవ్వలేదని దారుణంగా హతమార్చిన కేసులో ముగ్గురు వ్యక్తులకు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ నాల్గో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎ.లక్ష్మి గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నక్కా శారదామణి కథనం ప్రకారం... ఏటీ అగ్రహారం జీరో లైనులో నివాసం ఉంటున్న నన్నం జయకుమారి, నాగరాజుల ఏకైక సంతానం యదీద్యరాజు (12) ఏటీఅగ్రహారం 8వ లైనులో శాంతన్ స్కూల్‌లో 6వ తరగతికి చదువుతున్నాడు. కారంపూడి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ముద్దాయి ఇరుగుల వీర వెంకట నాగ మణికంఠ అలియాస్ మణికంఠ అదే పాఠశాలలో కేర్ టేకర్‌గా పనిచేస్తున్నాడు. మణికంఠ ముప్పాళ్ల మండలం బొల్లాపల్లి గ్రామానికి చెందిన రామిశెట్టి గోపితో పరిచయం పెట్టుకుని అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో రెండు వేర్వేరు సంఘటనల్లో ఇరువురు వ్యక్తులను కిడ్నాప్ చేయాలని ప్రణాళిక వేసి విఫలం అయ్యారు.
2016, ఏప్రిల్ 14వ తేదీన కిడ్నాప్..
ఈ క్రమంలో మణికంఠ పనిచేస్తున్న పాఠశాలలోనే ఎవరినైనా విద్యార్థిని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలనే దురుద్దేశ్యంతో రామిశెట్టి గోపి చింతపల్లి గ్రామానికి చెందిన వేల్పుల పిచ్చయ్యను కలుపుకుని ముగ్గురు ప్రణాళిక వేసుకున్నారు. ఈ క్రమంలో శాంతన్ స్కూల్‌లో 6వ తరగతి విద్యార్థి యదీద్యరాజును కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో 2016, ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం పిల్లలు ఆటలు ముగించుకుని, తదుపరి ట్యూషన్ కూడా ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో మణికంఠ దారిలో కలిసి ఆరోజు తన పుట్టినరోజు అని నమ్మించి కేక్ కట్ చేయాలని యదీదిత్యరాజును ద్విచక్రవాహనంపై గోపితో కలిసి హౌసింగ్‌బోర్డు కాలనీలో తాను నివాసం ఉండే రూముకు తీసుకెళ్లారు. అక్కడ వీరితో పిచ్చయ్య కలిశాడు. యదీద్యరాజు దగ్గర అతని తల్లి ఫోన్ నంబరు తెలుసుకున్న మణికంఠ ఆమెను కలిసి మీ అబ్బాయిని కిడ్నాప్ చేశామని, రూ.15 లక్షలు ఇస్తే వదిలి పెడతామని డిమాండ్ చేశారు. 16వ తేదీ సాయంత్రం లోపు ఇవ్వకపోతే అబ్బాయిని చంపుతామని రాత్రి 9.30 గంటల సమయంలో ఫోన్ చేశారు. ముందు విషయం నమ్మక అబ్బాయి కోసం స్కూల్ వద్దకు వెళ్లి వాకబు చేయగా, అక్కడ వారు పిల్లాడి ఇంటికి బయల్దేరి వెళ్లినట్లు తెలుసుకున్నారు. యదీద్యరాజుకు కూల్‌డ్రింక్స్‌తో మత్తు బిళ్లలు కలిపి ఇవ్వడంతో స్పృహ కోల్పోయాడు.
ఈ విషయమై 15వ తేదీ యదీద్యరాజు తల్లి నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధితుల సూచనల మేరకు కిడ్నాపర్లు ఫోన్ చేసినప్పుడు వారి మాటలు రికార్డు చేయాలని సూచించారు. 15వ తేదీ కిడ్నాపర్లు ఫోన్ చేయగా, రూ. 15 లక్షలు ఇవ్వలేమని రూ. లక్ష ఇస్తామని చెప్పడంతో వారు కుదరదని చెప్పడంతో చివరకు రూ.2 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం మొత్తం జయకుమారి ఫోన్‌లో రికార్డు చేసింది. గుంటూరు రైల్వే స్టేషన్‌లోని మాచర్ల ట్రెయిన్‌లో చివరి పెట్టెలో రూ. 2 లక్షలతో ప్రయాణించాలని కిడ్నాపర్లు కోరగా, విజయకుమారి సోదరుడు రాజు రూ. 2 లక్షలు తీసుకుని ట్రెయిన్‌లో నుంచి వారు కోరిన చోట నగదు వేశారు. ట్రెయిన్‌లో గోపి ప్రయాణిస్తూ పోలీసు వారు కూడా మఫ్టీలో ఉన్నారని తెలుసుకుని ట్రెయిన్ నుంచి దూకి వెళ్లిపోయాడు. దీంతో ఆ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి యదీద్యరాజును కిడ్నాపర్లు కిరాతకంగా హత్య చేసి ఫిరంగిపురం మండలం 113 త్యాళ్లూరు పొలాల్లోని బావిలో పడేశారు. బావిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పొలం యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఎం.హైమారావు, కరీముల్లాలు కేసు దర్యాప్తు చేయగా, సీఐ సీతారామయ్య కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.
ఈ కేసులో 44 మంది సాక్షులు ఉండటంతో లైజన్ ఆఫీసర్ శివప్రసాద్, ఘన్‌సైద్, ఎం.డి.రఫీ, కోర్టు కానిస్టేబుల్, చంద్రశేఖరరెడ్డి, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంతో చొరవ చూపారు. నిందితులపై నేరం రుజువు కావడంతో పైమేరకు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
ఉరి తీసిన తప్పులేదు
చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా చంపారయ్యా. ఆఖరికి డబ్బులు కూడా ఇచ్చా. అవి తీసుకుని కూడా దుర్మార్గంగా వ్యవహరించి నా బిడ్డను పొట్టన బెట్టుకున్నారయ్యా. ఇటువంటి కిరాతకులను ఉరి తీసిన తప్పులేదు. నా బిడ్డ కిడ్నాప్ విషయంలో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన డీఎస్పీ కేజీవీ సరిత, సీఐ హైమారావుకు రుణపడి ఉంటాం. ఇటువంటి ఘటనలు జరగకుండా ఇదో గుణపాఠం కావాలి.
–జయకుమారి, యదిత్యరాజు తల్లి
Comments
Please login to add a commentAdd a comment