సాక్షి, గుంటూరు: లాలాపేటకు చెందిన శ్రీనివాస్ పోస్టులో వచ్చిన గిఫ్ట్ స్క్రాచ్ కార్డు నిజమని నమ్మి బ్యాంకు అకౌంట్‌లో రూ.40 వేలు వేసి మోసపోయాడు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి మిత్రులను సంప్రదిస్తే ఫలితం సున్నా అని తెలుసుకుని ఫిర్యాదు చేయడం మానుకున్నాడు. ఇలా ఎందరో సైబర్ నేరగాళ్ల బారిన పడి ఆర్థికంగా నష్టపోతున్నారు.
బ్లాక్ బిజినెస్ ఈ పేరు సామాన్య ప్రజలకు కొత్తేమో కాని పోలీసులకు సుపరిచితమే. బ్లాక్ టికెట్..బ్లాక్ మార్కెట్...బ్లాక్ మనీ.. తరహాలోనే సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి సంపాదించిన ధనాన్ని బ్లాక్ బిజినెస్ రూపంలో వెనుకేసుకుంటున్నారు. దీనితో సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు కష్టగా మారింది. ఒకవేళ సైబర్ నేరగాళ్లు దొరికినా నేరస్తులు చేస్తున్న బ్లాక్ బిజినెస్ కారణంగా పోలీసులకు వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేయడం కష్టమవుతుంది. ఫలితంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన సామాన్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.
వివిధ మార్గాలలో వివరాల సేకరణ
దేశంలో స్థిరపడిన నల్లజాతీయులు బ్లాక్ బిజినెస్‌కు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లలో అత్యధికులు ఆఫ్రికా దేశానికి చెందినవారే ఉంటున్నారు. వీరు ఆన్‌లైన్ మోసాలను ఈ–మెయిల్ మీద ఎస్‌ఎంఎస్, వాట్సప్ మెసేజ్, ఫోన్ కాల్‌తో ప్రారంభిస్తారు. మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు అనేక మార్గాల ద్వారా సేకరిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా లక్ష ఫోన్ నెంబర్లు ఈ మెయిల్ ద్వారా రూ. 30 వేలకు విక్రయించే వెబ్‌సైట్లు ఉన్నట్లు సమాచారం. వీటి ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్‌లు పోలీసులకు ఆధారాలు చిక్కకుండా పక్కా పథకం వేస్తున్నారు.
ఖాతాలకు బదులు వాలెట్ల వినియోగం
ఈ నైజీరియన్‌లు స్కీమ్‌లు, పన్నులు, పెట్టుబడులంటూ బాధితుల నుంచి సొమ్ము స్వాహా చేయడానికి బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. ఒకప్పుడు కేవలం బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయించుకునే వీళ్లు ఇటీవల కాలంలో వివిధ రకాలైన వాలెట్లను వాడుతున్నారు. వీటిని నైజీరియన్‌లు నేరుగా తెరిస్తే కేసు నమోదైనప్పుడు పోలీసులకు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముంబై, బెంగుళూరు, ఢిల్లీలతో పాటు ఈశాన్య రాష్ట్రాలోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏజెంట్లు బ్యాంకు ఖాతాలు, వాలెట్లు తెరిచి, వారి వ్యాపారానికి సహకరిస్తే ప్రతి లావాదేవీల్లో కమీషన్ ఇస్తారు. ఈ రకంగా కమీషన్ తీసుకుని తమ ఖాతాలు, వ్యాలెట్లను అప్పగించే వారిని సాంకేతిక పరిభాషలో మనీమ్యూల్స్ అంటారు. ఇలా చేయడం ద్వారా ఖాతాలు, వ్యాలెట్లు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య...ఏజెంట్లకు, నైజీరియన్లకు మధ్య ఏలాంటి లింకు లేకపోవడంతో సూత్రధారులు దొరకడం కష్టమవుతుంది.
వస్త్రాలు.. వస్తువులు
సైబర్ మోసాల ద్వారా సంపాదించిన సొమ్మును నగదు రూపంలో నైజీరియా తదితర ఆఫ్రికా దేశాలకు పంపడం ఇబ్బదికరం. అలాగని ఇక్కడే ఏ రూపంలో ఉంచిన పోలీసులు వీరు చిక్కినప్పుడు ఆ మొత్తాన్ని, వస్తువులను రికవరీ చేస్తారు. దీంతో మోసగాళ్లు బాధితుల నుంచి స్వాహా చేసిన సొమ్మును వస్తు, వస్త్ర రూపంలోకి మార్చేస్తున్నారు. వీటిని ఎగుమతుల పేరుతో తమ దేశానికి తరలిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ముఠాలో కొందరిని బిజినెస్ వీసాపై భారత్‌కు తీసుకువస్తారు. బాధితుల నుంచి కాజేసిన దాంట్లో కొంత సొమ్ము సైబర్ నేరగాళ్లు తమ వద్ద ఉంచుకుని, మిగిలినదాంతో హోల్‌సేల్‌గా వస్త్రాలు, ఎగుమతికి ఇబ్బంది లేని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని బిజినెస్ వీసాపై వచ్చిన వారికి అప్పగించడం ద్వారా కన్‌సైన్‌మెంట్ రూపంలో ఆయా ఆఫ్రికా దేశాలకు పంపిస్తున్నారు. ఆ దేశాలలో వస్త్రాలు, వస్తువులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కారణంగానే సైబర్ నేరాలలో నగదు రికవరీ చేయడం అసాధ్యంగా మారుతుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రజలు అప్పమత్తంగా ఉండటం తప్ప మరొక మార్గం లేదు.
అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల్లో నిందితుల నుంచి రికవరీ చేయడం కష్టంగా మారింది. మోసపోయిన వారు 24 గంటల్లో ఫిర్యాదు చేస్తే కొంత వరకు ఉపయోగం. నగదు ఆన్‌లైన్‌లో బదిలీ చేసినా, వ్యాలెట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేసినా అది క్లియర్ కావడానికి కనీసం 24 గంటలు పడుతుంది. నేరగాళ్లు ఏటీఎం ద్వారా నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ఒకే సారి విత్ర్‌డ్రా చేయలేరు. వెంటనే బ్యాంకును సంప్రదించడం ద్వారా విత్‌డ్రా కాకుండా ఆపి రికవరీ చేయవచ్చు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలి.
–నజీముద్దీన్, ఈస్ట్ డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment