చందనకు ఓ కొత్త నంబరు నుంచి ఫోన్ వచ్చింది. ‘చందన గారు మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.30 వేలు షాపింగ్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ అవతలి వ్యక్తి చెప్పడంతో షాక్‌కు గురైంది. తాను ఎలాంటి షాపింగ్ చేయలేదని ఆమె అనడంతో చెక్ చేస్తానంటూ అవతలి వ్యక్తి క్రెడిట్ కార్డు నంబర్, సీవీవీ, పిన్ నంబర్లు అడిగాడు. అసలే కంగారులో ఉండడం, ఫోన్ చేసిన అపరచితుడు పేరుతో సంబోధించడంతో ఆమె వివరాలు చెప్పేసింది. ‘సారీ.. ఆ షాపింగ్ మీ క్రెడిట్ కార్డు నుంచి జరగలేదంటూ అవతలి వ్యక్తి ఫోన్ పెట్టసాడు. సీన్ కట్ చేస్తే.. ఆ వివరాలు వినియోగించి ‘ఫోన్ కాలర్’ ఆన్‌లైన్ ద్వారా రూ.50 వేలు చందన కార్డు నుంచి లాగేసాడు.
గుంటూరు, తుళ్లూరు: ఇటీవల కేంద్ర నిఘా సంస్థలు స్మార్ట్ ఫోన్లు వినియోగించేవారికి కొన్ని సూచనలు చేసింది. ఫోన్లలో మనం వాడే 42 యాప్‌లు దేశ సమగ్రతకు ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయని గుర్తించారు. సైబర్ నేరగాళ్లు ఉచితమంటూ ప్రచారం చేసే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోగానే ఆయా మొబైల్ యాజమానులు వ్యక్తిగత రహస్యాలను చిక్కబట్టుకుని బెదిరింపులకు పాల్పడుతన్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో 4.2 కోట్ల మొబైల్ యాప్‌లు ఉన్నాయని, ఇందులో కేవలం నాలుగైదు శాతం మాత్రమే సురక్షితమని చెబుతున్నారు. గతంలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి పట్టణాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడు గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్నాయి.
మాటలతో మభ్య పెడుతూ..
ఈ మధ్య కాలంలో పరిచయం లేని వ్యక్తుల నుంచి స్త్రీల గొంతుతో అష్టలక్ష్మి యంత్రమని, ఇన్సూరెన్స్ పాలసీపై బోనస్ వచ్చిందని, వడ్డీలేని రుణాల పేరుతో రకరకాలుగా ఫోన్ కాల్స్ పెరిగిపోయాయి. వారు మనకు సంబంధించిన కొన్ని వివరాలను ముందే చెబుతారు. దీంతో వారు ఆయా బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందినవారే అని నమ్మేసి వారి వలలో పడిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ప్రారంభించి అందిన కాడికి దోచుకుంటారు.
నెట్‌లో వ్యక్తిగత జీవితం..
కత్తికి రెండు వైపులా పదునున్నట్టు స్మార్ట్‌ఫోన్.. మంచీ చెడూ రెండింటికీ ఉపయోగపడుతుంది. ఉపయోంగిచుకునే విధానం ప్రధానం. సెల్‌ఫోన్ కెమెరాలు వచ్చాక వ్యక్తిగత జీవితానికి ఏమారుపాటుగా ఉన్నా రహస్య జీవితాన్ని చిత్రీకరించి నెట్‌లో పెట్టేస్తున్నారు. ఇలా చేసే వారిలో మాజీ భర్తలు, ప్రియులు ముందుంటున్నారు.
ప్రొఫైల్స్‌తో జాగ్రత్త..
బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు వెతుక్కునే వారి సౌకర్యార్థం అనేక వెబ్‌సైట్లు ప్రొఫైల్స్ పేరుతో సదుపాయాలు అందిస్తున్నాయి. ఎవరైనా అమ్మాయి ఫొటోలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు దొరికితే సైబర్ నేరగాళ్లు ద్వంద్వార్థాలతో ప్రొఫైల్స్‌ను పెట్టేస్తున్నారు. దీంతో సదరు యువతికి వేధింపులు తప్పడం లేదు.
స్మిషింగ్ వైరస్
స్మార్ట్ ఫోన్ల ప్లాట్‌ఫాంను ఆధారంగా చేసుకుని ఇటీవల స్మిషింగ్ వైరస్ పంపిస్తున్నారు. మీరు అత్యంత విలువైన కస్టమర్ అని చెబుతూ..అదనపు సదుపాయాలు కావాలంటే ఎస్ అని, వద్దను కుంటే నో అని టైప్ చేసి పంపాలని అందులో ఉంటుంది. అయితే ఏదీ నొక్కినా సైబర్ నేరగాళ్లు పంపే వైరస్ మీ సెల్‌ఫోన్‌లోకి చేరిపోతుంది. ఇక అప్పటి నుంచి ఫోన్ ద్వారా నిర్వహించే బ్యాకింగ్, క్రెడిట్ కార్డు లావాదేవీలన్నీ నేరగాళ్లకు చేరిపోతాయి. ప్రసుతం సైబర్ నేరగాళ్లు వాడుతున్న అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఇది. సాధారణంగా ‘5000’ వంటి నంబర్లతో వారి ఫేక్ మెయిల్ ఐడీ నుంచి జనరేట్ చేసి ఓ లింక్‌ని కూడా పంపుతారు. అటువంటి పరిస్థితుల్లో వాటికి రిప్‌లై ఇవ్వడం గానీ లింక్ ఓపెన్ చేయడం గానీ చేయకుండా ఉండడమే ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఉత్తమమైన మార్గం.
ఎప్పటికప్పుడు ఏటీఎం పిన్ మారిస్తే మంచిది
పిన్ నంబర్లను నెలకు, రెండు నెలలకోసారి మారిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద లావాదేవీలు జరిపిన తక్షణమే పిన్ నంబర్ మారిస్తే.. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా బయటపడగలమని సూచిస్తున్నారు. చాలా మంది తమ పిన్ నంబర్‌ను మర్చిపోతారేమోననే ఉద్దేశంతో పోచ్‌లో పిన్ నంబర్ రాసి ఉంచుతారు. ఈ తరహా చర్యలు కేటుగాళ్లకు ఊతమిచ్చినట్లే. మీ మెదడే పర్సుగా.. పాస్‌వర్డ్‌ని భద్రంగా దాచుకోండి సుమా.
ఏటీఎం క్లోనింగ్
ఈ మధ్య కాలంలో ఏటీఎం కార్డులు విచ్చలవిడిగా క్లోనింగ్‌కు గురవుతున్నాయి. ఏటీఎం మాదిరిగానే మరో ఏటీఎం కార్డును హ్యాకర్లు తయారు చేసి డబ్బులు డ్రా చేస్తున్నారు. ఇదెలాగంటే.. మొదట నేరగాళ్లు వారు ఎంచుకున్న వ్యక్తి కదలికపై/ఏటీఎం సెంటర్‌పై నిఘా ఉంచుతారు. ఆ వ్యక్తి ఏటీఎంలో డబ్బు డ్రా చేసే సమయాన్ని గమనిస్తారు. స్కిమ్మర్ అనే పల్చని పొర ఉన్న పేపర్‌ను ముందుగానే ఏటీఎం మెషీన్‌లో ఉంచుతారు. ఆ వ్యక్తి ఏటీఎం ఉపయోగించి డబ్బు డ్రా చేసినపుడు కార్డు వివరాలు, ముద్రలు ఆ పొరమీద అచ్చుగుద్దినట్టు కనపడతాయి. స్కిమ్మర్‌తో పాటు అక్కడ రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరా ఆ వ్యక్తిని వాడిన పిన్‌ను రికార్డు చేస్తుంది. స్కిమ్మర్‌లో నమోదైన వివరాలతో మరో ఏటీఎం కార్డును తయారు చేసి దానికి ఉన్న ప్రత్యేకమైన, రహస్య అంకెలను బ్రూట్‌ఫోర్సు విధానంతో తెలుసుకుంటారు. యథేచ్ఛగా నగదు డ్రా చేస్తారు. బ్యాంకు అకౌంట్ నుంచి మనకు తెలియకుండా నగదు డ్రా అయితే బ్యాంకు అధికారికి ఫిర్యాదు చేయాలి.
ఇలా చేస్తే సరి..
n క్రెడిట్, డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి.
n ప్రతి కార్డుకు వెనుక భాగంలోమూడు అంకెల సీవీవీ నంబర్ ఉంటుంది. దీనిని గుర్తుంచుకుని కార్డుపై చెరిపేయాలి.
n మీ కార్డులపై స్వైప్ చేయడానికి ఎవరికైనా ఇచ్చినప్పుడు మీ దృష్టి ఆ ప్రక్రియపైనే ఉండాలి.
n క్రెడిట్ కార్డులను చాలాకాలం వినియోగించకుండా ఉంటే బ్యాంకు అధికారులకు తెలియజేసి తాత్కాలికంగా మూసివేయాలి.
n ఆన్‌లైన్ ద్వారా వ్యవహారాలు సాగించే టట్లయితే సైట్ అడ్రస్ జీటీటీపీతో ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి.
n కార్డులను పోగొట్టుంటే వెంటనే సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇచ్చి బ్లాక్ చేయించాలి.
n మీ కార్డు ద్వారా లావాదేవీలు జరిగినపుడు ఈ సమాచారం ఈ–మెయిల్, ఎస్‌ఎంఎస్ ద్వారా మీకు వచ్చేలా చేసుకోండి.
n ఎగ్జిబిషన్లు, సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్‌లలో గిఫ్ట్‌కూపన్లు, లక్కీడిప్స్, ఓచర్స్‌కు సంబంధించిన కాగితాల్లో సెల్‌ఫోన్ నంబర్ ఈ–మెయిల్ ఐడీలు అడిగితే గుడ్డిగా రాయకూడదు.
ఆన్‌లైన్ లావాదేవీలపై అవగాహన అవసరం
సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. ఏ ఒక్క అవకాశాన్ని కూడా దొంగలు వదలడం లేదు. ఎవరైనా కొత్త వారు ఫోన్ చేసి సెల్‌కు ఓటీపీ నంబర్ వస్తుందని, దాని చెప్పాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరాదు. అలా చెబితే బ్యాంకులోని నగదు డ్రా చేసేందుకు అవకాశం ఉంటుంది. డేటా సెక్యూర్, ఆన్‌లైన్ లావాదేవీలపై ప్రజలు అవగాహనతో ఉండాలి. నేరగాళ్లు ఫేక్ అకౌంట్స్‌తో వివిధ కోణాల్లో మోసాలకు పాల్పడుతుంటారు. ఎవరైనా మోసం చేస్తే వెంటనే మాకు ఫిర్యాదు చేయండి. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి.–సీహెచ్.వెంకటప్పలనాయుడు,గుంటూరు రూరల్ ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment