
జనతా గ్యారేజీ గ్రూపులో ఉన్న యువకులకు కౌన్సెలింగ్ ఇస్తున్న నార్త్‌జోన్ డీఎస్పీ జి.రామకృష్ణ
గుంటూరు, తాడేపల్లిరూరల్: తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలో జనతా గ్యారేజీ పేరుతో కత్తి పట్టుకుని హల్‌చల్ చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు ప్రదీప్‌తో పాటు మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసినట్టు తాడేపల్లి పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గాజుల సాయి సురేష్ తనపై దాడి కేసులో ప్రదీప్‌తో పాటు గ్రామంలో ఒకే ఇంటి పేరు ఉన్న 23మంది యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారందరిపై కేసు నమోదు చేశారు. దీంతో గ్రామంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ గొడవలు ఎటుపోయి, ఎటు వస్తాయోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
జనతాగ్యారేజీ గ్రూపు సభ్యులకు కౌన్సెలింగ్
ఉండవల్లిలో జనతాగ్యారేజీ పేరుతో ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేసి, ఎటువంటి సమస్యలున్నా మాకు చెప్పండి మేం పరిష్కరిస్తాం అంటూ చెబుతూ అరాచకాలు సృష్టిస్తూ, రోడ్డుమీద కత్తి పట్టుకొని తిరిగిన ప్రదీప్, అతని అనుచరులకు నార్త్‌జోన్ డీఎస్పీ జి.రామకృష్ణ బుధ, గురువారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి ఎవరైనా జనతాగ్యారేజీ లాంటి గ్రూపుల్లో సభ్యులుగా చేరితే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 25 మంది సభ్యులున్న ఈ గ్రూపులో ఒకరో, ఇద్దరో తప్ప మిగతావారందరూ ఏమీ తెలియని అమాయకులు కావడంతో, మొదటి తప్పుగా వారికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నట్టు చెప్పారు. ఎవరైనా ఇలాంటి గ్రూపులు ఏర్పాటుచేసి, అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment