దేవాలయాల్లో చోరీలకు పాల్పడే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ బాలమురళీకృష్ణ తదితరులు
గుంటూరు రూరల్: అర్థరాత్రి సమయాల్లో దేవాలయాల్లో దేవుని హుండీలను పగులగొట్టి దొంగతనం చేసే ముఠాను గుంటూరు రూరల్ మండలం నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళీకృష్ణ అరెస్ట్‌చేసి శుక్రవారం కోర్టుకు అప్పగించారు. చోరీలకు పాల్పడిన వారి వద్దనుంచి రూ.10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నగర శివారుల్లో ఆలయాల్లో చోరీలు అధికమయ్యాయన్న సమాచారం మేరకు అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు ఆదేశాలమేరకు సీసీఎస్ అడిషనల్ ఎస్పీ ఎస్.రాఘవ ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ అబ్దుల్ కరీం నేతృత్వంలో టీంలుగా ఏర్పడి విచారించి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. మండలంలోని అడవితక్కెళ్ళపాడు గ్రామంలోగల నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ నగరంలోని పాతగుంటూరు సుద్దపల్లి డొంకకు చెందిన షేక్ ఖాజా అలియాస్ అమ్మూ చెడు వ్యసనాలకు బానిసై డబ్బులకోసం గతంలో నగరంలోని లాలాపేట, పాతగుంటూరు, నల్లపాడు, పెదకాకాని తదితర చోట్ల చోరీలకు పాల్పడి పోలీసులకు దొరికి, అనేకసార్లు విజయవాడలోని జువైనల్ హోంలో శిక్ష అనుభవించాడు.
జైలునుంచి విడుదలైన అనంతరం పాతగుంటూరులో అతని ఇంటివద్ద క్యాటరింగ్ పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో క్యాటరింగ్ పనుల్లో ఆతనికి తోడుగా వచ్చిన పాతగుంటూరు యానాదికాలనీకి చెందిన షేక్ జాఫర్‌అలి, షేక్ అస్గర్ పరిచయమయ్యారు. దీంతో గతంలో తాను చేసిన చోరీలను గురించి ఖాజీ వారిద్దరికీ తెలిపాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించవచ్చని చెప్పి రాత్రి సమయాల్లో చోరీలకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి ఈనెల 10న మండలంలోని చౌడవరం గ్రామంలో గల పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో తలుపులు పగులగొట్టి హుండీలోని రూ.5 వేల నగదును అపహరించారు. అదే రోజు అదే గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో హుండీని పగులగొట్టి అందులోని రూ.5 వేల నగదును అపహరించుకుపోయారు. మండలంలోని వెంగళాయపాలెం, నల్లపాడు, హౌసింగ్‌బోర్డు తదితర ప్రాంతాల్లో పలు ఆలయాల్లో చోరీలకు ప్రయత్నం చేయగా స్థానికులు అప్రమత్తమై కేకలు వేయటంతో పారిపోయారు. ఆలయ అర్చకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆలయాల్లోని సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుల వివరాలను సేకరించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా చేసిన చోరీలను ఒప్పుకున్నారు. దీంతో నిందితులు ముగ్గురిని కోర్టుకు అప్పగించనున్నట్టు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకోవటంలో చొరవ చూపిన సీసీఎస్ సీఐ అబ్దుల్ కరీం, సురేష్‌బాబు, నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళీకృష్ణ, ఎస్‌ఐ బాబూరావు, సిబ్బంది సాయికుమార్, గురవయ్య, రమేష్‌బాబు, సాగర్‌బాబు, వీరాంజనేయులు, సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు తదితరులను అర్బన్ ఎస్పీ అభినందించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment