దొంగల్లో అతిప్రమాదకరం.. పార్థి ముఠా | Pardhi Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

దొంగల్లో అతిప్రమాదకరం.. పార్థి ముఠా

Jul 6 2024 12:17 PM | Updated on Jul 6 2024 12:17 PM

Pardhi Gang Arrest in Hyderabad

ఒకప్పుడు ఇతర రాష్ట్రాల్లో వీరి సంచారం

ఉమ్మడి జిల్లాలో పెరిగిన పార్థి గ్యాంగ్‌ దొంగతనాలు 

హైవే వెంట, పట్టణాల్లో ఇటీవల పెరిగిన దోపిడీలు 

అది వారి పనేనని నిర్ధారణకు వచ్చిన పోలీసులు

ఆచూకీపై నిఘా పెట్టి, వెంబడించి ఇద్దరి పట్టివేత

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జాతీయ, రాష్ట్ర రహదారులపై దారి దోపిడీలు, ఇళ్లలో దొంగతనాలు, హత్యలకు పాల్పడే ప్రమాదకరమైన ముఠాగా పార్థి గ్యాంగ్‌కు పేరుంది. మహారాష్ట్ర మూలాలు కలిగిన ఈ గ్యాంగ్‌ ఉమ్మడి జిల్లాలో మూడు నెలలుగా రెచ్చిపోతోంది. హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి వెంట దోపిడీలు చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోంది. గతంలో ఇతర రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడిన ఈ గ్యాంగ్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రవేశించి దారుణాలకు పాల్పడుతోంది. దోపిడీలకు అడ్డొస్తే క్రూరంగా హత్యలు చేసే ఈ గ్యాంగ్‌ కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఇద్దరిని పట్టుకున్నారు. మిగతా ఇద్దరిని పట్టుకునేందుకు మహారాష్ట్రకు పోలీసు బృందాన్ని పంపించారు. 

కట్టంగూర్‌ వద్ద హత్య పార్థి గ్యాంగ్‌ పనే..
జాతీయ రహదారి వెంట ఇటీవలి కాలంలో జరిగిన దారి దోపిడీలు, హత్య పార్థి ముఠా పనిగానే పోలీసులు గుర్తించారు. శుక్రవారం పెద్ద అంబర్‌పేట్‌ సమీపంలోని ఔటర్‌ రింగురోడ్డు వద్ద పట్టుకున్న ఇద్దరు దొంగలు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. మే 18వ తేదీన హైదరాబాద్‌లో ఇంటిసామాను దింపి తిరిగి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా పామర్రు మండలం చెట్లవారిపురం గ్రామానికి వెళ్తున్న కొల్లూరి రాజవర్ధన్‌ అనే డీసీఎం డ్రైవర్‌ కట్టంగూర్‌ మండలంలోని ఎర్రసానిగూడెం స్టేజీ వద్ద డీసీఎం ఆపుకొని నిద్రిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు అతని కాళ్లను కట్టేసి, గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. రోడ్డుకు అవతలివైపున పడేశారు. ఈ హత్య తామే చేశామని దొంగలు ఒప్పుకున్నట్లు తెలిసింది. అదే కాదు.. ఇతర ప్రాంతాల్లో మరో రెండు హత్యలు చేశామని అంగీకరించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.

పార్థి గ్యాంగ్‌ చేసిన అరాచకాలెన్నో...
గడిచిన ఐదు నెలల్లో మొత్తంగా నల్లగొండ జిల్లాలో 279 దొంగతనం కేసులు నమోదు కాగా, అందులో 46 కేసుల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లోనే 103 దోపిడీ, దొంగతనం కేసులు నమోదు కాగా కేవలం మూడు కేసుల్లోనే నిందితులు దొరికారు. మిగతా కేసుల్లో ఎలాంటి పురోగతీ లేదు. అయితే ఏప్రిల్, మే నెలల్లో జరిగిన ఈ దోపిడీలు, దొంగతనాల్లో 15 ఘటనల్లో వారి ప్రమేయమే ఉన్నట్లు శుక్రవారం దొరికిన దొంగలు ఒప్పుకున్నట్లు తెలిసింది. జూన్‌ 22వ తేదీన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పాండ్రేగుపల్లికి చెందిన కాట్రాల ఉపేందర్, తన స్నేహితుడు బాబాతో కలిసి హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్తూ చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం శివారులోని స్వాతి దాబా వద్ద ఆగి రొట్టెలు తిన్నారు. నిద్ర రావడంతో కారులోనే పడుకున్నారు. అర్ధరాత్రి 2.40 గంటల ప్రాంతంలో నిద్ర లేచారు. అంతకుముందే కారు డ్యాష్‌ బోర్డులో పెట్టిన రూ.2.21 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతోపాటు జూన్‌ 9వ తేదీన చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోని జాతీయ రహదారి వెంట ఉన్న ట్రక్‌ బేలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం తోట్లపాలెం గ్రామానికి చెందిన పల్లెపు శృతి ఆమె అన్న పంచాక్షరి, వదిన అఖీల, వారి కుమారుడు దేవాన్‌‡్ష కారు ఆపుకొని నిద్రిస్తున్న సమయంలో కారుపై రాళ్లతో దాడి చేసి బంగారం దోచుకెళ్లారు. అది ఈ గ్యాంగ్‌ పనేనని పోలీసులు భావిస్తున్నారు. 

దొరికిపోయే రోజున.. దొంగతనం
పోలీసులు వలపన్ని పట్టుకున్న పార్థి గ్యాంగ్‌లోని ఇద్దరు దొంగలు శుక్రవారం తెలవారుజామున ఉదయం 3 గంటలకు చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం దగ్గర ఒకరి ఇంట్లో కత్తులతో బెదిరించి చోరీ చేశారు. అంతకుముందు చౌటుప్పల్‌లోనూ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గతంలో కట్టంగూర్‌ వద్ద ఒక బైక్‌ దొంగతనం చేసి దానిని అబ్దుల్లాపూర్‌మెంట్‌ వద్ద వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌ సభ్యులు సాధారణంగా ఫోన్లు వినియోగించరని, బాధితుల ఫోన్లను తీసుకొని వాడుకుంటారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అత్యవసరం అయినప్పుడే తమ సొంత ఫోన్లను వినియోగిస్తారని, దొంగల్లో ఒకడు తన భార్యకు సొంత ఫోన్‌లో మాట్లాడగా, అదే ఫోన్‌నంబరు గతంలో దోపిడీ జరిగిన ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా వారిని గుర్తించినట్లు తెలిసింది.

మూడు నెలలు దొంగతనం.. మహారాష్ట్రలో విక్రయం
ఒక ప్రాంతంలో మూడు నెలలపాటు వరుస దొంగతనాలు చేస్తారని, ఆ తరువాత మూడేళ్లపాటు ఆ ప్రాంతానికి రాకుండా, మరో ప్రాంతానికి వెళ్లి దొంగతనాలు చేయడం వీరి ప్రత్యేకత అని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. తద్వారా తాము పోలీసులకు దొరక్కుండా ఉంటామనే ఆలోచనతో అలా చేస్తారని చెబుతున్నారు. మరోవైపు ఈ గ్యాంగ్‌ చోరీ చేసిన బంగారం, అభరణాలను మహరాష్ట్రకు తీసుకెళ్లి విక్రయిస్తామని ఒప్పుకున్నట్లు తెలిసింది. జింకలను వేటాడటమే వృత్తిగా కలిగిన పార్థీ గ్యాంగ్‌ కుటుంబాలు మహరాష్ట్రలోనూ ఎక్కువ శాతం గుట్టల్లోనే నివసిస్తాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు తాము దోపిడీ చేసే సమయంలో ఎవరైనా అడ్డువస్తే కిరాతకంగా హతమార్చేందుకు వెనుకాడకపోవడం వారి నైజమని పేర్కొంటున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement