Temple Robbed
-
ఆలయాలే టార్గెట్‌గా..
ఆలయాలే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోయారు. ఒక్కరోజే మూడు దేవాలయాలను కొల్లగొట్టారు. ధర్పల్లి మండలంలోని రెండు గుళ్లతో పాటు ఇందల్వాయి మండలంలో ఓ గుడిలోకి చొరబడ్డారు. దేవుళ్ల నగలతో పాటు హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలతో స్థానికంగా కలకలం రేగింది. సాక్షి,ధర్పల్లి(నిజామాబాద్) : మండలంలోని గోవింద్‌పల్లి గ్రామ శివారులో గల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు ఆలయంలోని గర్భగుడి తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డారు. స్వామివారి మీద గల బంగారు, వెండి ఆభరణాలు, హుండీలోని నగదును దొంగిలించారు. భక్తులు గత ఏడాది నుంచి డబ్బులను కానుకలుగా హుండీలో సమర్పిస్తున్నారు. దీంతో హుండీలో సుమారు రూ.50 వేలకు పైగానే డబ్బు ఉంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై పాండేరావు చోరీ జరిగిన ఆలయాన్ని మంగళవారం పరిశీలించారు. దొంగల కోసం చుట్టుపక్కల గ్రామాల్లోని సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్దుల్ ఆలయంలోనూ.. మండల కేంద్ర శివారులోని మద్దుల్ అటవీ ప్రాంతంలో గల శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున దొంగలు పడ్డారు. చానల్ గేట్ తలుపులను పగులగొట్టి స్వామివారి మీద గల వెండి ఆభరణాలు, హుండీ పగులగొట్టి రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారమందుకున్న ఎస్సై పాండేరావు చోరీ జరిగిన శ్రీలక్ష్మినర్సింహాస్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. లోలం పెద్దమ్మ ఆలయంలో.. ఇందల్వాయి: మండలంలోని లోలం గ్రామ శివారులో గల పెద్దమ్మ ఆలయంలోకి సొమవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. హుండీ పగలగొట్టి దాదాపు రూ.7 వేల నగదు, అమ్మవారి పుస్తెమట్టెలు, పట్టగొలుసులు ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయం గేటుకు వేసిన తీళం పగలగొట్టి, బీరువాను ధ్వంసం చేశారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు కేసు నమోదు చేసుకున్నారని సర్పంచ్ మమత చెప్పారు. -
ఆలయాల్లో చోరీలకు పాల్పడే దొంగల ముఠా అరెస్ట్
గుంటూరు రూరల్: అర్థరాత్రి సమయాల్లో దేవాలయాల్లో దేవుని హుండీలను పగులగొట్టి దొంగతనం చేసే ముఠాను గుంటూరు రూరల్ మండలం నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళీకృష్ణ అరెస్ట్‌చేసి శుక్రవారం కోర్టుకు అప్పగించారు. చోరీలకు పాల్పడిన వారి వద్దనుంచి రూ.10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నగర శివారుల్లో ఆలయాల్లో చోరీలు అధికమయ్యాయన్న సమాచారం మేరకు అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు ఆదేశాలమేరకు సీసీఎస్ అడిషనల్ ఎస్పీ ఎస్.రాఘవ ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ అబ్దుల్ కరీం నేతృత్వంలో టీంలుగా ఏర్పడి విచారించి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. మండలంలోని అడవితక్కెళ్ళపాడు గ్రామంలోగల నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ నగరంలోని పాతగుంటూరు సుద్దపల్లి డొంకకు చెందిన షేక్ ఖాజా అలియాస్ అమ్మూ చెడు వ్యసనాలకు బానిసై డబ్బులకోసం గతంలో నగరంలోని లాలాపేట, పాతగుంటూరు, నల్లపాడు, పెదకాకాని తదితర చోట్ల చోరీలకు పాల్పడి పోలీసులకు దొరికి, అనేకసార్లు విజయవాడలోని జువైనల్ హోంలో శిక్ష అనుభవించాడు. జైలునుంచి విడుదలైన అనంతరం పాతగుంటూరులో అతని ఇంటివద్ద క్యాటరింగ్ పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో క్యాటరింగ్ పనుల్లో ఆతనికి తోడుగా వచ్చిన పాతగుంటూరు యానాదికాలనీకి చెందిన షేక్ జాఫర్అలి, షేక్ అస్గర్ పరిచయమయ్యారు. దీంతో గతంలో తాను చేసిన చోరీలను గురించి ఖాజీ వారిద్దరికీ తెలిపాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించవచ్చని చెప్పి రాత్రి సమయాల్లో చోరీలకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి ఈనెల 10న మండలంలోని చౌడవరం గ్రామంలో గల పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో తలుపులు పగులగొట్టి హుండీలోని రూ.5 వేల నగదును అపహరించారు. అదే రోజు అదే గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో హుండీని పగులగొట్టి అందులోని రూ.5 వేల నగదును అపహరించుకుపోయారు. మండలంలోని వెంగళాయపాలెం, నల్లపాడు, హౌసింగ్‌బోర్డు తదితర ప్రాంతాల్లో పలు ఆలయాల్లో చోరీలకు ప్రయత్నం చేయగా స్థానికులు అప్రమత్తమై కేకలు వేయటంతో పారిపోయారు. ఆలయ అర్చకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆలయాల్లోని సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుల వివరాలను సేకరించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా చేసిన చోరీలను ఒప్పుకున్నారు. దీంతో నిందితులు ముగ్గురిని కోర్టుకు అప్పగించనున్నట్టు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకోవటంలో చొరవ చూపిన సీసీఎస్ సీఐ అబ్దుల్ కరీం, సురేష్‌బాబు, నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళీకృష్ణ, ఎస్ఐ బాబూరావు, సిబ్బంది సాయికుమార్, గురవయ్య, రమేష్‌బాబు, సాగర్‌బాబు, వీరాంజనేయులు, సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు తదితరులను అర్బన్ ఎస్పీ అభినందించారని తెలిపారు. -
ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు!
విశాఖపట్నం, గోపాలపట్నం: ఎరక్కపోయి.. ఇరుక్కుపోవడమంటే ఇదేమరి. ఆలయంలో చోరీకి యత్నించి, తిరిగి బయట పడలేక పోలీసులకు చిక్కిన ఘటన వేపగుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వేపగుంట జంక్షన్లో పైడితల్లమ్మ ఆలయం ఉంది. శుక్రవారం వేకువజామున ఆలయ తలుపులు తెరవడానికి వచ్చిన నిర్వాహకులు, అర్చకుడికి ఇక్కడ వాతావరణం గందరగోళంగా కనిపించింది. హుండీ కనిపించలేదు. ఆలయ ప్రవేశం పైభాగంలో గ్రిల్స్ విరిచి ఉన్నాయి. ఆలయంలో చిల్లర డబ్బులు చిందరవందరగా పడి ఉన్నాయి. లోపల గర్భాలయం వెనక వ్యక్తి హుండీ పట్టుకుని నిద్రపోతూ కనిపించాడు. దీంతో విస్తుపోయిన ఆలయ చైర్మన్ మామిడి రాజు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయంలోకి వెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అన్ని తలుపుల తాళాలూ పెకిలించినా గర్భాలయ తలుపు తాళం తీయడానికి నిందితుడు సాహసించలేకపోయినట్టు తెలిసింది. నిందితున్ని పోలీసులు విచారిస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించినా బయటకు రాలేక ఇలా ఉండిపోయినట్లు ఆయన నుంచి సమాధానం వచ్చింది. ఇదిలా ఉండగా వేపగంట జంక్షన్‌లోనే పోలీసు అవుట్‌పోస్టు ఉంది. దీని పక్కనే పైడితల్లమ్మ ఆలయం ఉన్నా ఈ సంఘటన జరిగిందంటే పోలీసు నిఘా ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు విమర్శిస్తున్నారు. -
గంగాళమ్మ పంచలోహ విగ్రహం చోరీ
నెల్లూరు, రాపూరు: గోనుపల్లి పంచాయతీ వంకివోలు పునరావాస కాలనీలోని గ్రామదేవత గంగాళమ్మ ఆలయంలో సోమవారం వేకువన గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గంగాళమ్మ పంచలోహ విగ్రహాన్ని అపహరించారు. వివరాలు..వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం మర్లబైలు గ్రామం సోమశిల జలాశయంలో ముంపునకు గురవగా గోనుపల్లి పంచాయతీ పరిధిలోని వంకివోలు కాలనీలో ప్రభుత్వం పునరావాసం కల్పించింది. మర్లబైలు గ్రామదేవత గంగాళమ్మను వంకివోలు కాలనీలో ప్రతిష్టించి పూజలు జరుపుతున్నారు. సోమవారం వేకువన గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తాళాలు పగులగొట్టి అతి పురాతనమైన గంగాళమ్మ పంచలోహ విగ్రహాన్ని అపహరించారు. పోలీసు జాగిలం వాసన పసి గట్టకుండా, క్లూస్‌టీం వేలిముద్రలు సేకరించకుండా ఆలయం వద్ద దుండగులు మిరప్పొడి చల్లారు. ఉదయం గ్రామస్తులు చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అమ్మవారి ఆలయంలో భారీ చోరీ
గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కామినేనివారి పాలెంలోని గత అర్థరాత్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలోకి చోరబడిన దుండగులు అమ్మవారి ఆభరణాలు, హుండీ అపహరించుకుని పోయారు. ఆ విషయాన్ని ఈ రోజు తెల్లవారుజామున ఆలయ పూజారీ గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయానికి చేరుకుని చోరీ జరిగిన తీరును గమనించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మవారి ఆభరణాలకు సంబంధించిన వివరాలను పోలీసులు పూజారీ నుంచి సేకరిస్తున్నారు. లక్షలు విలువ చేసే అమ్మవారి ఆభరణాలు చోరీ అయ్యాయని పూజరీ పోలీసులకు వివరించారు.