
'మోదీని ఓఎల్ఎక్స్ లో అమ్మేస్తామంటున్నారు'
'ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ చాలా హామీలే గుప్పించారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తానని, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టస్తానని, అచ్చెదిన్ (మంచిరోజులు) తీసుకొస్తానని ఇలా చాలా విషయాలే చెప్పారు. తీరా ప్రధానమంత్రి అయ్యాక తన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. అందువల్లే కన్హయ్యకుమార్ లాంటి చిన్నాచితక నేతలు కూడా మోదీని ఓఎల్ఎక్స్ లో అమ్మేస్తామని హెచ్చరిస్తున్నారు'.. ప్రధాని మోదీపై మిత్రపక్షం శివసేన విసిరిన వ్యంగ్యాస్త్రాలివి.
శివసేన అధికార పత్రిక 'సామ్నా' ప్రధాని మోదీ టార్గెట్ గా ఓ సంపాదకీయాన్ని వెలువరించింది. మోదీ వైఫల్యం వల్లే జెఎన్ యూ విద్యార్థి నేత అయిన కన్హయ్యకుమార్ లాంటి చిన్నాచితక నేతలు కూడా ఆయనను విమర్శిస్తున్నారని మండిపడింది. పాత వస్తువులు అమ్మే ఓఎల్ఎక్స్ లో ప్రధానిని అమ్మేస్తామని కన్హయ్య లాంటి నేతలు కూడా విమర్శలు చేస్తున్నారని, ఇది బీజేపీకి ఆమోదయోగ్యం కాకూడదని పేర్కొంది. కన్హయ్య లాంటి నేతలకు బీజేపీ ఊపిరి అందిస్తున్నదని, ఇప్పటికైనా ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు సాగాలని సూచించింది.
కన్హయ్యపై జెట్ విమానంలో హత్యాయత్నం జరిగిందన్న వార్తల నేపథ్యంలో అతనిపై దేశద్రోహి ముద్ర వేసి ప్రచారం చేయడం ఎంతమాత్రం సబబు కాదని బీజేపీని ఉద్దేశించి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్న సంగతి తెలిసిందే.