ముంబై: నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపై విశ్వాసం లేదని, అందుకే ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు. ఆయన బుధవారం ముంబైలో శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమ పోరాటానికి మద్దతివ్వాలని ఠాక్రేను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్‌పై రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును వ్యతిరేకిస్తామని ఉద్ధవ్ హామీ ఇచ్చారన్నారు.
సభలో ఈ బిల్లు విఫలమైతే 2024లో బీజేపీ ఓటమి తథ్యమని చెప్పారు. తమ పోరాటం కేవలం ఢిల్లీ కోసం కాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ఓడించడానికి తాము చేతులు కలిపామని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఈసారి బీజేపీని ఓడించకపోతే దేశంలో ఇక ప్రజాస్వామ్యం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఠాక్రే వర్గం శివసేనకు రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. కేజ్రివాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసి, మద్దతు కోరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment