బావ కోసం వచ్చి... బందిపోట్లకు దొరికాడు! | Robbery Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

బావ కోసం వచ్చి... బందిపోట్లకు దొరికాడు!

Published Fri, Jan 25 2019 11:04 AM | Last Updated on Fri, Jan 25 2019 11:04 AM

Robbery Gang Arrest in Hyderabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్‌ పోలీసులు సైబర్‌ క్రైమ్‌లో అరెస్టు చేసిన బావను కలవడానికి మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ చర్లపల్లి జైలుకు వచ్చాడు... మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మర్డర్‌ కేసులో అరెస్టు చేసిన స్నేహితులను కలిసేందుకు నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అదే సమయంలో జైలుకు వెళ్లారు. ములాఖత్‌ సందర్భంగా వారికి పరిచయం ఏర్పడింది. మధ్యప్రదేశ్‌ వ్యక్తిని టార్గెట్‌ చేసుకున్న వారు శంషాబాద్‌ వరకు లిఫ్ట్‌ ఇస్తామంటూ పాతబస్తీకి తీసుకువెళ్లి మరికొందరితో కలిసి బందిపోటు దొంగతనానికి పాల్పడ్డారు... ఈ కేసు ఛాలెంజ్‌గా తీసుకున్న సౌత్‌జోన్‌ పోలీసులు 40 గంటల్లో ఛేదించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. గురువారం నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ డీసీపీ అంబర్‌ కిషోర్‌ ఝా, అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్, ఏసీపీ బి.అంజయ్యలతో కలిసి వివరాలు వెల్లడించారు.  

ఆ గంటే వారికి కలిసొచ్చింది...
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన సంపిల్‌ ప్రజాపతిని ఓ సైబర్‌ నేరంలో సైబరాబాద్‌ పోలీసులు ఈ నెల 4న అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. చర్లపల్లి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అతడిని చూసేందుకు అతడి బావమరిది దీపాంజయ్‌ బుందేలా గత శుక్రవారం నగరానికి వచ్చాడు. మంగళవారం వరకు కూకట్‌పల్లిలోని ఓ హోటల్‌లో ఉన్న అతను అదేరోజు సాయంత్రం తిరిగి వెళ్లాల్సి ఉండటంతో  ములాఖత్‌లో తన బావను కలిసేందుకు చర్లపల్లి జైలు వద్దకు వెళ్లాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఓ హత్య కేసులో అరెస్టు చేసిన అఫ్రోజ్‌ ఖాన్, మహ్మద్‌ నవాజ్‌లను కలిసేందుకు అదే రోజు కాలాపత్తర్‌కు చెందిన సయ్యద్‌ యూసుఫ్, సయ్యద్‌ జైనుల్‌ అబిదిన్‌ అక్కడికి వచ్చారు. దీపాంజయ్‌ బుందేలా ములాఖత్‌ నం.68 కాగా... వీరిది 69. భోజనవిరామ సమయం కావడంతో దాదాపు గంటపాటు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దీపాంజయ్‌తో యూసుఫ్, అబిదిన్‌ పరిచయం పెంచుకున్నారు. ములాఖత్‌ అనవంతరం బయటకు వచ్చిన దీపాంజయ్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లాలని భావించాడు.

క్యాబ్‌ పేరు చెప్పి సమాచారం...
అదే సమయంలో అక్కడికి వచ్చిన యూసుఫ్, అబిదిన్‌ తామూ అటు వైపే వెళ్తున్నామని, శంషాబాద్‌ వరకు విడిచిపెడతామని చెప్పారు. ఇందుకుగాను రూ.200 చెల్లించాలని ఒప్పందం చేసుకుని ముందే ఇవ్వాలని కోరారు. దీంతో దీపాంజయ్‌ డబ్బులు చెల్లించేందుకు తన జేబులో ఉన్న రూ.18 వేలు బయటకు తీశాడు. ఆ నగదు చూసిన వెంటనే దోచుకోవాలని పథకం వేసిన ఇద్దరూ... తమకు పరిచయస్తుడైన ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ఉన్నాడని, విమానాశ్రయంలో దింపడానికి శంషాబాద్‌కు రమ్మంటామంటూ దీపాంజయ్‌తో చెప్పారు. పథకం ప్రకారం తమ స్నేహితులైన మహ్మద్‌ నదీమ్‌ ఖురేషీ, మీర్‌ మౌజమ్‌ అలీ, మహ్మద్‌ ఖలీలుద్దీన్, మహ్మద్‌ ఇబ్రహీం, మహ్మద్‌ అలీ ఖురేషీలకు తమ పథకంపై సమాచారం ఇచ్చారు. క్యాబ్‌ డ్రైవర్‌తో మాట్లాడుతున్నామంటూ బాధితుడికి చెబుతూనే వారందరినీ కాలాపత్తర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో కాపుకాయమని చెప్పారు. దీపాంజయ్‌ని అక్కడికి తీసుకువెళ్లాక ఏడుగురూ కలిసి బందిపోటు దొంగతనానికి పాల్పడ్డారు. అతడి వద్ద ఉన్న నగదు, చెవులకు ఉన్న బంగారు కమ్మలు తదితరాలను లాక్కున్నారు. ఈ సందర్భంలో బాధితుడిని బెదిరిస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు.  

ములాఖత్‌ రిజిస్టర్‌ ఆధారంగా...
దీపాంజయ్‌ను సమీపంలోని ఏటీఎంకు తీసుకువెళ్లిన దుండగులు డబ్బు తీసివ్వాలని బలవంతం చేశారు. అయితే తెలివిగా వ్యవహరించిన అతను తప్పు పిన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి లావాదేవీ పూర్తి కాకుండా చేశాడు. ఏటీఎం సెంటర్‌ సమీపంలో రద్దీ ఉన్న రోడ్డు కనిపించడంతో వారిని విదిలించుకున్న బాధితుడు ఆటో ఎక్కి కాలాపత్తర్‌ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై సమాచారం అందడంతో కొత్వాల్‌ సహా ఉన్నతాధికారులంతా పోలీసు స్టేషన్‌కు వచ్చి బాధితుడితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నిందితులు ఇతడిని ములాఖత్‌ సమయంలో కలిసినట్లు తేలడంతో జైళ్ల శాఖను సంప్రదించి ములాఖత్‌ రిజిస్టర్‌లోని వివరాలను సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్, చార్మినార్‌ ఏసీపీ బి.అంజయ్య నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  

ఫిర్యాదు చేస్తాడనుకోలేదు...
మంగళవారం రాత్రి నుంచి ముమ్మరంగా గాలించిన ఈ బృందాలు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల ఫొటోలు సేకరించాయి. తొలుత యూసుస్, అబిదీన్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిచ్చిన సమాచారంతో మిగిలిన ఐదుగురినీ పట్టుకుని సొత్తు, కారు రికవరీ చేశా యి. విచారణ నేపథ్యంలో నిందితులు తాము చిక్కుతామని అనుకోలేదంటూ చెప్పుకొచ్చారు. ములాఖత్‌ సమయంలో తమకు దీపాంజయ్‌ సాయంత్రం 6 గంటలకు విమానం ఎక్కాలంటూ టిక్కెట్లు చూపించాడని, దోచుకున్నప్పటికీ అతడు భయంతో వెళ్లిపోతాడనుకున్నామని చెప్పుకొచ్చా రు. నిందితుల్లో యూనుస్, ఖలీల్, ఇబ్రహీంలపై 2015లో పీడీ యాక్ట్‌ ప్రయోగించినట్లు కొత్వాల్‌ తెలిపారు. నేరగాళ్లు మారితే వారికి అన్ని రకాలుగానూ సహకరిస్తామన్న ఆయన నేరాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తన కేసుకు కీలక ప్రాధాన్యం ఇచ్చిన హైదరాబాద్‌ పోలీసులు బెస్ట్‌ అని, తమ ప్రాంతంలోనూ ఇంత సత్వర స్పందన ఉండదని బాధితుడు దీపాంజయ్‌ సీపీకి కృతజ్ఞతలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement