అక్రమ మ్యుటేషన్లు 2 వేలు... | Illegal mutations 2 thousand ... | Sakshi
Sakshi News home page

అక్రమ మ్యుటేషన్లు 2 వేలు...

Published Thu, Apr 20 2017 12:48 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

అక్రమ మ్యుటేషన్లు 2 వేలు...

అక్రమ మ్యుటేషన్లు 2 వేలు...

⇒జీహెచ్‌ఎంసీలో వెలుగుచూసిన వైనం..
⇒అత్యధికం ‘స్వలాభం’ కోసం చేసుకున్నవే
⇒ముగ్గురిని అరెస్టు చేసిన సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌
⇒ఓ కేసులో తప్పించుకున్నా మరో కేసులో జైలుకు


సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో ఏడాదిన్నరగా ఓ ముఠా అక్రమ మ్యుటేషన్లకు పాల్పడింది. ఆన్‌లైన్‌ రికార్డుల్లో ఒకరి నివాసాన్ని మరొకరి పేరిట మార్చేసింది. ఈ రకంగా దాదాపు రెండు వేల మ్యుటేషన్ల మార్పిడిలకు పాల్పడిన ముగ్గురు నిందితుల్ని సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్‌ మహంతి వెల్లడించారు. వీటిలో అత్యధికం

‘స్వలాభం’ కోసం యజమానులు చేయించుకున్నవే అని తేలింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు ఇలా జరిగిన మ్యుటేషన్లు రద్దు చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీకి లేఖ రాయాలని నిర్ణయించారు. చిక్కడపల్లికి చెందిన బి.పోలయ్య జీహెచ్‌ఎంసీ మ్యుటేషన్‌ విభాగంలో డేటాఎంట్రీ ఆపరేటర్‌గా పని చేశారు. చీఫ్‌ వాల్యుయేషన్‌ అధికారి ఆదేశాల ప్రకారం ఆస్తులకు సంబంధించి వాటి యజమానుల పేర్లలో మార్పు చేర్పులు చేయడం ఇతడి విధి. గతంలో కొన్ని అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలో పోలయ్యను ఫైర్‌ ప్రివెన్షన్‌ విభాగానికి బదిలీ చేశారు.

ముటేషన్‌ విభాగంలో పని చేస్తున్నప్పుడు ఇతడికి కేటాయించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను ఆన్‌లైన్‌లో రద్దు చేశారు. జీహెచ్‌ఎంసీకి ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్న సీజీజీ సంస్థలో గతంలో పని చేసి, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో ఐటీ ప్రోగ్రామర్‌గా పని చేస్తున్న జగదీష్‌కు కొత్త యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్స్‌ క్రియేట్‌ చేయడంలో సర్వర్‌ యాక్సస్‌ ఉంది. దీంతో పోలయ్యతో జతకట్టిన ఇతగాడు గతంలో రద్దు చేసిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను పునరుద్ధరించాడు. జీహెచ్‌ఎంసీలోనే డేటాఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఎం.లఖన్‌సింగ్‌ సైతం పోలయ్యతో జతకట్టాడు.

అక్రమ మ్యుటేషన్లు అవసరమైన పార్టీలను ఇతడు పోలయ్య వద్దకు తీసుకువచ్చేవాడు. ఒక్కో అక్రమ మ్యుటేషన్‌కు రూ.12 వేల వరకు తీసుకుంటున్న ఈ ముఠా ఆపై పంచుకుంటోంది. తన సెల్‌ఫోన్‌ ద్వారా పోలయ్య యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్స్‌ వినియోగించి జీహెచ్‌ఎంసీ సర్వర్‌లోకి ప్రవేశిస్తూ ఆన్‌లైన్‌లో ఉన్న యజమానుల పేర్లు అక్రమంగా మారుస్తున్నాడు. ఈ రకంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో దాదాపు రెండు వేల అక్రమ మ్యుటేషన్లకు పాల్పడ్డాడు. ఇందులో అత్యధికం ఆస్తుల యజమానులు వారి స్వలాభం కోసం చేసుకున్నవే అని తేలింది.

నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని మ్యుటేషన్‌ చేసుకోవాలంటే సేల్‌డీడ్‌ సహా మరికొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే కొందరు స్థిరాస్తుల్ని కేవలం నోటరీ ద్వారా ఖరీదు చేస్తున్న నేపథ్యంలో సక్రమ మ్యుటేషన్లు సాధ్యం కావు. దీంతో వీరు లఖన్‌సింగ్‌ సహా మరికొందరు దళారుల సాయంతో పోలయ్యను ఆశ్రయించి పని పూర్తి చేయించుకున్నారు. ఈ అక్రమ మ్యుటేషన్ల వ్యవహారం ఈ ఏడాది ఫిబ్రవరిలో బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లో ఉన్న ఓ భవనాన్ని 2015 జూలైలో కె.కోటేశ్వరరావు నుంచి దొంగరి రమాబాయి ఖరీదు చేశారు.

అప్పటి నుంచి రమాబాయి తన భవనానికి సంబంధించిన ఆస్తిపన్నును క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సైతం చెల్లించిన రమాబాయి వచ్చే ఏడాదికి సంబంధించి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించడానికి ప్రయత్నించగా... ఆ భవనం గత ఏడాది డిసెంబర్‌ 13న కోటేశ్వరరావు పేరు మీదికి మారిపోయినట్లు అధికారులు చెప్పారు. దీనిపై బంజారాహిల్స్‌ ఠాణాలో నమోదైన కేసు సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు బదిలీ అయింది. ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ పి.రవికిరణ్, ఎస్సై ఎస్‌.నరేష్‌ దర్యాప్తు చేశారు.

ఈ కేసులో పోలయ్య, ఖన్‌సింగ్‌ తదితరులకు న్యాయస్థానం ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడంతో అరెస్టును తప్పించుకున్నారు. ఆపై సోమాజిగూడకు చెందిన మహ్మద్‌ అబ్బాస్‌ నుంచి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. తనకున్న 370 చదరపు గజాల్లో 220 చదరపు గజాల్ని పొరుగున ఉండే ఖాజా ఖుతుబుద్దీన్‌కు 2001లో విక్రయించారు. ఈ నెల 15న ఆస్తిపన్ను చెల్లించడం కోసం జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వెళ్ళిన అబ్బాస్‌ తన పేరిట ఉండాల్సిన మిగిలిన 150 చదరపు గజాల స్థలంలోని ఇల్లు సైతం ఖుతుబుద్దీన్‌  పేరుతో ఉన్నట్లు తెలుసుకుని కంగుతిన్నారు.

దీంతో ఆయన సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ పి.రవికిరణ్‌ జీహెచ్‌ఎంసీకి ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్న సీజీజీ సంస్థ నుంచి వివరాలు సేకరించారు. జీహెచ్‌ఎంసీ ఐపీ అడ్రస్‌ను అక్రమంగా మొబైల్‌ ఫోన్‌ నుంచి వినియోగించి ఈ మ్యుటేషన్‌ చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో పోలయ్య, లఖన్‌సింగ్, ఖుతుబుద్దీన్‌లను బుధవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న జగదీష్‌ సహా మరికొందరి కోసం గాలిస్తున్నారు.

ఈ అక్రమ మ్యుటేషన్‌ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వీళ్ళు చేసిన రెండు వేల మ్యుటేషన్ల జాబితా రూపొందిస్తున్నారు. నగరంలోని స్థిరాస్తుల యజమానులంతా మరోసారి జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్‌లో యాజమాన్యాన్ని సరిచూసుకోవాలని, అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తే సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించాలని డీసీపీ అవినాష్‌ మహంతి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement