జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి.. ప్రజలకు దూరం!
కమిషనర్ పేషీలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్
కమిషనర్‌ను కలవనివ్వకుండా అడ్డుకుంటున్న పోలీసులు ..
రాజకీయ అండ?
ఇదేం పద్ధతి అంటున్న ఫిర్యాదుదారులు
సాక్షి, హైదరాబాద్: అది జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం. కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లాలనుకుంటున్నవారికి కార్యాలయ ద్వారం ఎదుటే ఉన్న పోలీసులు అడ్డుకుంటారు. మీకు ఏం పని? అని అడుగుతారు. కమిషనర్ సార్‌ను కలవాలి. సర్కిల్, జోన్‌లో పరిష్కారం కానందున ఇక్కడికి వచ్చాం అంటే.. మీ సమస్య ఏమిటో అక్కడ చెప్పండి.. అంటూ దగ్గర్లోనే ఉన్న కంప్యూటర్ ఆపరేటర్‌ను చూపుతారు. అక్కడ తమ సమస్య చెప్పడానికి క్యూకట్టి చెబితే, నమోదు చేసుకొని ఇక వెళ్లమన్నట్లు సూచిస్తారు. సార్ అనుమతిస్తే కార్యాలయ సిబ్బంది మీకు ఫోన్ చేస్తారు. అప్పుడు వచ్చి కలవండి అని చెప్పి పంపిస్తారు.
.. ఇదీ రెగ్యులర్ కమిషనర్‌గా ప్రభుత్వం బాధ్యతలప్పగించాక, ఝార్ఖండ్ ఎన్నికల విధుల నుంచి తిరిగి వచ్చాక జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలవాలంటే సందర్శకులకు ఎదురవుతున్న అనుభవం. ఝార్ఖండ్ నుంచే వర్చువల్‌గా ఆదేశాలు జారీ చేస్తూ చురుగ్గా పనులు చేసిన కమిషనర్ శైలిని చూసిన నగర ప్రజలు అప్పుడు అహో అనుకున్నారు. ఇప్పుడు సార్‌ను కలవాలనుకుంటున్న ఫిర్యాదుదారులు అయ్యో ఇదేంటి? అని ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎస్‌పీఎఫ్‌తో భద్రత..
బహుశా జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కమిషనర్ పేషీలో విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్‌ఐ, మహిళా పోలీసులు కూడా వీరిలో ఉన్నారు. కమిషనర్‌ను కలిసేందుకు వస్తున్నవారిలో కొందరు అక్కడున్న పోలీసులను చూసి వెనకడుగు వేస్తున్నారు. వెళ్లేందుకు ముందుకొచ్చేవారిని ఏం పని కోసం వచ్చారో తెలుసుకొని కమిషనర్ పేషీలోని అధికారుల వద్దకు పంపిస్తున్నారు. వారు విషయాన్ని బట్టి అపాయింట్‌మెంట్ కోసం వివరాల నమోదుకు కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు పంపిస్తున్నారు. అపాయింట్‌మెంట్ ఎప్పుడు వస్తుందంటే విషయాన్ని బట్టి ఒక రోజు నుంచి వారం వరకు పట్టవచ్చు. లేదా అసలు రాకపోవచ్చని చెబుతున్నారని కమిషనర్‌ను కలిసేందుకు వచ్చిన వారిలో శ్రీనివాస్ అనే అతను చెప్పాడు. తాను అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎల్‌బీనగర్ నుంచి వచ్చానని తెలిపాడు. మరో వ్యక్తి తాను కొన్ని రోజుల క్రితం వచ్చి వివరాలు ఇచ్చి వెళ్లానని, ఇంకా కాల్ రాకపోవడంతో కనుక్కునేందుకు వచి్చనట్లు చెప్పాడు.
మంత్రులు ప్రజలను కలుస్తున్నా..
ఓవైపు తాము అధికారంలోకి వచ్చాక ప్రజలు సీఎం దాకా ఎవరినైనా కలిసే అవకాశం లభించిందని, ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు.. మంత్రులు సైతం గాందీభవన్ వేదికగానూ ప్రజా సమస్యలు స్వీకరిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ఎన్ని ఇబ్బందులెదురైనా ఆపబోమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం పేర్కొన్నారు. కోటిమంది సమస్యలు తీర్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ మాత్రం ప్రజలు తనను కలిసేందుకు సుముఖంగా లేరు. సార్ బిజీగా ఇతర పనుల్లో ఉన్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. దీన్ని చూసి ప్రజాపాలన అంటే ఇదేనా? అని విస్తుపోతున్న వారూ ఉన్నారు. గతంలో బల్దియా కమిషనర్లుగా పనిచేసిన వారెవరూ ఇలా వ్యవహరించలేదు. మరి ప్రజాపాలన అంటున్న ప్రభుత్వంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఇలంబర్తికి స్ఫూర్తి ఎవరో ఆయనకే తెలియాలి.
రాజకీయ అండ?
జీహెచ్‌ఎంసీకి రాకముందు ఇలంబర్తి రవాణా శాఖలో పని చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నారు. జీహెచ్‌ఎంసీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ మంత్రిగా ఆయనే సమీక్షలు చేస్తున్నారు. కమిషనర్‌కు మంత్రి అండదండలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ప్రజలను కలవని వ్యవహార శైలితో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
ఆయన అలా.. ఈయన ఇలా
ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిశోర్.. తాను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పని చేసిన కాలంలో తనను కలిసేందుకు వస్తున్న వారందరికీ కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేకపోవడం గుర్తించి.. వృద్ధులు తదితరులు ఎక్కువసేపు నిలబడి ఉండటం చూడలేక సందర్శకుందరికీ కూర్చునే సదుపాయం ఉండేలా ప్రత్యేక గది, కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఇలంబర్తి మాత్రం సందర్శకులనే పేషీలోకి రానీయడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment