Special Protection Force
-
సార్‌ను కలవాలంటే సవాలే!
సాక్షి, హైదరాబాద్: అది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం. కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లాలనుకుంటున్నవారికి కార్యాలయ ద్వారం ఎదుటే ఉన్న పోలీసులు అడ్డుకుంటారు. మీకు ఏం పని? అని అడుగుతారు. కమిషనర్ సార్‌ను కలవాలి. సర్కిల్, జోన్లో పరిష్కారం కానందున ఇక్కడికి వచ్చాం అంటే.. మీ సమస్య ఏమిటో అక్కడ చెప్పండి.. అంటూ దగ్గర్లోనే ఉన్న కంప్యూటర్ ఆపరేటర్‌ను చూపుతారు. అక్కడ తమ సమస్య చెప్పడానికి క్యూకట్టి చెబితే, నమోదు చేసుకొని ఇక వెళ్లమన్నట్లు సూచిస్తారు. సార్ అనుమతిస్తే కార్యాలయ సిబ్బంది మీకు ఫోన్ చేస్తారు. అప్పుడు వచ్చి కలవండి అని చెప్పి పంపిస్తారు. .. ఇదీ రెగ్యులర్ కమిషనర్‌గా ప్రభుత్వం బాధ్యతలప్పగించాక, ఝార్ఖండ్ ఎన్నికల విధుల నుంచి తిరిగి వచ్చాక జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలవాలంటే సందర్శకులకు ఎదురవుతున్న అనుభవం. ఝార్ఖండ్ నుంచే వర్చువల్‌గా ఆదేశాలు జారీ చేస్తూ చురుగ్గా పనులు చేసిన కమిషనర్ శైలిని చూసిన నగర ప్రజలు అప్పుడు అహో అనుకున్నారు. ఇప్పుడు సార్‌ను కలవాలనుకుంటున్న ఫిర్యాదుదారులు అయ్యో ఇదేంటి? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎస్పీఎఫ్తో భద్రత.. బహుశా జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కమిషనర్ పేషీలో విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్ఐ, మహిళా పోలీసులు కూడా వీరిలో ఉన్నారు. కమిషనర్‌ను కలిసేందుకు వస్తున్నవారిలో కొందరు అక్కడున్న పోలీసులను చూసి వెనకడుగు వేస్తున్నారు. వెళ్లేందుకు ముందుకొచ్చేవారిని ఏం పని కోసం వచ్చారో తెలుసుకొని కమిషనర్ పేషీలోని అధికారుల వద్దకు పంపిస్తున్నారు. వారు విషయాన్ని బట్టి అపాయింట్మెంట్ కోసం వివరాల నమోదుకు కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు పంపిస్తున్నారు. అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే విషయాన్ని బట్టి ఒక రోజు నుంచి వారం వరకు పట్టవచ్చు. లేదా అసలు రాకపోవచ్చని చెబుతున్నారని కమిషనర్‌ను కలిసేందుకు వచ్చిన వారిలో శ్రీనివాస్ అనే అతను చెప్పాడు. తాను అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎల్బీనగర్ నుంచి వచ్చానని తెలిపాడు. మరో వ్యక్తి తాను కొన్ని రోజుల క్రితం వచ్చి వివరాలు ఇచ్చి వెళ్లానని, ఇంకా కాల్ రాకపోవడంతో కనుక్కునేందుకు వచి్చనట్లు చెప్పాడు. మంత్రులు ప్రజలను కలుస్తున్నా.. ఓవైపు తాము అధికారంలోకి వచ్చాక ప్రజలు సీఎం దాకా ఎవరినైనా కలిసే అవకాశం లభించిందని, ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు.. మంత్రులు సైతం గాందీభవన్ వేదికగానూ ప్రజా సమస్యలు స్వీకరిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ఎన్ని ఇబ్బందులెదురైనా ఆపబోమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం పేర్కొన్నారు. కోటిమంది సమస్యలు తీర్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం ప్రజలు తనను కలిసేందుకు సుముఖంగా లేరు. సార్ బిజీగా ఇతర పనుల్లో ఉన్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. దీన్ని చూసి ప్రజాపాలన అంటే ఇదేనా? అని విస్తుపోతున్న వారూ ఉన్నారు. గతంలో బల్దియా కమిషనర్లుగా పనిచేసిన వారెవరూ ఇలా వ్యవహరించలేదు. మరి ప్రజాపాలన అంటున్న ప్రభుత్వంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఇలంబర్తికి స్ఫూర్తి ఎవరో ఆయనకే తెలియాలి. రాజకీయ అండ? జీహెచ్ఎంసీకి రాకముందు ఇలంబర్తి రవాణా శాఖలో పని చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ మంత్రిగా ఆయనే సమీక్షలు చేస్తున్నారు. కమిషనర్‌కు మంత్రి అండదండలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ప్రజలను కలవని వ్యవహార శైలితో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన అలా.. ఈయన ఇలా ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిశోర్.. తాను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పని చేసిన కాలంలో తనను కలిసేందుకు వస్తున్న వారందరికీ కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేకపోవడం గుర్తించి.. వృద్ధులు తదితరులు ఎక్కువసేపు నిలబడి ఉండటం చూడలేక సందర్శకుందరికీ కూర్చునే సదుపాయం ఉండేలా ప్రత్యేక గది, కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఇలంబర్తి మాత్రం సందర్శకులనే పేషీలోకి రానీయడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పండి!
న్యూఢిల్లీ/చండీగఢ్: భారీ భద్రతా వైఫల్యం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. బుధవారం ప్రధాని కాన్వాయ్ ప్రయాణిస్తున్న మార్గాన్ని కొందరు నిరసనకారులు అడ్డుకోవడంతో ఆయన సుమారు 20 నిమిషాలు ఒక ఫ్లైఓవర్‌పై నిలిచిపోయారు. దీనిపై మండిపడిన కేంద్ర హోంశాఖ ఘటనపై తక్షణ వివరణ ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తగిన మోహరింపులు చేయలేదని అభిప్రాయపడింది. మోదీ కాన్వాయ్‌ను ఆపి పైరియాణా సమీపంలో ఆందోళనకు దిగిన రైతులు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం సహించరానిదని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి అమిత్‌షా చెప్పారు. మరోవైపు ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రధానిపై భౌతికదాడికి కాంగ్రెస్ యత్నించిందని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ ర్యాలీకి జనాలు తగినంతగా హాజరుకాలేదనే ప్రధాని వెనుదిరిగారని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ఘటన కారణంగా ముందుగా నిర్ణయించిన ఫిరోజ్‌పూర్ ర్యాలీని ప్రధాని రద్దు చేసుకున్నారు. ఈ పర్యటనలో మోదీ దాదాపు రూ. 42,750 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఏం జరిగింది? హోంశాఖ కథనం ప్రకారం హుసేనీవాలా జాతీయ అమరవీరుల స్మారకం సందర్శన కోసం బుధ వారం ఉదయం ప్రధాని మోదీ పంజాబ్‌లోని భ టిండా చేరుకున్నారు. అక్కడినుంచి స్మారకచిహ్నం వద్దకు ఆయన హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉంది. అయితే అనుకోకుండా వర్షం పడి వాతావరణం ప్రతికూలంగా మారింది. వాతావరణం అనుకూలంగా మారుతుందేమోనని ప్రధాని దాదాపు 20 నిమిషాలు వేచిచూశారు. కానీ వాతావరణంలో మార్పు కనిపించకపోవడంతో రోడ్డు మార్గంలో జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు రెండు గంటల సమయం పడుతుంది. ప్రధాని రోడ్డుమార్గం ద్వారా ప్రయాణమయ్యే విషయాన్ని అధికారులు రాష్ట్ర డీజీపీకి తెలియజేసి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. పోలీసుల నుంచి తగిన ధ్రువీకరణ అందిన తర్వాత ప్రధాని కాన్వాయ్ హుసేనీవాలాకు బయలుదేరింది. గమ్యానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ప్రధాని కాన్వాయ్ పైరియాణా గ్రామ సమీప ఫ్లైఓవర్‌ను చేరుకుంది. అక్కడ కొందరు రైతులు నిరసనకు దిగి రోడ్డును దిగ్భంధించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రధాని తన కాన్వాయ్‌తో ఫ్లైఓవర్‌పై దాదాపు 15–20 నిమిషాలు నిలిచిపోవాల్సి వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే దేశ నాయకుడు నడిరోడ్డుపై నిలిచిపోవడాన్ని చూసి దేశం నిర్ఘాంతపోయింది. సుమారు 200 మంది రైతులు అకస్మాత్తుగా రోడ్డును నిర్భంధించారని పంజాబ్ డీఐజీ ఇందర్బీర్ సింగ్ చెప్పారు. క్రమం గా ఫ్లైఓవర్‌కు అవతల నిరసనకారులు భారీగా గుమిగూడుతుండడంతో రక్షణకు రిస్కు ఏర్పడుతుందని భావించి ప్రధాని కాన్వాయ్‌ను తిరిగి భటిండాకు మరలించాలని నిర్ణయించామన్నారు. ఆ ముగ్గురూ ఎందుకు లేరు! దేశ ప్రధాని ఒక రాష్ట్ర రాజధానికి వస్తే గవర్నర్, సీఎం, ఇతర ఉన్నతాధికారులు తప్పక ఆహ్వానం పలకాలి. అదే రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పర్యటనకు వస్తే ప్రభుత్వం తరఫున సీఎం లేదా ఒక మంత్రితో పాటు ఉన్నతాధికారులు హాజరవుతారు. కలకలం రేపుతున్న ప్రధాని పంజాబ్ పర్యటనలో ఆయనకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మాత్రమే స్వాగతం పలికారు. సీఎం, సీఎస్, డీజీపీ స్వాగతించేందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి స్వాగతం పలికినా, కేంద్ర సర్వీసులకు చెందిన డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఎందుకు రాలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. తన సిబ్బందిలో కొందరికి కరోనా సోకడం వల్ల తాను వెళ్లలేదని సీఎం చన్నీ చెప్పారు. ఐదు ప్రశ్నలు 1. ప్రధాని ప్రయాణించే మార్గాన్ని క్లియర్ చేయడంలో పంజాబ్ పోలీసులు ఎందుకు విఫలమయ్యారు? 2. నిరసనకారులకు ప్రధాని మోదీ రోడ్డు మార్గాన వెళుతున్నట్లు, ఫలానా రోడ్డులోనే వెళుతున్నట్లు ఎలా తెలుసు? ఎవరు ఉప్పందించారు? 3. ప్రధాని భద్రతా సిబ్బందికి రైతులు రోడ్డును దిగ్భందించారని తెలుసా? 4. ప్రధాని ప్రయాణిస్తున్న మార్గాన్ని మార్చినట్లు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ– మోదీ భద్రత చూస్తుంది) పంజాబ్ పోలీసులకు తెలిపిందా? 5. జరగబోయేదేమిటో పంజాబ్ అధికార యంత్రాంగానికి ముందే తెలుసా? ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నా.. మీ సీఎంకు థ్యాంక్స్! మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పండి. కనీసం నేను భటిండా విమానాశ్రయం వరకు ప్రాణాలతో వచ్చాను కదా!’’ అని ప్రధాని మోదీ పంజాబ్ అధికారులతో వ్యాఖ్యానించారు. హుసేనీవాలా అమరవీరుల స్మారకం వద్దకు బయలుదేరిన ప్రధాని, భద్రతా వైఫల్యం కారణంగా వెనుదిరిగి భటిండాకు చేరుకున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే ఆయన తనను కనీసం ప్రాణాలతో ఉంచారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రధాని వ్యాఖ్యల విషయం తనకు తెలియదని పంజాబ్ సీఎం చన్నీ చెప్పారు. ఒకవేళ ప్రధాని కోపంతోనో, రాజకీయ ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్య లు చేసి ఉంటే తానేమీ వ్యాఖ్యానించబోనన్నారు. సీఎం కనీసం అందుబాటులో లేరు! ఒకపక్క మార్గం క్లియర్‌గా ఉందని ప్రధాని భద్రతా దళాని (ఎస్పీజీ)కి పంజాబ్ డీజీపీ, సీఎస్ హామీ ఇచ్చారు, మరోపక్క అదే మార్గంలో నిరసనకారులకు అనుమతినిచ్చారు. పరిస్థితిని ఇంకా త్రీవం చేసేందుకు సీఎం చన్నీ కనీసం ఫోనులో అందుబాటులోకి రాలేదు, ఈ సమస్యను పరిష్కరించే యత్నాలు చేపట్టలేదు. ప్రజాస్వామ్య సూత్రాలను నమ్మే ఎవరికైనా పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు బాధను కలిగిస్తాయి. మోదీ ర్యాలీకి హాజరుకాకుండా ప్రజలను అడ్డుకోవాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు. నిరసనకారులతో కలిసి భారీగా బస్సులను ఆపేశారు. ఇలాంటి చర్యలతో భగత్ సింగ్ తదితర దేశభక్తులకు ప్రధాని నివాళి అర్పించకుండా అడ్డుకున్నారు. వీరికి స్వాతంత్య్ర సమరయోధులపై ఎలాంటి గౌరవం లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీ ఇలాంటి పనులు చేస్తోంది. పంజాబ్‌లో ప్రధాని ఆరంభించాల్సిన వేలాది కోట్ల రూపాయల అభివృద్ది పనులు వీరివల్ల ఆగిపోయాయి. కానీ మేము వీరిలాగా చౌకబారుతనంతో వ్యవహరించము. ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధికే పాటుపడతాం.’’ – బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వివరాలు ఎవరు లీక్ చేశారు? ప్రధాని మార్గాన్ని అడ్డుకున్న వ్యక్తులకు పంజాబ్ ప్రభుత్వంలో ఎవరు సమాచారమందించారు? ప్రధాని పర్యటనకు తప్పుడు క్లియరెన్స్ ఎందుకిచ్చారు? రక్షణ వైఫల్యం జరిగిందన్న సమాచారం తర్వాత ఎందుకు ఎవరూ స్పందించలేదు? ప్రధాని మృత్యు అంచుకు వెళ్లడం కాంగ్రెస్ నేతలకు ఆనందానిస్తోందా? దేశ ప్రధానిని ప్రమాదకరమైన మార్గంలో తీసుకువచ్చేలా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యత్నించడం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. పంజాబ్ పుణ్యభూమిపై హత్యాకాండ జరపాలని యత్నించి కాంగ్రెస్ విఫలమైంది. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. – స్మృతీ ఇరానీ, కేంద్ర మంత్రి జరిగిన దానికి చింతిస్తున్నాం! మార్గమధ్యంలో అడ్డంకుల వల్ల ప్రధాని వెనుతిరగడంపై విచారిస్తున్నాం. ఆయన దేశానికి ప్రధాని, మేమంతా గౌరవిస్తాం. భద్రతా లోపం ఉందని చెప్పడం సరికాదు. భటిండా నుంచి పీఎం రోడ్డు మార్గంలో వెళ్తారన్న ప్రణాళికేమీ లేదు. కొందరు నిరసనకారులు రోడ్డుపైకి రాగా ప్రధాని కాన్వాయ్‌ని మరో మార్గం ద్వారా లేదా హెలికాప్టర్ ద్వారా వెళ్లమని సూచించాం. కానీ ఆయన వెనుదిరిగారు. ఇది బాధాకరం. గతరాత్రి రోడ్డుపైకి వచ్చిన ఆందోళనకారులను తొలగించాం. అయినాకానీ అనుకోకుండా కొందరు నిరసనకారులు రోడ్డుపైకి రావడమనేది హానికరమేమీ కాదు. రైతుల ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళనలు చేశారు కానీ ఎవరికీ హాని చేయలేదు. అలాంటి వారిపై లాఠీలు ఝళిపించమని చెప్పలేను. ఫిరోజ్పూర్లో బీజేపీ ర్యాలీ కోసం 70 వేల కుర్చీలు ఏర్పాటు చేస్తే 700 మంది వచ్చారు. దీనికి నేనేమీ చేయలేను. హోంశాఖ కోరినట్లు మొత్తం çఘటనపై విచారణ చేస్తాం. రోడ్డు మార్గంలో వెళ్లాలనేది పోలీసు, ఎస్పీజీ ఇతర ఏజెన్సీల ఉమ్మడి నిర్ణయం. ఈ నిర్ణయాల్లో పోలీసుల పాత్ర చాలా పరిమితం. ఎస్పీజీ, ఐబీ తదితర కేంద్ర ఏజెన్సీలు వీటిని నిర్వహిస్తాయి. ఈ మొత్తం ఘటనను అనవసరంగా రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే అతిధిపై దాడి చేయడం కన్నా చావడానికే ఒక పంజాబీ ప్రాధాన్యమిస్తాడు. – చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ సీఎం -
ఎస్పీఎఫ్లోకి కేంద్ర బలగాల సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కీలకమైన వ్యవస్థల భద్రతను పర్యవేక్షిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్)లోకి కేంద్ర సాయుధ బల గాల సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకువచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్న ట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముఖ్యమైన దేవాలయాలు, నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్లాంట్లు.. ఇలా కీలకమైన వ్యవస్థల భద్రతను ఎస్పీఎఫ్ సాయుధ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఎస్పీఎఫ్లోకి కేంద్ర సాయుధ బలగాల సిబ్బందిని రెండు నుంచి ఐదేళ్ల పాటు డిప్యూటేషన్‌పై తీసుకువచ్చి భద్రతలో భాగస్వామ్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సిబ్బందిలో ఆందోళన.. ఉమ్మడి రాష్ట్రంలో 1991లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటైంది. 1994లో కేంద్ర బలగాల సిబ్బందిని డిప్యూటేషన్‌పై ఇక్కడికి తీసుకువచ్చారు. వాళ్లలో ఇప్పుడు చాలా కమాండెం ట్, ఇతర ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు డిప్యూటేషన్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఎస్పీఎఫ్కు ప్రత్యేకంగా రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతోంది. దాంతో డిప్యూటేషన్ల అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం 1,800 మంది సిబ్బంది ఎస్పీఎఫ్లో పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ డిప్యూటేషన్ వ్యవహారం తెరమీదకు రావడం సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి స్పష్టమైన కారణం ఏంటన్నది మాత్రం బయటకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా హైకోర్టు జడ్జిల భద్రతకు! కొంత మంది ఉన్నతాధికారులను ఈ విష యంపై సంప్రదించగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైకోర్టుతో పాటు సంబంధిత జడ్జిలకు ప్రత్యేకమైన భద్రత కల్పించాల్సి ఉందని, అందులో భాగంగానే కేంద్ర సాయుధ బలగాలను ఇక్కడ మోహరించేందుకు కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలను పంపించామని తెలిపా రు. రాష్ట్ర హైకోర్టు, న్యాయ విహార్, కీలకమైన న్యాయమూర్తుల నివాస గృహాల వద్ద కేంద్ర బలగాలను నియమించే అవకాశం ఉందని సంబంధిత అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఎస్పీఎఫ్ రాష్ట్రంలోని ప్రధానమైన దేవాలయాలు, నీటి పారుదల ప్రాజెక్టులు, బ్యాంకులు, విద్యుత్ కేం ద్రాలు.. తదితర కీలక వ్యవస్థల వద్ద గస్తీ కాసే ప్రతీ ఎస్పీఎఫ్ జవాను మీద ఆయా విభాగా లు ప్రభుత్వ ట్రెజరీకి బిల్లులు చెల్లిస్తుంటాయి. ఎస్పీఎఫ్ భద్రత కల్పిస్తున్న సంస్థలు ఏటా రూ.50 కోట్ల మేర బిల్లులు చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు కేంద్ర బలగాలను ఇక్కడికి తీసుకురావడం వల్ల తమ పదోన్నతులకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందని ఎస్పీఎఫ్ సిబ్బంది అంటున్నారు. శాశ్వతం అవుతుందా? ఐటీబీపీ, సహస్ర సీమాబల్, బీఎస్ఎఫ్లో ఉ న్న తెలంగాణ ప్రాంతానికి చెందిన 500 మంది సిబ్బందిని డిప్యూటేషన్‌పై పంపాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. అయితే 1994లో కూడా ఇలాగే కొద్ది కాలం డిప్యుటేషన్ మాత్రమే ఉంటుందని భావించినా అలా వచ్చిన వారు తర్వాత శాశ్వత ప్రతిపాదికన ఉండిపోవడంతో ఎస్పీఎఫ్లో గందరగోళం నెలకొంది. -
ఎస్పీఎఫ్... డీజీపీ పరిధిలోకి వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: హోంశాఖ పరిధిలో పనిచేస్తున్నా ఆ విభాగం పోలీస్ శాఖకు దూరంగా ఉంటుంది. వాళ్లూ ఆయుధాలతో గస్తీ కాస్తున్నా రాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలోకి రారు. అంతే కాదు... వాళ్లకు జోన్ల నియామకాలు, జిల్లాలవారీ బదిలీలు ఉండవు. కుటుంబాలకు దూరంగా రాష్ట్ర రాజధానితో పాటు దేవాలయాలు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రిజర్వ్ బ్యాంక్ తదితర కీలక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలకు ఆయుధాలతో భద్రత కల్పిస్తారు. అయితే ఇప్పుడు ఆ విభాగాన్ని డీజీపీ పరిధిలోకి తేవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్.. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగం పోలీస్ శాఖకు సంబంధం లేకుండా ఓ అదనపు డీజీపీ నేతృత్వంలో కార్యాలయాల భద్రతను పర్యవేక్షిస్తుంది. సుమారు 2 వేల మంది సిబ్బంది ఉన్న ఈ విభాగంలో నియామకాలు పోలీస్ రిక్రూట్మెంట్ నుంచే జరిగినా అవి జిల్లా, రేంజ్‌లు కాకుండా స్టేట్ కేడర్ (రాష్ట్ర స్థాయి) పోస్టుగా పరిగణనలోకి వస్తుంది. దీంతో ఏ జిల్లా నుంచి సెలక్ట్ అయినా రాష్ట్ర స్థాయిలో ఎక్కడకు పోస్టింగ్ వేస్తే అక్కడికి వెళ్లాల్సిందే. డీజీపీ పరిధిలోకి తీసుకురావాలని... నూతన జిల్లాలు, రేంజ్‌లు, జోన్ల ఏర్పాటు జరిగినా ఈ విభాగానికి అవి వర్తించే అవకాశాలు కనిపించడంలేదు. అయితే సిబ్బంది మాత్రం 2014లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో డీజీపీ పరిధిలోకి తెచ్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కొత్త జోన్ల నిబంధనలు ఎస్పీఎఫ్లో అమలుకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం (హోంశాఖ) చర్యలు చేపట్టలేదు. కొత్త జోన్ల అమలు వల్ల సిబ్బంది తమ సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించే అవకాశం లభిస్తుంది. దానివల్ల మానసిక ఆందోళనలు తొలగడంతోపాటు వారి పిల్లల స్థానికత సమస్య కూడా తీరుతుందని భావించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇకపై రాష్ట్ర స్థాయి నియామకాలు ఉండవని ఉత్తర్వుల్లో ఉన్నా తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విషయంలో మాత్రం అధికారులు దీనిపై క్లారిటీ ఇవ్వడంలేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే డీజీపీ పరిధిలోకి ఈ విభాగాన్ని తేవడం వల్ల సిబ్బందితోపాటు వారి తల్లిదండ్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందేలా ఆరోగ్య భద్రత, లోన్లు కూడా అందే అవకాశం ఉంది. అదేవిధంగా పోలీస్ శాఖ కోటాలో సిబ్బంది పిల్లలకు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇతర శాఖల్లో డెప్యుటేషన్‌పై పనిచేసే సౌలభ్యం దొరుకుతుంది. జోన్ల ప్రకారం కేడర్ విభజన జరిగితే సిబ్బంది పిల్లలు వారి సొంత స్థానికతను పొందిన వారవుతారని ఎస్పీఎఫ్ సిబ్బంది వేడుకుంటున్నారు. మెడపై కత్తిలా కేంద్ర బలగాల డిప్యూటేషన్... ప్రాజెక్టులు, కీలకమైన కార్యాలయాలు, భవనాల భద్రతను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను ఎస్పీఎఫ్ పరిధిలోకి శాశ్వత డెప్యుటేషన్‌పై తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల ఆ విభాగంలోని సిబ్బంది పదోన్నతులతోపాటు నిరుద్యోగులకు సైతం తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బలగాల నుంచి వచ్చే సిబ్బందిని వారివారి నియామక తేదీలను బట్టి సీనియారిటీ ఖరారు చేసి రాష్ట్ర కేడర్లోనే ప్రమోషన్లు కల్పించాల్సి ఉంటుంది. ఇది అధికారులతోపాటు సిబ్బంది మెడపై కత్తిలా వేలాడే ప్రమాదముంటుందనే చర్చ జరుగుతోంది. అందుకే రాష్ట్రస్థాయి నియామకాలైన పోలీస్ కమ్యూనికేషన్, జైళ్ల శాఖల్లాగానే తమకూ రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేసేలా చూడాలని సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
వైరల్ : భలే గమ్మత్తుగా పోలీస్ ట్రైనింగ్
పోలీస్ ట్రైనింగ్‌లో శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజులో 18 గంటల పాటు వివిధ రకాల ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొనడంతో ఒళ్లు నొప్పులు పుట్టడం ఖాయం. ఎంతైనా అలాంటి కఠిన శిక్షణ ఉంటేనే కదా.. వారు శారీరకంగానూ, మానసికంగానూ ధృడంగా తయారయ్యేది. తాజాగా తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ట్రైనీ పోలీసులకు శిక్షణ ఇస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(వైరల్: వీళ్లు మనసు దోచుకున్న దొంగలు!) వివరాలు.. మహ్మద్ రఫీ.. తెలంగాణ పోలీసుశాఖలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్న రఫీ ట్రైనీ పోలీసులకు శిక్షణ అందిస్తున్నాడు. పోలీసైన రఫీకి బాలీవుడ్ లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీ పాటలంటే ప్రాణం.. ట్రైనీ పోలీసులకు శిక్షణ కఠినంగా అనిపించకుండా ఉండేదుకు రఫీ పాటలు పాడుతూ శిక్షణ నిర్వహిస్తుంటాడు . తాజాగా 1970లో వచ్చిన హమ్‌జోలీ సినిమా నుంచి రఫీ పాడిన 'దల్ గయా దిన్.. హో గయి శామ్' పాటను పాడుతూనే శిక్షణ నిర్వహించాడు. ఈ వీడియోనూ ఇండియన్ పోలీస్ సర్వీస్ అసోసియేషన్ తన ట్విటర్లో షేర్ చేస్తూ..' ఇవి శిక్షణకు సంబంధించి మా రఫీ చేస్తున్న పాటలు.. ఒకరేమో పోలీస్.. మరొకరేమో లెజండరీ సింగర్..ఇద్దరు పేర్లు కామన్‌గా ఉన్నా.. మా రఫీ కూడా పాటలు బాగా పాడుతాడు. ట్రైనీ పోలీసులకు శిక్షణ అందిస్తూనే వారికి ఇంటి బెంగను, శారీరక శ్రమను మరిచిపోయేలా చేస్తాడు.. నిజంగా ఇది అతనికున్న గొప్ప అభిరుచి' అంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. -
రేపటి నుంచి ‘కానిస్టేబుల్’ అటెస్టేషన్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగంలో స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుల్ (ఎస్‌సీటీపీసీఎస్), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పోలీసు కానిస్టేబుల్స్, తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఫైర్‌మన్ దేహదారుఢ్య, రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ అటెస్టేషన్ దరఖాస్తులు సమర్పించాలని సైబరాబాద్, రాచకొండ సీపీలు సందీప్ శాండిల్యా, మహేశ్‌భగవత్ సోమవారం ప్రకటించారు. వీరంతా బుధవారం నుంచి ఈ నెల 10 లోపు సంబంధిత పోలీస్ కమిషనరేట్లలో దరఖాస్తులు అందజేయాలన్నారు. ఒరిజినల్ విద్య, కుల ధృవీకరణ, స్పెషల్ కేటగిరి స్టేటస్ పత్రాలతో పాటు గెజిటెడ్ అధికారి సంతకం చేసిన జిరాక్స్ సెట్ కూడా తీసుకురావాలని తెలిపారు. మంగళవారం నుంచి టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్, ఎస్ఎస్సీ హాల్‌టికెట్ నంబర్లు ఎంటర్ చేసి ఇంటిమేషన్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. -
తాత్కాలిక సచివాలయానికి ఎస్పీఎఫ్ భద్రత
పూర్తిస్థాయిలో విధుల నిర్వహణకు సన్నద్ధమవుతున్న ఏపీ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం భద్రత ఏర్పాట్లపై పోలీసు శాఖ దృష్టి సారించింది. దసరా నుంచి సీఎం చంద్రబాబుతోసహా మంత్రులందరూ తాత్కాలిక సచివాలయం నుంచే విధులు చేపడతామని చెప్పడంతో పోలీసు శాఖ కార్యాచరణకు ఉపక్రమించింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం భద్రత బాధ్యతలను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)కు అప్పగించారు. తాత్కాలిక సచివాలయాన్ని ఎస్పీఎఫ్ శుక్రవారం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇకనుంచి తాత్కాలిక సచివాలయ భద్రతతోపాటు ఉద్యోగులు, సందర్శకుల రాకపోకలన్నీ ఎస్పీఎఫ్ పర్యవేక్షిస్తుంది. తాత్కాలిక సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో ఎస్పీఎఫ్కు ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించారు. అదనపు డీజీపీ అంజనాసిన్హా ఈ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం డీఐజీ ఏసురత్నం, ఇతర అధికారులతో సమావేశమై తాత్కాలిక సచివాలయ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. సచివాలయానికి మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దసరా నుంచి డీఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రతను కల్పిస్తారు. ఎంతమంది అధికారులు, సిబ్బందిని కేటాయించాలన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికి ఒక సీఐ, ముగ్గురు ఎస్.ఐ.లు, ఒక అసిస్టెంట్ కమాండెంట్‌తోపాటు దాదాపు 100 మంది కానిస్టేబుళ్లను కేటాయించారు. సచివాలయంలోకి ప్రవేశించే అన్ని మార్గాలు, ఆరుబ్లాకుల వద్ద భద్రత సిబ్బందిని నియోగించారు. ఉద్యోగులు కూడా ఐడీ కార్డులు చూపించే సచివాలయంలోకి ప్రవేశించాలి. అనుమతి పాస్‌లు ఉన్న సందర్శకులనే లోపలికి అనుమతిస్తారు. సందర్శకుల వివరాలు పరిశీలించి అనుమతి పాస్‌లు మంజూరుచేసేందుకు ప్రధాన ద్వారం సమీపంలో ఓ కౌంటర్ ఏర్పాటు చేస్తారు. అదనపు డీజీ అంజనాసిన్హా విలేకరులతో మాట్లాడుతూ తాత్కాలిక సచివాలయం భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 24/7 కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని, ఐడీ కార్డులు, పాస్‌లు లేనిదే ఎవరినీ సచివాలయంలోకి అనుమతించబోమని చెప్పారు. -
తిరుమల భద్రతపై ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, తిరుమల: దేశంలో ఉగ్రవాద దుశ్చర్యలు నానాటికీ పెరిగిపోతున్నా, టార్గెట్ తిరుమల పేరుతో ముష్కరగణం ఇప్పటికే రెక్కీ నిర్వహించినా తిరుమల భద్రతపై టీటీడీ అధికారులు, ప్రభుత్వ పెద్దలకు చీమకుట్టినట్టు కూడా లేదు. రూ.62 కోట్లతో 2వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి రెండున్నరేళ్లయినా ఇంతవరకు ప్రాజె క్టు కార్యరూపం దాల్చకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. శ్రీవారి దర్శనానికి దేశ, విదేశాల నుంచి రోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తులతోపాటు ఆలయ భద్రత కోసం టీటీడీ ఏటా సుమారు రూ.100 కోట్ల దాకా వెచ్చిస్తోంది. ‘తిరుమలలోనూ ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు భద్రతా చర్యలు వేగవంతం చేశాం’ అని 2008 లోనే అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తిరుమల పర్యటనలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాతే ఆక్టోపస్ యూనిట్ తిరుమలలో నెలకొల్పారు. ఆర్మ్డ్ రిజర్వు బలగాలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు (ఎస్పీఎఫ్) సంఖ్యను పెంచారు. శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు మాత్రమే పరిమితమైన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా(సీసీ కెమెరా) వ్యవస్థను పెంచాలని నిర్ణయించారు. ఈ సీసీ కెమెరా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని ఎల్కే అద్వానీ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కూడా సిఫారసు చేసింది. రెండున్నరేళ్లుగా నలుగుతున్న ప్రాజెక్టు.. కేంద్ర మంత్రుల హెచ్చరికలు, కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల సిఫారసులు, సూచనలతో తిరుమలతో పాటు తిరుపతిలోనూ 2వేల సీసీ కెమెరాలతో భద్రత పటిష్టం చేయాలని టీటీడీ నిర్ణయించింది. 2013 జూన్ 15న రూ.62 కోట్లతో 2వేల అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 26న అప్పటి టీటీడీ సీవీఎస్వో జీవీజీ అశోక్ కుమార్ న్యూఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఢిల్లీ కమిషనరేట్‌లోని సీసీ కెమెరా వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అదే సందర్భంలో రాష్ట్ర విభజన వేడి పెరిగింది. ఆ ఫైలు అక్కడికక్కడే ఆగిపోయింది. తర్వాత టీటీడీ అధికారులు, పాలకులు పట్టించుకోలేదు. సీసీటీవీ ఫుటేజ్‌తో వెలుగుచూసిన ‘టార్గెట్ తిరుమల’ రెక్కీ ఉగ్ర చర్యల్లో భాగంగా ‘టార్గెట్ తిరుమల’ పేరుతో తిరుమలలో రెక్కీ చేసినట్టు పోలీసుల అదుపులో ఉన్న తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన సుభాష్ రామచంద్రన్(30) అంగీకరించారు. ఈ విషయాన్ని తిరుమలలోని సీసీ కెమెరా ఫుటేజీ ద్వారానే ధ్రువీకరించుకోవటం గమనార్హం. ఒకవేళ ఈ సీసీ కెమెరా వ్యవస్థ కూడా లేకపోతే ఉగ్ర రెక్కీ చర్యలు వెలుగుచూసేవి కావు. ఇంతటి ప్రాధాన్యత కలిగినప్రాజెక్టు అమలు గురించి టీటీడీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడం గమనార్హం. -
గాంధీ ఆస్పత్రికి ఎస్పీఎఫ్ భద్రత
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి ఇకపై ప్రత్యేక భద్రతా దళాలు రక్షణ కల్పించనున్నాయి. గాంధీ ఆస్పత్రికి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) విభాగం మంజూరైన విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్పీఎఫ్ డీఎస్పీ ఆంజనేయులుతో మంగళవారం సూపరింటెండెంట్ సమావేశమై బలగాలకు అవసరమైన వసతులు, విశ్రాంతి గది, ఆయుధాలు భద్రపర్చేందుకు చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలను చర్చించారు. ఎనిమిది మంది ఎస్పీఎఫ్ సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండనున్నారు. త్వరలోనే వారి సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
పక్కదోవ పట్టించేందుకే చర్చలు: జూడాలు
హైదరాబాద్: ప్రభుత్వం మొండివైఖరి వీడి ప్రధాన డిమాండ్‌ను పరిష్కరించాలని జూడాల అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జూడాల ఆందోళనలో భాగంగా మంగళవారం 16వ రోజు కోఠి డీఎంహెచ్ఎస్ వద్ద పండ్లు అమ్ముతూ, ప్రభుత్వ వాహనాలు తుడుస్తూ వినూత్న నిరసన తెలిపారు. అనంతరం డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ పుట్టా శ్రీనివాస్ ఆహ్వానించడంతో జూడాలు రెండుగంటలపాటు చర్చలు జరిపినా విఫలవుయ్యాయి. జూడాల పలు డిమాండ్లకు ప్రభుత్వం సుముఖంగా ఉందని డీఎంఈ తెలిపారు. హౌజ్సర్జన్లకు సమానంగా వేతనాలు చెల్లిస్తామని, ప్రభుత్వ ఆసుపత్రులలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిపాటు పనిచేయాలన్న నిబంధనను తీసివేయుడం సాధ్యం కాదన్నారు. కాగా పర్మనెంట్ చేస్తే గ్రామాల్లో పనిచేస్తామనే డిమాం డ్‌ను డీఎంఈ పక్కదోవ పట్టిస్తున్నారని జూడాల అధికార ప్రతినిధులు స్వప్నిక, నరేశ్ దుయ్యబ ట్టారు. ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధి ఉంటే తవు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
స్పెషల్ ప్రొటెక్షన్ఫోర్స్లో విభజన గందరగోళం