న్యూఢిల్లీ/చండీగఢ్: భారీ భద్రతా వైఫల్యం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. బుధవారం ప్రధాని కాన్వాయ్ ప్రయాణిస్తున్న మార్గాన్ని కొందరు నిరసనకారులు అడ్డుకోవడంతో ఆయన సుమారు 20 నిమిషాలు ఒక ఫ్లైఓవర్‌పై నిలిచిపోయారు. దీనిపై మండిపడిన కేంద్ర హోంశాఖ ఘటనపై తక్షణ వివరణ ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తగిన మోహరింపులు చేయలేదని అభిప్రాయపడింది.
మోదీ కాన్వాయ్‌ను ఆపి పైరియాణా సమీపంలో ఆందోళనకు దిగిన రైతులు
ప్రధాని పర్యటనలో భద్రతా లోపం సహించరానిదని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి అమిత్‌షా చెప్పారు. మరోవైపు ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రధానిపై భౌతికదాడికి కాంగ్రెస్ యత్నించిందని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ ర్యాలీకి జనాలు తగినంతగా హాజరుకాలేదనే ప్రధాని వెనుదిరిగారని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ఘటన కారణంగా ముందుగా నిర్ణయించిన ఫిరోజ్‌పూర్ ర్యాలీని ప్రధాని రద్దు చేసుకున్నారు. ఈ పర్యటనలో మోదీ దాదాపు రూ. 42,750 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది.
ఏం జరిగింది?
హోంశాఖ కథనం ప్రకారం హుసేనీవాలా జాతీయ అమరవీరుల స్మారకం సందర్శన కోసం బుధ వారం ఉదయం ప్రధాని మోదీ పంజాబ్‌లోని భ టిండా చేరుకున్నారు. అక్కడినుంచి స్మారకచిహ్నం వద్దకు ఆయన హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. అయితే అనుకోకుండా వర్షం పడి వాతావరణం ప్రతికూలంగా మారింది. వాతావరణం అనుకూలంగా మారుతుందేమోనని ప్రధాని దాదాపు 20 నిమిషాలు వేచిచూశారు. కానీ వాతావరణంలో మార్పు కనిపించకపోవడంతో రోడ్డు మార్గంలో జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు.
ఇందుకు రెండు గంటల సమయం పడుతుంది. ప్రధాని రోడ్డుమార్గం ద్వారా ప్రయాణమయ్యే విషయాన్ని అధికారులు రాష్ట్ర డీజీపీకి తెలియజేసి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. పోలీసుల నుంచి తగిన ధ్రువీకరణ అందిన తర్వాత ప్రధాని కాన్వాయ్ హుసేనీవాలాకు బయలుదేరింది. గమ్యానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ప్రధాని కాన్వాయ్ పైరియాణా గ్రామ సమీప ఫ్లైఓవర్‌ను చేరుకుంది. అక్కడ కొందరు రైతులు నిరసనకు దిగి రోడ్డును దిగ్భంధించినట్లు అధికారులు గుర్తించారు.
దీంతో ప్రధాని తన కాన్వాయ్‌తో ఫ్లైఓవర్‌పై దాదాపు 15–20 నిమిషాలు నిలిచిపోవాల్సి వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే దేశ నాయకుడు నడిరోడ్డుపై నిలిచిపోవడాన్ని చూసి దేశం నిర్ఘాంతపోయింది. సుమారు 200 మంది రైతులు అకస్మాత్తుగా రోడ్డును నిర్భంధించారని పంజాబ్ డీఐజీ ఇందర్‌బీర్ సింగ్ చెప్పారు. క్రమం గా ఫ్లైఓవర్‌కు అవతల నిరసనకారులు భారీగా గుమిగూడుతుండడంతో రక్షణకు రిస్కు ఏర్పడుతుందని భావించి ప్రధాని కాన్వాయ్‌ను తిరిగి భటిండాకు మరలించాలని నిర్ణయించామన్నారు.
ఆ ముగ్గురూ ఎందుకు లేరు!
దేశ ప్రధాని ఒక రాష్ట్ర రాజధానికి వస్తే గవర్నర్, సీఎం, ఇతర ఉన్నతాధికారులు తప్పక ఆహ్వానం పలకాలి. అదే రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పర్యటనకు వస్తే ప్రభుత్వం తరఫున సీఎం లేదా ఒక మంత్రితో పాటు ఉన్నతాధికారులు హాజరవుతారు. కలకలం రేపుతున్న ప్రధాని పంజాబ్ పర్యటనలో ఆయనకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మాత్రమే స్వాగతం పలికారు. సీఎం, సీఎస్, డీజీపీ స్వాగతించేందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి స్వాగతం పలికినా, కేంద్ర సర్వీసులకు చెందిన డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఎందుకు రాలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. తన సిబ్బందిలో కొందరికి కరోనా సోకడం వల్ల తాను వెళ్లలేదని సీఎం చన్నీ చెప్పారు.
ఐదు ప్రశ్నలు
1. ప్రధాని ప్రయాణించే మార్గాన్ని క్లియర్ చేయడంలో పంజాబ్ పోలీసులు ఎందుకు విఫలమయ్యారు?
2. నిరసనకారులకు ప్రధాని మోదీ రోడ్డు మార్గాన వెళుతున్నట్లు, ఫలానా రోడ్డులోనే వెళుతున్నట్లు ఎలా తెలుసు?
ఎవరు ఉప్పందించారు?
3. ప్రధాని భద్రతా సిబ్బందికి రైతులు రోడ్డును దిగ్భందించారని తెలుసా?
4. ప్రధాని ప్రయాణిస్తున్న మార్గాన్ని మార్చినట్లు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్‌పీజీ– మోదీ భద్రత చూస్తుంది) పంజాబ్ పోలీసులకు తెలిపిందా?
5. జరగబోయేదేమిటో పంజాబ్ అధికార యంత్రాంగానికి ముందే తెలుసా?
ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నా..
మీ సీఎంకు థ్యాంక్స్!
మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పండి. కనీసం నేను భటిండా విమానాశ్రయం వరకు ప్రాణాలతో వచ్చాను కదా!’’ అని ప్రధాని మోదీ పంజాబ్ అధికారులతో వ్యాఖ్యానించారు. హుసేనీవాలా అమరవీరుల స్మారకం వద్దకు బయలుదేరిన ప్రధాని, భద్రతా వైఫల్యం కారణంగా వెనుదిరిగి భటిండాకు చేరుకున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే ఆయన తనను కనీసం ప్రాణాలతో ఉంచారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రధాని వ్యాఖ్యల విషయం తనకు తెలియదని పంజాబ్ సీఎం చన్నీ చెప్పారు. ఒకవేళ ప్రధాని కోపంతోనో, రాజకీయ ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్య లు చేసి ఉంటే తానేమీ వ్యాఖ్యానించబోనన్నారు.
సీఎం కనీసం అందుబాటులో లేరు!
ఒకపక్క మార్గం క్లియర్‌గా ఉందని ప్రధాని భద్రతా దళాని (ఎస్‌పీజీ)కి పంజాబ్ డీజీపీ, సీఎస్ హామీ ఇచ్చారు, మరోపక్క అదే మార్గంలో నిరసనకారులకు అనుమతినిచ్చారు. పరిస్థితిని ఇంకా త్రీవం చేసేందుకు సీఎం చన్నీ కనీసం ఫోనులో అందుబాటులోకి రాలేదు, ఈ సమస్యను పరిష్కరించే యత్నాలు చేపట్టలేదు. ప్రజాస్వామ్య సూత్రాలను నమ్మే ఎవరికైనా పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు బాధను కలిగిస్తాయి. మోదీ ర్యాలీకి హాజరుకాకుండా ప్రజలను అడ్డుకోవాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు.
నిరసనకారులతో కలిసి భారీగా బస్సులను ఆపేశారు. ఇలాంటి చర్యలతో భగత్ సింగ్ తదితర దేశభక్తులకు ప్రధాని నివాళి అర్పించకుండా అడ్డుకున్నారు. వీరికి స్వాతంత్య్ర సమరయోధులపై ఎలాంటి గౌరవం లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీ ఇలాంటి పనులు చేస్తోంది. పంజాబ్‌లో ప్రధాని ఆరంభించాల్సిన వేలాది కోట్ల రూపాయల అభివృద్ది పనులు వీరివల్ల ఆగిపోయాయి. కానీ మేము వీరిలాగా చౌకబారుతనంతో వ్యవహరించము. ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధికే పాటుపడతాం.’’
– బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
వివరాలు ఎవరు లీక్ చేశారు?
ప్రధాని మార్గాన్ని అడ్డుకున్న వ్యక్తులకు పంజాబ్ ప్రభుత్వంలో ఎవరు సమాచారమందించారు? ప్రధాని పర్యటనకు తప్పుడు క్లియరెన్స్ ఎందుకిచ్చారు? రక్షణ వైఫల్యం జరిగిందన్న సమాచారం తర్వాత ఎందుకు ఎవరూ స్పందించలేదు? ప్రధాని మృత్యు అంచుకు వెళ్లడం కాంగ్రెస్ నేతలకు ఆనందానిస్తోందా? దేశ ప్రధానిని ప్రమాదకరమైన మార్గంలో తీసుకువచ్చేలా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యత్నించడం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. పంజాబ్ పుణ్యభూమిపై హత్యాకాండ జరపాలని యత్నించి కాంగ్రెస్ విఫలమైంది. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే.
– స్మృతీ ఇరానీ, కేంద్ర మంత్రి
జరిగిన దానికి చింతిస్తున్నాం!
మార్గమధ్యంలో అడ్డంకుల వల్ల ప్రధాని వెనుతిరగడంపై విచారిస్తున్నాం. ఆయన దేశానికి ప్రధాని, మేమంతా గౌరవిస్తాం. భద్రతా లోపం ఉందని చెప్పడం సరికాదు. భటిండా నుంచి పీఎం రోడ్డు మార్గంలో వెళ్తారన్న ప్రణాళికేమీ లేదు. కొందరు నిరసనకారులు రోడ్డుపైకి రాగా ప్రధాని కాన్వాయ్‌ని మరో మార్గం ద్వారా లేదా హెలికాప్టర్ ద్వారా వెళ్లమని సూచించాం. కానీ ఆయన వెనుదిరిగారు. ఇది బాధాకరం. గతరాత్రి రోడ్డుపైకి వచ్చిన ఆందోళనకారులను తొలగించాం. అయినాకానీ అనుకోకుండా కొందరు నిరసనకారులు రోడ్డుపైకి రావడమనేది హానికరమేమీ కాదు. రైతుల ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళనలు చేశారు కానీ ఎవరికీ హాని చేయలేదు.
అలాంటి వారిపై లాఠీలు ఝళిపించమని చెప్పలేను. ఫిరోజ్‌పూర్‌లో బీజేపీ ర్యాలీ కోసం 70 వేల కుర్చీలు ఏర్పాటు చేస్తే 700 మంది వచ్చారు. దీనికి నేనేమీ చేయలేను. హోంశాఖ కోరినట్లు మొత్తం çఘటనపై విచారణ చేస్తాం. రోడ్డు మార్గంలో వెళ్లాలనేది పోలీసు, ఎస్‌పీజీ ఇతర ఏజెన్సీల ఉమ్మడి నిర్ణయం. ఈ నిర్ణయాల్లో పోలీసుల పాత్ర చాలా పరిమితం. ఎస్‌పీజీ, ఐబీ తదితర కేంద్ర ఏజెన్సీలు వీటిని నిర్వహిస్తాయి. ఈ మొత్తం ఘటనను అనవసరంగా రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే అతిధిపై దాడి చేయడం కన్నా చావడానికే ఒక పంజాబీ ప్రాధాన్యమిస్తాడు.
– చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ సీఎం
Comments
Please login to add a commentAdd a comment