పూర్తిస్థాయిలో విధుల నిర్వహణకు సన్నద్ధమవుతున్న ఏపీ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం భద్రత ఏర్పాట్లపై పోలీసు శాఖ దృష్టి సారించింది. దసరా నుంచి సీఎం చంద్రబాబుతోసహా మంత్రులందరూ తాత్కాలిక సచివాలయం నుంచే విధులు చేపడతామని చెప్పడంతో పోలీసు శాఖ కార్యాచరణకు ఉపక్రమించింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం భద్రత బాధ్యతలను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)కు అప్పగించారు. తాత్కాలిక సచివాలయాన్ని ఎస్పీఎఫ్ శుక్రవారం తమ ఆధీనంలోకి తీసుకుంది.
ఇకనుంచి తాత్కాలిక సచివాలయ భద్రతతోపాటు ఉద్యోగులు, సందర్శకుల రాకపోకలన్నీ ఎస్పీఎఫ్ పర్యవేక్షిస్తుంది. తాత్కాలిక సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో ఎస్పీఎఫ్‌కు ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించారు. అదనపు డీజీపీ అంజనాసిన్హా ఈ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం డీఐజీ ఏసురత్నం, ఇతర అధికారులతో సమావేశమై తాత్కాలిక సచివాలయ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. సచివాలయానికి మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దసరా నుంచి డీఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రతను కల్పిస్తారు. ఎంతమంది అధికారులు, సిబ్బందిని కేటాయించాలన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికి ఒక సీఐ, ముగ్గురు ఎస్.ఐ.లు, ఒక అసిస్టెంట్ కమాండెంట్‌తోపాటు దాదాపు 100 మంది కానిస్టేబుళ్లను కేటాయించారు. సచివాలయంలోకి ప్రవేశించే అన్ని మార్గాలు, ఆరుబ్లాకుల వద్ద భద్రత సిబ్బందిని నియోగించారు.
ఉద్యోగులు కూడా ఐడీ కార్డులు చూపించే సచివాలయంలోకి ప్రవేశించాలి. అనుమతి పాస్‌లు ఉన్న సందర్శకులనే లోపలికి అనుమతిస్తారు. సందర్శకుల వివరాలు పరిశీలించి అనుమతి పాస్‌లు మంజూరుచేసేందుకు ప్రధాన ద్వారం సమీపంలో ఓ కౌంటర్ ఏర్పాటు చేస్తారు. అదనపు డీజీ అంజనాసిన్హా విలేకరులతో మాట్లాడుతూ తాత్కాలిక సచివాలయం భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 24/7 కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని, ఐడీ కార్డులు, పాస్‌లు లేనిదే ఎవరినీ సచివాలయంలోకి అనుమతించబోమని చెప్పారు.