Ilambarithi
-
సార్‌ను కలవాలంటే సవాలే!
సాక్షి, హైదరాబాద్: అది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం. కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లాలనుకుంటున్నవారికి కార్యాలయ ద్వారం ఎదుటే ఉన్న పోలీసులు అడ్డుకుంటారు. మీకు ఏం పని? అని అడుగుతారు. కమిషనర్ సార్‌ను కలవాలి. సర్కిల్, జోన్లో పరిష్కారం కానందున ఇక్కడికి వచ్చాం అంటే.. మీ సమస్య ఏమిటో అక్కడ చెప్పండి.. అంటూ దగ్గర్లోనే ఉన్న కంప్యూటర్ ఆపరేటర్‌ను చూపుతారు. అక్కడ తమ సమస్య చెప్పడానికి క్యూకట్టి చెబితే, నమోదు చేసుకొని ఇక వెళ్లమన్నట్లు సూచిస్తారు. సార్ అనుమతిస్తే కార్యాలయ సిబ్బంది మీకు ఫోన్ చేస్తారు. అప్పుడు వచ్చి కలవండి అని చెప్పి పంపిస్తారు. .. ఇదీ రెగ్యులర్ కమిషనర్‌గా ప్రభుత్వం బాధ్యతలప్పగించాక, ఝార్ఖండ్ ఎన్నికల విధుల నుంచి తిరిగి వచ్చాక జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలవాలంటే సందర్శకులకు ఎదురవుతున్న అనుభవం. ఝార్ఖండ్ నుంచే వర్చువల్‌గా ఆదేశాలు జారీ చేస్తూ చురుగ్గా పనులు చేసిన కమిషనర్ శైలిని చూసిన నగర ప్రజలు అప్పుడు అహో అనుకున్నారు. ఇప్పుడు సార్‌ను కలవాలనుకుంటున్న ఫిర్యాదుదారులు అయ్యో ఇదేంటి? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎస్పీఎఫ్తో భద్రత.. బహుశా జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కమిషనర్ పేషీలో విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్ఐ, మహిళా పోలీసులు కూడా వీరిలో ఉన్నారు. కమిషనర్‌ను కలిసేందుకు వస్తున్నవారిలో కొందరు అక్కడున్న పోలీసులను చూసి వెనకడుగు వేస్తున్నారు. వెళ్లేందుకు ముందుకొచ్చేవారిని ఏం పని కోసం వచ్చారో తెలుసుకొని కమిషనర్ పేషీలోని అధికారుల వద్దకు పంపిస్తున్నారు. వారు విషయాన్ని బట్టి అపాయింట్మెంట్ కోసం వివరాల నమోదుకు కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు పంపిస్తున్నారు. అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే విషయాన్ని బట్టి ఒక రోజు నుంచి వారం వరకు పట్టవచ్చు. లేదా అసలు రాకపోవచ్చని చెబుతున్నారని కమిషనర్‌ను కలిసేందుకు వచ్చిన వారిలో శ్రీనివాస్ అనే అతను చెప్పాడు. తాను అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎల్బీనగర్ నుంచి వచ్చానని తెలిపాడు. మరో వ్యక్తి తాను కొన్ని రోజుల క్రితం వచ్చి వివరాలు ఇచ్చి వెళ్లానని, ఇంకా కాల్ రాకపోవడంతో కనుక్కునేందుకు వచి్చనట్లు చెప్పాడు. మంత్రులు ప్రజలను కలుస్తున్నా.. ఓవైపు తాము అధికారంలోకి వచ్చాక ప్రజలు సీఎం దాకా ఎవరినైనా కలిసే అవకాశం లభించిందని, ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు.. మంత్రులు సైతం గాందీభవన్ వేదికగానూ ప్రజా సమస్యలు స్వీకరిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ఎన్ని ఇబ్బందులెదురైనా ఆపబోమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం పేర్కొన్నారు. కోటిమంది సమస్యలు తీర్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం ప్రజలు తనను కలిసేందుకు సుముఖంగా లేరు. సార్ బిజీగా ఇతర పనుల్లో ఉన్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. దీన్ని చూసి ప్రజాపాలన అంటే ఇదేనా? అని విస్తుపోతున్న వారూ ఉన్నారు. గతంలో బల్దియా కమిషనర్లుగా పనిచేసిన వారెవరూ ఇలా వ్యవహరించలేదు. మరి ప్రజాపాలన అంటున్న ప్రభుత్వంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఇలంబర్తికి స్ఫూర్తి ఎవరో ఆయనకే తెలియాలి. రాజకీయ అండ? జీహెచ్ఎంసీకి రాకముందు ఇలంబర్తి రవాణా శాఖలో పని చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ మంత్రిగా ఆయనే సమీక్షలు చేస్తున్నారు. కమిషనర్‌కు మంత్రి అండదండలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ప్రజలను కలవని వ్యవహార శైలితో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన అలా.. ఈయన ఇలా ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిశోర్.. తాను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పని చేసిన కాలంలో తనను కలిసేందుకు వస్తున్న వారందరికీ కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేకపోవడం గుర్తించి.. వృద్ధులు తదితరులు ఎక్కువసేపు నిలబడి ఉండటం చూడలేక సందర్శకుందరికీ కూర్చునే సదుపాయం ఉండేలా ప్రత్యేక గది, కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఇలంబర్తి మాత్రం సందర్శకులనే పేషీలోకి రానీయడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
GHMC commissioner: వర్క్ ఫ్రమ్ ఝార్ఖండ్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఇలంబర్తి దాదాపు గత పది రోజులుగా నగరంలో లేరు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్ రాష్ట్రంలో ఆయనను ఎన్నికల పరిశీలకుడిగా నియమించడంతో అక్కడే ఉన్నారు. అయినా.. ఆయన అక్కడి నుంచే ప్రతిరోజూ జీహెచ్ఎంసీ కార్యక్రమాలు చక్కపెడుతున్నారు. ప్రతిరోజూ అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌లు, సందర్భాన్ని బట్టి వెబినార్లు నిర్వహిస్తున్నారు. కుటుంబ సర్వేపైనా ఆరా.. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి కూడా ఇలంబర్తి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, కంటోన్మెంట్ అధికారులతోనూ చర్చిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు తగిన సూచనలు ఇస్తున్నారు. ఇంటింటికి స్టిక్కరింగ్ కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటూ, పని త్వరితగతిన జరిగేందుకు అధికారులను పురమాయిస్తున్నారు. ఇన్చార్జ్ ఆఫీసర్లు ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌లోని 30 సర్కిళ్లు, కంటోన్మెంట్ బోర్డు ప్రాంతానికి వెరసి.. 12 మంది ఉన్నతాధికారులను ప్రత్యేకంగా ఇన్చార్జులుగా నియమించారు. అడిషనల్ కమిషనర్లు ఎస్.సరోజ, ఎన్. యాదగిరిరావు, ఎస్.పంకజ, ఎన్. సామ్రాట్ అశోక్, గీతారాధిక, కె.సత్యనారాయణ, చంద్రకాంత్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సీఎన్.రఘుప్రసాద్, నళినీ పద్మావతి, ఎస్టేట్ ఆఫీసర్ వై.శ్రీనివాస్‌రెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్‌చంద్రలకు ఆయా సర్కిళ్ల బాధ్యతలు అప్పగించారు. ఫైళ్ల క్లియరెన్స్ సైతం.. జీహెచ్ఎంసీకి సంబంధించి రోజూ పత్రికల్లో వస్తున్న వార్తలపైనా ఇలంబర్తి స్పందిస్తున్నారు. ముఖ్యంగా, ప్రతికూల వార్తలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ పనుల గురించి తెలుసుకుంటున్నారు. బిల్లుల చెల్లింపులపైనా ఆదేశిస్తున్నారు. జీహెచ్ఎంసీ వాహనాల పెట్రోల్, డీజిల్‌ల చెల్లింపులకు సంబంధించిన ఫైళ్ల పరిశీలన సందర్భంగా ప్రైవేటు బంకుల నుంచి కొనాల్సిన అవసరమేముందంటూ ప్రశ్నించినట్లు సమాచారం. డ్యూయల్ రోల్.. సాధారణంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సెలవుపై వెళ్లినా, ఇతరత్రా సందర్భాల్లోనూ విధుల్లో లేకుంటే మరో ఉన్నతాధికారిని జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. ఇలంబర్తి అదనపు బాధ్యతలతోనే కమిషనర్‌గా ఉన్నందున, వేరెవరినీ ఇన్చార్జిగా నియమించలేదని సమాచారం. -
కలెక్టరేట్లో పెండింగ్ ఫైళ్లు ఉంచొద్దు:కలెక్టర్
ఖమ్మం జెడ్పీసెంటర్: కలెక్టరేట్లో పెండింగ్ ఫైళ్లు ఉంచొద్దని అధికారులను కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఆదేశించారు. ఆయన శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు ఆయువుపట్టరుున కలెక్టరేట్లోనే ఫైల్స్ ఆగితే పాలన కుంటుపడుతుందన్నారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రతి ఫైలును వెంటనే క్లియర్ చేయూలన్నారు. సమస్యాత్మక ఫైల్స్‌కు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలన్నారు. వారంలో రెండు సార్లు సమావేశం నిర్వహిస్తానని, పెండింగ్ ఫైల్ కనిపించవద్దని అన్నారు. ఏజెన్సీ కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలన కోసం ఐటీడీఏకి పంపాలన్నారు. ఏ ఫైల్ ఎక్కడుంది... ఎక్కడాగింది అనే విషయం తెలుసుకునేందుకు స్పెషల్ సాఫ్ట్వేర్ రూపొందించి వెంటనే అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్లు మస్తాన్‌రావు, చంద్రశేఖర్, మదన్‌గోపాల్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘పుష్కర’ రహదారులకు రూ.110 కోట్లు..
వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఖమ్మం జెడ్పీసెంటర్: గోదావరి పురష్కరాల నేపథ్యంలో భద్రాచలం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి కోరారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై కలెక్టర్లతో రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ బి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 14న ప్రారంభం కానున్న పుష్కరాలకు భద్రాచలానికి కోటి మందికిపైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ప్రతి ఏడాది భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందని, అక్కడికి చేరుకునే వంతెన ఇవతల వైపు రద్దీని అదుపు చేసేందుకు బూర్గంపాడు-ఏటూరునాగారం మార్గాన్ని నాలుగు వరుసలుగా వెడల్పు చేయాల్సి ఉందని అన్నారు. అదనంగా స్నానపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. గత పుష్కరాలోల ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాకపోకలకు వేర్వురుగా రహదారుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు రూ.110 కోట్లలో రూ. 65 కోట్లు ఆర్అండ్బీ, రూ.45 కోట్లు పంచాయతీరాజ్ రహదారులకు ఖర్చు అవుతాయన్నారు. భద్రాచలం పినపాక నియోజకవర్గాల పరిధిలో 14 స్నానపు ఘట్టాలు నిర్మాణానికి రూ.34 కోట్లు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పుష్కరాల పనుల పర్యవేక్షణకు ఒక ప్రత్యేకాధికారిని నియిమించాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఎస్పీ షానవాజ్ ఖాసిం, ఆర్అండ్బీ ఎస్ఈ సతీష్, దేవాదాయ ఏసీ రాజేంధర్ తదితరులు పాల్గొన్నారు. -
పవర్ ప్లాంట్ భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం
భద్రాచలం: మణుగూరు పవర్ ప్లాంట్ భూనిర్వాసితులకు నష్టం జరగకుండా ప్రభుత్వ నిబంధల ప్రకారం న్యాయం చేస్తామని కలెక్టర్ ఇలంబరితి అన్నారు. భూనిర్వాసిత రైతులతో ఆయన మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో సమావేశమయ్యూరు. నష్ట పరిహారం పెంచాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలని, నగదు పరిహారం కాకుండా భూమి ఇవ్వాలని కలెక్టర్‌కు భూనిర్వాసితులు విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత, కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారంగా భూనిర్వాసితులకు ఐదులక్షల రూపాయలుగానీ, ఇంటిలో ఒకరికి ఉద్యోగంగానీ, నెలకు రెండువేల రూపాయల పెన్షన్‌గానీ చెల్లించగలమని అన్నారు. ఉద్యోగావకాశాలలో ముందుగా గిరిజనులకు ప్రాధాన్యమిస్తామన్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూములకు సంబంధించిన సర్వేను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో దివ్య, భద్రాచలం ఆర్డీవో అంజయ్య, డీడీ సరస్వతి, ఎస్డీసీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక రైతులకే నష్ట పరిహారం:జేసీ పాల్వంచ రూరల్: గ్రామంలో నివాసముంటూ, భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు మాత్రమే నష్ట పరిహారం ఇస్తామని జాయింట్ కలెక్టర్(జేసీ), ఆర్ అండ్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ సురేంద్రమోహన్ స్పష్టం చేశారు. మణుగూర్ మండలంలోని తెలంగాణ జెన్కో పవర్ ప్లాంట్ భూనిర్వాసితుల ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించారు. రామానుంజపురం, చిక్కుడుగుంట, సాంబాయిగూడెం, దమ్మక్కపేట గ్రామాలకు చెందిన 110మంది రైతుల కుటుంబాలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జారుుంట్ కలెక్టర్ మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన అర్హతగల అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మధ్య దళారుల మాటలు నమ్మవద్దని కోరారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారికి ప్యాకేజీ వర్తించదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె.వెంకటేశ్వర్లు, మణుగూరు తహశీల్దారు, ఐటీఐ ప్రిన్సిపాల్ సందీప్, టి-జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురే ష్ తదితరులు పాల్గొన్నారు. -
డీపీసీకి నోటిఫికేషన్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా ప్రణాళిక కమిటి (డీపీసీ)సభ్యుల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా కూడా ప్రకటించారు. కమిటీలో మొత్తం 30 మంది సభ్యులకు గాను నలుగురిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగతా 26 మందిలో జడ్పీటీసీలు, మేయర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఉండాలి. డీపీసీ సభ్యులను 20 శాతం నగర, పట్టణాల నుంచి, 80 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఐదుగురు సభ్యులను మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల నుంచి, మిగిలిన 19 మందిని గ్రామీణ ప్రాంతాల నుంచి (జడ్పీటీసీలను) ఎన్నుకుంటారు. అయితే ఖమ్మం నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఇక్కడ మేయర్లు లే నందున అన్ని మున్సిపాలిటీల కౌన్సిలర్లను కూడా సభ్యులుగా తీసుకోవటం లేదని, నగరపాలక సంస్థల ఎన్నికల అనంతరం ఐదుగురు సభ్యులను ఎన్నుకుంటామని పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు (మెమో నంబర్ 4893) జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 39 మంది జడ్పీటీసీలకు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. చైర్‌పర్సన్‌కు డీపీసీ పగ్గాలు.. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత డీపీసీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీంతో ఆమె డీపీసీ పగ్గాలు అందుకోనున్నారు. కమిటీలో కలెక్టర్ మెంబర్, సెక్రటరిగా వ్యవహరిస్తారు. నలుగురు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరిలో ఒకరు మైనార్టీ, మరో ముగ్గురు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మిగతా 24 మందిని స్థానిక సంస్థల ప్రతినిధులలో 19 మందిని మాత్రమే ప్రస్తుతం ఎన్నుకుంటారు. ఈ కమిటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్పర్సన్, మేయర్లు శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. నోటిఫికేషన్ ఇలా.. జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యుల ఎన్నికకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఇలంబరితి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో పాటు 19 మంది జడ్పీటీసీలతో ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించారు. 8 నుంచి 10 వరకు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు 11 ఓటర్ల తుదిజాబితా విడుదల 12న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు జడ్పీలో నామినేషన్ల స్వీకరణ 15న నామినేషన్ల పరిశీలన 16న ఉపసంహరణ ప్రక్రియ (సాయంత్రం 3గంటల లోపు) 17న పోలింగ్ (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు జిల్లాపరిషత్‌లో)అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు.. ఫలితాలు విడుదల. ముసాయిదా ఓటరు జాబితా విడుదల.. గడిపల్లి కవిత -జడ్పీచైర్‌పర్సన్(వెంకటాపురం జడ్పీటీసీ), బనావత్ కొండా (బోనకల్), కూరపాటి తిరీష(చింతకాని), జర్పుల లీలావతి (కల్లూరు), దరావత్ భారతి (ఖమ్మంరూరల్), తేజావత్ సోమ్లా (కొణిజర్ల), వడ్త్యా రాంచంద్రు(కూసుమంచి), మూడు ప్రియాంక(మధిర), మందడపు నాగేశ్వరరావు(ముదిగొండ), తేజావత్ అనిత (నేలకొండపల్లి), గుగులోత్ భాషా(వేంసూరు), అంకుడోత్ రజిత(పెనుబల్లి), అజ్మీరా వీరూ(రఘునాథపాలెం), అసావత్ లక్ష్మీ(సత్తుపల్లి), మూకర ప్రసాద్(తల్లాడ), బాణోత్ విజయ(తిరుమలాయపాలెం), బొర్రా ఉమాదేవి(వైరా), అంకసాల శ్రీనివాసరావు(ఎర్రుపాలెం), గౌని ఐలయ్య(బయ్యారం), అంకిరెడ్డి కృష్ణారెడ్డి(చండ్రుగొండ), కొప్పెల శ్యామల(ఏన్కూరు), ఎద్దు మాధవి(గార్ల), గొగ్గిల లక్ష్మి(గుండాల), శెట్టిపల్లి వెంకటేశ్వరరావు(జూలూరుపాడు), మేకల మల్లిబాబు (కామేపల్లి), ఉన్నం వీరేందర్(సింగరేణి), గిడ్ల పరంజోతిరావు(కొత్తగూడెం), లక్కినేని సురేందర్‌రావు(టేకులపల్లి), చండ్ర అరుణ(ఇల్లందు), తోకల లత(అశ్వాపురం), అంకిత మల్లిఖార్జున్‌రావు(అశ్వారావుపేట), దొడ్డాకుల సరోజిని (దమ్మపేట), పాల్వంచ దుర్గ(మణుగూరు), బత్తుల అంజి(ములకలపల్లి), బరపటి వాసుదేవరావు(పాల్వంచ), జాడి జానమ్మ(పినపాక), తోటమల్ల హరిత(చర్ల), అన్నె సత్యనారాయణమూర్తి(దుమ్ముగూడెం), సోమిడి ధనలక్ష్మీ(వాజేడు). -
రెండేళ్లలో... వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్
కొత్తగూడెం: అందరూ సహకరిస్తే, మణుగూరు మండలంలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు పూర్తవుతుందని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి అన్నారు. విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోతున్న వారికి (నిర్వాసితులకు) ప్రభుత్వం మంచి ప్యాకేజీ ఇస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టు భూ నిర్వాసితులతో గురువారం స్థానిక సింగరేణి గెస్ట్ హౌజ్‌లో కలెక్టర్ ఇలంబరితి, జారుుంట్ కలెక్టర్ సురేంద్రమోహన్ సమావేశం నిర్వహించారు. అనంతరం, విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... ఈ పవర్ ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1,039 ఎకరాల భూమి అవసరమవుతుందని, అందులో ఎక్కువగా ప్రభుత్వ భూమి ఉందని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. భూసేకరణపై ఇప్పటికే సర్వే పూర్తయిందన్నారు. ప్రస్తుతం 640 కుటుంబాలు సాగు భూములు కోల్పోతున్నట్టుగా గుర్తించామన్నారు. వీరికి ఉద్యోగంగానీ, పరిహారంగా ఐదులక్షల రూపాయలుగానీ, 25 ఏళ్ల వరకు నెలకు రెండువేల చొప్పున పెన్షన్‌గానీ ఏదికోరితే అది ఇచ్చేలా ప్యాకేజీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తమకు ఉద్యోగమే కావాలని ఇప్పటివరకు 158 మంది చెప్పినట్టు తెలిపారు. 200 మందికన్నా ఎక్కువమంది ఉద్యోగమే కావాలని కోరితే ఎలా ఇవ్వాలన్న విషయమై కేటీపీఎస్ అధికారులతో చర్చిస్తామన్నారు. సర్వేలో ఏమైనా సందేహాలున్నట్టుగా ఫిర్యాదు చేస్తే మరోమారు నిర్వహించేందుకు సిద్ధమేనన్నారు. త్వరలో నిర్వాసితులందరితో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తరుుతే పరిసర ప్రాంతాల్లోని వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. పేరంటాల చెరువును మినహాయించాలి పవర్ ప్రాజెక్టు భూసేకరణ నుంచి పేరంటాల చెరువును, దాని పరిధిలోని సాగు భూమిని మినహారుుంచాలని మాజీ ఎమ్మెల్యేలు చందా లింగయ్య దొర, రేగా కాంతారావు, సొసైటీ అధ్యక్షుడు ఎం.పుల్లారెడ్డి తదితరులు కలెక్టర్ ఇలంబరితిని కోరారు. నిర్వాసితుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. పేరాంటాల చెరువు కింద 130 ఎకరాల భూమి ఉందని, ప్రతి ఏడాది రెండు పంటలు పుష్కలంగా పండుతాయని వివరించారు. ఈ భూమిని కోల్పోయే రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సేకరించే భూమిలో 140 ఎకరాల పట్టా భూమి ఉందన్నారు. దానికి ఎకరాకు 10లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ఆడ పిల్లలున్న కుటుంబంలో చదువుకున్న ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటన్నింటిపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఆర్డీవోలు డి.అమయ్‌కుమార్ (కొత్తగూడెం), వెంకటేశ్వర్లు (పాల్వంచ), కేటీపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యమ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్
ఖమ్మంసిటీ: జిల్లాలో మొదటి విడతగా సోమవారం మున్సిపాలిటీల్లో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతమైంది. ఉద్యమస్ఫూర్తితో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు భాగస్వాములయ్యూరు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె ఇలంబరితి, ఎస్పీ ఏవీ రంగనాథ్, జడ్పీ చైర్ పర్సన్ గడపల్లి కవిత పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీ కార్పొరేషన్ సహ కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీల్లో పర్యటించి సందర్శించి స్ఫూర్తి నింపారు. ఖమ్మం నగరంలోని సారధి నగర్లో, కలెక్టర్ నివాసం వెనుక ఉన్న గోళ్లపాడు చానల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ, జడ్పీ చైర్ పర్సన్, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. గోళ్లపాడు చానల్లో సమారు కిలోమీటర్ మేర సిల్ట్ తొలగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలంబరితి మాట్లాడుతూ మొదటి విడతగా మున్సిపాలిటీల్లో, రెండో విడతగా పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్లో పారిశుధ్య పనలకు 15 ట్రాక్లర్లను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. మురుగు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గోళ్లపాడు చానల్ ఆక్రమణపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ మనసు స్వచ్ఛంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా మొదటి అదనపు జడ్జి చిరంజీవి రావు మాట్లాడుతూ మన బాధ్యతలను గుర్తెగాలని సూచించారు. జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత మాట్లాడుతూ ఇదో బృహత్తర కార్యక్రమమని, ఇందుకు కేంద్రం రూ. 20 వేల కోట్లు కేటారుుంచిందని చెప్పారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఖమ్మాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి రూ. వెరుు్య కోట్లు కేటారుుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్పొరేషన్లో సిబ్బంది కొరత తీర్చాలన్నారు. కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ వేణు మనోహర్ మాట్లాడుతూ సుమారు 23 జేసీబీ, 191 ట్రాక్టర్లతో పూడిక తీత పనులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఒక్కరోజే 1928 టన్నుల చెత్త తరలించామని, 88 కిలో మీటర్ల మేర డ్రెరుున్లలో సిల్ట్ తొలగించామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, తోట రామారావు, కొత్తగుండ్ల శ్రీలక్ష్మి, డీఎస్పీ బాలకిషన్‌రావు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్వచ్ఛభారత్’ను విజయవంతం చేయాలి
ఖమ్మం సిటీ: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఈనెల 18న నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్లను కలెక్టర్ ఇలంబరితి ఆదేశించారు. జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై మున్సిపాలిటీలు దృష్టిసారించాలన్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమ కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ ఇన్చార్జ్జ్ కమిషనర్ వేణుమనోహర్, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు సంపత్, వెంకటేశ్వర్లు, అంజనకుమార్, రవి, భాస్కర్, శ్రీనివాస్, డీఈలు వెంకటశేషయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
చిత్త‘శుద్ధి’తో పనిచేయాలి
ఖమ్మం జెడ్పీసెంటర్: స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో జేసీ సురేంద్రమోహన్‌తో కలసి స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాన్ని పరిశుభ్రంగా మార్చి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. స్వాతంత్య్రంతో పాటు పరిశుభ్రమైన భారత దేశం కోసం కలలు కన్న గాంధీజీ జయంతి రోజునే ఇది చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. పరిశుభ్రమైన జిల్లాగా తీర్చిదిద్దడమే గాంధీజీకి మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. పరిశుభ్రత ప్రాధాన్యతను తెలిసేలా అందరినీ చైతన్యం చేయాలన్నారు. చెత్తను ఎక్కడ పడితే కాకుండా నిర్ధేశిత ప్రదేశాలలో మాత్రమే వేయాలన్నారు. పని చేసే ప్రదేశాలు సైతం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే దేశం స్వచ్ఛ భారత్‌గా రూపొందుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. తొలుత కలెక్టర్ స్వచ్ఛభారత్ నిర్మాణంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జేసీ, డీపీవో, ఆర్డీవో తదితరులు చీపుర్లు పట్టుకుని కలెక్టరేట్లోని పార్కును శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సంజీవరెడ్డి, డీపీవో రవీంధర్, జేడీఏ భాస్కర్‌రావు, బీసీ సంక్షేమాధికారి వెంకటనర్సయ్య, సెట్‌కం సీఈవో అజయ్‌కుమార్, ఉద్యానవన శాఖ ఏడీ మరియన్న ,ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జగన్మోహన్రెడ్డి, డీసీహెచ్ఎస్ ఆనందవాణి, ఇన్చార్జి కమిషనర్ వేణుమనోహర్, సమాచార శాఖ ఏడీ వెంకటేశ్వరప్రసాద్ పాల్గొన్నారు.