చిత్త‘శుద్ధి’తో పనిచేయాలి | everyone should be partner in swacha bharat | Sakshi
Sakshi News home page

చిత్త‘శుద్ధి’తో పనిచేయాలి

Published Fri, Oct 3 2014 2:38 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

everyone should be partner in swacha bharat

ఖమ్మం జెడ్పీసెంటర్: స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని  కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో జేసీ సురేంద్రమోహన్‌తో కలసి స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని కలెక్టర్‌ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాన్ని పరిశుభ్రంగా మార్చి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

స్వాతంత్య్రంతో పాటు పరిశుభ్రమైన భారత దేశం కోసం కలలు కన్న గాంధీజీ జయంతి రోజునే ఇది చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. పరిశుభ్రమైన జిల్లాగా తీర్చిదిద్దడమే గాంధీజీకి మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు.  పరిశుభ్రత ప్రాధాన్యతను తెలిసేలా అందరినీ చైతన్యం చేయాలన్నారు. చెత్తను ఎక్కడ పడితే కాకుండా నిర్ధేశిత ప్రదేశాలలో మాత్రమే వేయాలన్నారు. పని చేసే ప్రదేశాలు సైతం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే దేశం స్వచ్ఛ భారత్‌గా రూపొందుతుందన్నారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. తొలుత  కలెక్టర్ స్వచ్ఛభారత్ నిర్మాణంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా  కలెక్టర్, జేసీ, డీపీవో, ఆర్డీవో తదితరులు చీపుర్లు పట్టుకుని కలెక్టరేట్‌లోని పార్కును శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సంజీవరెడ్డి, డీపీవో రవీంధర్, జేడీఏ భాస్కర్‌రావు, బీసీ సంక్షేమాధికారి వెంకటనర్సయ్య, సెట్‌కం సీఈవో అజయ్‌కుమార్, ఉద్యానవన శాఖ ఏడీ మరియన్న ,ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ జగన్‌మోహన్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్ ఆనందవాణి, ఇన్‌చార్జి కమిషనర్ వేణుమనోహర్, సమాచార శాఖ ఏడీ వెంకటేశ్వరప్రసాద్  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement