సాక్షి, ఖమ్మం : గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్మల్ భారత్ అభియాన్(ఎన్‌బీఏ) నిర్లక్ష్యానికి గురవుతోంది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఉద్దేశించిన ఈ పథకానికి జిల్లాలో గ్రహణం పట్టింది. జిల్లాకు రెండేళ్ల క్రితం 1.77 లక్షల మరుగుదొడ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు 25,959 మాత్రమే నిర్మాణమయ్యాయి.
నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు పలు గ్రామాల్లో ఇప్పటి వరకూ బిల్లు మంజూరు కాలేదు. పల్లెల్లో పారిశుధ్యాన్ని పట్టాలెక్కించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిర్మల్ భారత్ అభియాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి ఇంటికీ మరగుదొడ్డిని నిర్మించి పల్లె ప్రజలకు పారిశధ్యంపై అవగాహన కల్పించాలన్నది ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇందులో స్వల్పంగా లబ్ధిదారుడి వాటాతోపాటు ఎన్‌బీఏ, ఉపాధి హామీ పథకం కింద ఆర్థిక సహకారంతో మరుగుదొడ్లు నిర్మాణం చేపడతారు. అయితే.. జిల్లా వ్యాప్తంగా 1,77 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసినా మరుగుదొడ్ల నిర్మాణం మాత్రం ముందుకు కదలడం లేదు.
మంజూరైన మరుగుదొడ్లకు సంబంధించి రూ.161.62 కోట్లు మంజూరయ్యాయి. ఈ రెండున్నరేళ్లలో ఈ పథకం కింద ఇప్పటి వరకు 25,959 మరుగుదొడ్లను మాత్రమే నిర్మించారు. నిర్మాణం పూర్తిచేసుకున్న, పురోగతిలో ఉన్న మరుగుదొడ్లకు రూ.33.44 కోట్లు ఖర్చు చేశారు. ప్రధానంగా జిల్లాలో ఏజెన్సీ మండలాలు ఎక్కువగా ఉండడంతో కేంద్రం ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలోనే ఎక్కువ మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. వీటిలో నిర్మాణం పూర్తయిన వాటితో పాటు ఇంకా 25 వేల మరుగుదొడ్లు పురోగతిలో ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ పథకం అమలు అధ్వానంగా ఉందని గతంలో ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టినా జిల్లా స్థాయి అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. నిధులు పుష్కలంగా ఉన్నా నిర్మాణాలు లేకపోవడంతో రెండేళ్లయినా లక్ష్యం పూర్తి కాలేదు. అంతేకాకుండా పలు మండలాల్లో ఈ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించకున్నా బిల్లులు పొందారనే ఆరోపణలున్నాయి. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ సాగకపోవడంతో అసలు ఎన్ని మరుగుదొడ్లను నిర్మించకుండా బిల్లులు ఎత్తారన్నది అధికారులకే తెలియడం లేదు.
నిర్మించినా అందని బిల్లు..
లబ్ధిదారులుగా ఎంపికైన వారు ముందు బిల్లు రాకున్నా ఎలాగో అప్పు చేసి మరుగుదొడ్డిని నిర్మించుకున్నారు. అయితే ప్రభుత్వం బిల్లు ఎప్పుడు మంజూరు చేస్తుందోనని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారు ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండేళ్ల బిల్లులు రాకపోవడంతో ఇక ఆశలు వదులుకున్నారు. ఈ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రధానంగా పల్లెల్లో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి.
పారిశుధ్యం మెరుగుపర్చడానికి తీసుకుంటున్న చర్యలు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే లబ్ధిదారులు వీటి నిర్మాణానికి ఆసక్తి చూపేవారు. కానీ.. ఇప్పటి వరకు ఆ దిశగా ప్రచారం చేయలేదు. అధికారులు ప్రత్యేకంగా గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ పెడితేనే లబ్ధిదారులు మరుగుదొడ్డి నిర్మాణానికి ముందుకొచ్చే అవకాశం ఉంది.
చేయూత సరిపోవడం లేదని..
ఈ పథకం యూనిట్ విలువ మొత్తం రూ.10,900. మరుగుదొడ్డి నిర్మాణానికి లబ్ధిదారుడి వాటా రూ.900 కాగా, ఎన్‌బీఏ ద్వారా రూ.4,600, ఉపాధి హామీతో 5,400 చెల్లిస్తారు. అయితే ఈ సహాయం మరుగుదొడ్డి నిర్మాణానికి ఏమాత్రం సరిపోవడం లేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ వ్యయం పెరిగిన నేపథ్యంలో ఒక్కో యూనిట్‌కు రూ.20 వేలు చెల్తిస్తేనే నిర్మాణం పూర్తవుతుందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 25 వేల మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయని అధికారులు పేర్కొంటుండగా వీటిలో చాలా వరకు ఇలా నిర్మాణం వ్యయం సరిపోక మధ్యలోనే పనులు నిలిపివేశారు. ఏజెన్సీలోని అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాల పరిధిలో ఈ పరిస్థితి నెలకొంది. అధికారుల అలసత్వం, ప్రచార లోపం ఈ పథకం అమలుకు అవరోధమైతే.. సరిపడా యూనిట్ విలువ లేకపోవడంతో జిల్లాలో ఈ పథకం లక్ష్యం నెరవేరకపోవడానికి మరో ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఇలాగైతే.. ‘స్వచ్ఛ భారత్’ ఎలా?..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పారిశుధ్య పరిరక్షణకు కంకణం కట్టుకుంటూ దేశ వ్యాప్తంగా దీన్ని ముమ్మరం చేసింది. పారిశుధ్యానికి మెరుగుపర్చడానికి తీసుకునే చర్యలో భాగంగా గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఇలాంటి పథకాలు మాత్రం అటకెక్కుతున్నాయి. ఓవైపు స్వచ్ఛభారత్ అంటున్న అధికారులు పల్లెల్లో పారిశుధ్య పరిరక్ష ణ ధ్యేయంగా అమలు చేస్తున్న పథకాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దీంతో పల్లెల్లో పారిశుధ్యం లోపించి విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇకనైనా అధికారులు పారిశుధ్య పథకాల అమలుపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే గ్రామాలు అభివృద్ధి బాట పడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘అభియాన్’.. అధ్వానం
Published Wed, Nov 19 2014 2:00 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement
Advertisement