Nirmal Bharat Abhiyan
-
అర‘దండాలు’ !
బహిరంగ మల విసర్జనకు వచ్చిన వారికి అధికారుల సన్మానం బాగేపల్లి : నిర్మల్ భారత అభియాన్‌కు అధికారులు కంకణం కట్టుకున్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జన వీడాలంటూ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఉదయం మల విసర్జనకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు పూల దండలు వేసి సన్మానించిన సంఘటన బుధవారం జరిగింది. గుడిబండ పట్టణ పంచాయతీ అధికారి ప్రదీప్ కుమార్ సహా పలువురు సిబ్బంది ఉదయం బహిరంగ ప్రాంతాల్లో కాపుకాచి మల విసర్జనకు వస్తున్న వారిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ... వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనేక సబ్సిడీలు ప్రకటిస్తున్నా ప్రజలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. పట్టణంలోని 1,5,6,10,11 వార్డుల్లోని వారు సామూహిక మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని కోరారు. బహిరంగ మల విసర్జన ఇక సహించమన్నారు. స్వచ్ఛతా అభియాన్ రాయబారి, విశ్రాంత ఉపాధ్యాయుడు ఎన్.నారాయణస్వామి మాట్లాడుతూ... వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, దీనికి ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో లక్ష్మీకాంతమ్మ, రాజణ్ణ, గుడిబండ పట్టణ పంచాయతీ హెల్త్ ఇన్పెక్టర్ శివణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం ‘బహిరంగమే’
ప్రచారానికే పరిమితమైన స్వచ్ఛభారత్ లక్ష్యానికి దూరంగా మరుగుదొడ్ల నిర్మాణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ ప్రచారానికే పరిమితం అవుతోంది. ‘ఇంటింటికీ మరుగుదొడ్డి’ పథకం ఆచరణలో మరుగునపడిపోతోంది. ఇక తెలంగాణ రాష్ర్టం లో బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా ‘నిర్మల్ భారత్ అభియాన్’ కింద చేపట్టిన లక్షలాది మరుగుదొడ్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపణలు విప్పిస్తున్నాయి. -సాక్షి నెట్వర్క్ ఒకవైపు అవగాహన లోపం, మరోవైపు బిల్లుల చెల్లింపులో జాప్యం వెరసి.. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం ముందుకు సాగడం లేదు. దీంతో గ్రామాలతోపాటు, పట్టణాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ అవసరాల కోసం బహిర్భూమికి వెళ్లక తప్పడం లేదు. వాస్తవానికి ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 18వేలు ఖర్చవుతుందని అధికారులే చెబుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.12 వేలు చెల్లిస్తోంది. గతంలో రూ.10వేలు మాత్రమే ఉండగా, ఇటీవలే రూ.2వేలు పెంచారు.లబ్ధిదారులు ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ముకు సరిపోను నిర్మాణం చేసి. మిగిలిన వాటికి డబ్బుల్లేక అసంపూర్తిగా వదిలేస్తున్నారు. మరికొద్దిమంది నిధులు సరిపోవనే సాకుతో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొన్నిచోట్ల మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ అవగాహనాలోపంతో వాటిని సామాన్లు భద్రపరిచే గదులుగా వాడుతున్నారు. మరికొన్ని చోట్ల అయితే మరుగుదొడ్డి వాడకాన్ని పక్కకు పెట్టి బహిర్భూమికి వెళ్లడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ పల్లెల్లో మరుగుదొడ్డి వినియోగించుకోకపోవడానికి నీటి కొరత కూడా కారణమని చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో గత మూడేళ్లలో 2,34,000 మరుగుదొడ్లు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 79,527 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన వాటిలో 27,927 నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోగా, 1.26,546 మరుగుదొడ్ల నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. ఈ పథకంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు రావడంతో గతంలో ఏసీబీ అధికారులు దాడులు కూడా నిర్వహించారు. ఆ తరువాత నిర్మాణాన్ని గ్రామీణ నీటిపారుదల, పారిశుధ్యశాఖకు అప్పగించినా పురోగతి లేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో వరంగల్ అత్యంత అధ్వాన స్థితిలో ఉంది. జిల్లాలో ఏడాది క్రితం మొత్తం 2.50 లక్షలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకు వంద మరుగుదొడ్లు కూడా నిర్మాణానికి నోచుకోకపోవడం దారుణం. ప్రభుత్వం నుంచి కూలీ డబ్బులు మాత్రమే వస్తాయని, సిమెం ట్, ఇటుక వ్యయాన్ని సొంతంగా భరించాలనే ప్రచారంతో ఎవరూ ముందుకురావడం లేదని తెలిసింది. ప్రజల్లో నెలకొన్న ఈ అనుమానాన్ని నివృత్తి చేసి, వారికి అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. నిర్మల్ భారత్ అభియాన్ (ఎన్బీఏ) కింద నిజామాబాద్ జిల్లాలో1,18,522 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 54,182 మాత్రమే పూర్తయ్యాయి. అయితే, మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు వెబ్సైట్లో మాత్రం 1204 ఫొటోలే అప్లోడ్ అయినట్టు కన్పిస్తోంది. జిల్లాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ఇసుక కొరత తీవ్ర ఆటంకంగా మారింది. అ సలే డబ్బులు తక్కువగా చెల్లిస్తుండడంతో ఇసుకను బ్లాక్‌లో కొని మరుగుదొడి నిర్మించుకోవడం లబ్దిదారులకు భారంగా మారుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 1.82 లక్షలు మంజూరు కాగా, 36,844 మరుగుదొడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. 97,454 మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభానికే నోచుకోలేదు. అక్షరాస్యతలో వెనుకంజలో ఉన్న జిల్లాల్లో అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో మెజారిటీ ప్రజలు బహిర్భూమికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాల్లో 2013-14లో 41,925 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా 9701, 2014-15లో 68 వేలకు 7 వేల నిర్మాణాలను మాత్రమే పూర్తి చేశారు. బిల్లుల చెల్లింపులో జాప్యం, నిర్మాణ వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల ఆశించిన స్థాయిలో నిర్మాణాలు పూర్తి కాలేదు. నిర్మాణానికి ముందుకొచ్చిన వారికి నిబంధనల పేరిట అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. మరోవైపు నిర్మాణాలు పూర్తయినప్పటికీ వాడుకలోలేని మరుగుదొడ్లు సగానికిపైగా ఉన్నాయి. వీటిని కేవలం స్టోర్రూంలకే వినియోగిస్తున్నారు. మెదక్ జిల్లాకు 62,663 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా, 11,807 మాత్రమే పూర్తయ్యాయి. వీటిలో 22,616 వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 28,240 మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి నేటికీ పనులు ప్రారంభించలేక పోయారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గంలో 34 శాతమే పూర్తయ్యాయి. ఈ నియోజకవర్గానికి 5,103 మంజూరు కాగా 2,362 వివిధ దశల్లో ఉండగా 1,752 మాత్రమే పూర్తయ్యాయి. రూపాయి కూడా రాలేదు... ‘‘మరుగుదొడ్డి నిర్మించుకొని నాలుగు నెలలు అయితాంది. కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదు. రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ఈజీఎస్ నుంచి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు బిల్లుకోసం పంపినట్లు చెప్పుతుండ్రు. అధికారులు స్పందించి బిల్లు అందేలా చూడాలి’’ - బెక్కటి గంగాధర్, లబ్దిదారుడు, కరీంనగర్ బిల్లు రాక పనులు ఆపేసిన.. ఏడాది కిందట మరుగుదొడ్డి పనులు మొదలుపెట్టినం. పునాది తోడుకున్న తర్వాత రూ.3 వేలు ఇస్తమని చెప్పిండ్రు. ఇంత వరకు ఆ డబ్బులు ఇయ్యలేదు. అష్టకష్టాలు పడి లెంటల్ లెవల్ వరకు మరుగుదొడ్డి పూర్తి చేసినం. డబ్బులు వస్తయనే ఆశతో అప్పు చేసి మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టి ఇప్పుడు తిప్పలు పడుతున్నం. బిల్లు ఇస్తేకానీ మరుగుదొడ్డి పూర్తి చేసుకోలేం. - జంబి మొండక్క, నెన్నెల, ఆదిలాబాద్ జిల్లా అధికారుల మాటల నమ్మి మోసపోయా ప్రభుత్వం మరుగుదొడి నిర్మాణానికి డబ్బులిస్తరని మరుగుదొడ్డి నిర్మాణానికి పూనుకున్న. అక్కడ ఇక్కడ 5 వేల రూపాయలు అప్పు చేసి మరుగుదొడ్డి నిర్మాణ పనులు ప్రారంభించా. కానీ, నేటివరకు ప్రభుత్వం నుంచి పైసా ఇవ్వలేదు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం నుంచి రూ.10 వేలకు పైన అందుతాయని అధికారుల మాటల నమ్మి మోసపోయా. - తంగడపల్లి సాలమ్మ, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా -
లక్ష్యం కను‘మరుగు’
ఏలూరు :జిల్లాలోని నిర్మల్ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో యూనిట్ రూ. 10,500 వ్యయంతో ప్రారంభించిన ఇవి ప్రజలకు అక్కరకు రాకుండాపోయాయి. 2012లో ప్రారంభించిన ఈ పథకంలో మొత్తం 83,361 మరుగుదొడ్ల నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. దీనికోసం రూ. 84 కోట్ల 9 లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు కేవలం రూ. 20 కోట్ల 21 లక్షల 15 వేలు మాత్రమే ఖర్చు చేశారు. కేవలం 18, 820 టాయిలెట్లు మాత్రమే పూర్తయ్యాయి. వివిధ దశల్లో 9,044 టాయిలెట్లు ఉన్నాయి. 69, 541 నిర్మాణాలు ప్రారంభించలేదు. రెండేళ్లలో 21.35 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో ఇవి నత్తనడకన సాగాయి. పర్యవేక్షణ లేకపోవడం, నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వల్ల, మరుగుదొడ్లకు ఏర్పాటు చేయూల్సిన పిట్లు ఒకటా? రెండా? అన్న అంశంపై తర్జనభర్జన సాగడంతో ఈ నిర్మాణాలు మందకొడిగా సాగారుు. దీంతో కనీసం మండలానికి వెయ్యి చొప్పున కూడా నిర్మించలేకపోయూరు. నిర్మాణ దశలో ఉన్న 9,044 మరుగుదొడ్లను ఇప్పటికైనా డ్వామా అధికారులు పూర్తి చేస్తే కొంతమందికైనా ఇక్కట్లు తీరతాయని లబ్ధిదారులంటున్నారు. స్వచ్ఛ భారత్‌కు ప్రారంభోత్సవం ఎప్పుడో జిల్లాలో నిర్మల్ టాయిలెట్ల నిర్మాణాన్ని అక్టోబరు 1వ తేదీ నుంచి నిలిపివేసినట్టు అధికారులు చెబుతున్నారు. అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం పేరు మీదనే మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు గ్రామాల్లో అర్హుల గుర్తింపు జరుగుతోంది. ఈ నెలాఖరు నాటికి ఎంపీడీవోలు లబ్ధిదారుల వివరాలపై నివేదిక సమర్పించాలని కలెక్టరు ఆదేశాలు జారీచేశారు. స్వచ్ఛ భారత్ కింద రాబోయే రోజుల్లో గ్రామీణ నీటిసరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ద్వారా నిర్మించే మరుగుదొడ్లకు రూ. 12 వేలు చొప్పున మంజూరు చేయనున్నారు. అయితే గతంలో మంజూరై, రద్దైన 69 వేల లబ్ధిదారుల పరిస్థితి మళ్లీ మొదటికి రావడం విమర్శలకు తావిస్తోంది. పాత డేటానే తీసుకుని వీరికి టాయిలెట్లు నిర్మించాలన్న ఆలోచన ప్రభుత్వాలకు రాకపోవడం కూడా లబ్ధిదారులను కలవరపరుస్తోంది. -
‘అభియాన్’.. అధ్వానం
సాక్షి, ఖమ్మం : గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్మల్ భారత్ అభియాన్(ఎన్బీఏ) నిర్లక్ష్యానికి గురవుతోంది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఉద్దేశించిన ఈ పథకానికి జిల్లాలో గ్రహణం పట్టింది. జిల్లాకు రెండేళ్ల క్రితం 1.77 లక్షల మరుగుదొడ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు 25,959 మాత్రమే నిర్మాణమయ్యాయి. నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు పలు గ్రామాల్లో ఇప్పటి వరకూ బిల్లు మంజూరు కాలేదు. పల్లెల్లో పారిశుధ్యాన్ని పట్టాలెక్కించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిర్మల్ భారత్ అభియాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి ఇంటికీ మరగుదొడ్డిని నిర్మించి పల్లె ప్రజలకు పారిశధ్యంపై అవగాహన కల్పించాలన్నది ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇందులో స్వల్పంగా లబ్ధిదారుడి వాటాతోపాటు ఎన్బీఏ, ఉపాధి హామీ పథకం కింద ఆర్థిక సహకారంతో మరుగుదొడ్లు నిర్మాణం చేపడతారు. అయితే.. జిల్లా వ్యాప్తంగా 1,77 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసినా మరుగుదొడ్ల నిర్మాణం మాత్రం ముందుకు కదలడం లేదు. మంజూరైన మరుగుదొడ్లకు సంబంధించి రూ.161.62 కోట్లు మంజూరయ్యాయి. ఈ రెండున్నరేళ్లలో ఈ పథకం కింద ఇప్పటి వరకు 25,959 మరుగుదొడ్లను మాత్రమే నిర్మించారు. నిర్మాణం పూర్తిచేసుకున్న, పురోగతిలో ఉన్న మరుగుదొడ్లకు రూ.33.44 కోట్లు ఖర్చు చేశారు. ప్రధానంగా జిల్లాలో ఏజెన్సీ మండలాలు ఎక్కువగా ఉండడంతో కేంద్రం ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలోనే ఎక్కువ మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. వీటిలో నిర్మాణం పూర్తయిన వాటితో పాటు ఇంకా 25 వేల మరుగుదొడ్లు పురోగతిలో ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పథకం అమలు అధ్వానంగా ఉందని గతంలో ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టినా జిల్లా స్థాయి అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. నిధులు పుష్కలంగా ఉన్నా నిర్మాణాలు లేకపోవడంతో రెండేళ్లయినా లక్ష్యం పూర్తి కాలేదు. అంతేకాకుండా పలు మండలాల్లో ఈ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించకున్నా బిల్లులు పొందారనే ఆరోపణలున్నాయి. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ సాగకపోవడంతో అసలు ఎన్ని మరుగుదొడ్లను నిర్మించకుండా బిల్లులు ఎత్తారన్నది అధికారులకే తెలియడం లేదు. నిర్మించినా అందని బిల్లు.. లబ్ధిదారులుగా ఎంపికైన వారు ముందు బిల్లు రాకున్నా ఎలాగో అప్పు చేసి మరుగుదొడ్డిని నిర్మించుకున్నారు. అయితే ప్రభుత్వం బిల్లు ఎప్పుడు మంజూరు చేస్తుందోనని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారు ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండేళ్ల బిల్లులు రాకపోవడంతో ఇక ఆశలు వదులుకున్నారు. ఈ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రధానంగా పల్లెల్లో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి. పారిశుధ్యం మెరుగుపర్చడానికి తీసుకుంటున్న చర్యలు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే లబ్ధిదారులు వీటి నిర్మాణానికి ఆసక్తి చూపేవారు. కానీ.. ఇప్పటి వరకు ఆ దిశగా ప్రచారం చేయలేదు. అధికారులు ప్రత్యేకంగా గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ పెడితేనే లబ్ధిదారులు మరుగుదొడ్డి నిర్మాణానికి ముందుకొచ్చే అవకాశం ఉంది. చేయూత సరిపోవడం లేదని.. ఈ పథకం యూనిట్ విలువ మొత్తం రూ.10,900. మరుగుదొడ్డి నిర్మాణానికి లబ్ధిదారుడి వాటా రూ.900 కాగా, ఎన్బీఏ ద్వారా రూ.4,600, ఉపాధి హామీతో 5,400 చెల్లిస్తారు. అయితే ఈ సహాయం మరుగుదొడ్డి నిర్మాణానికి ఏమాత్రం సరిపోవడం లేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ వ్యయం పెరిగిన నేపథ్యంలో ఒక్కో యూనిట్‌కు రూ.20 వేలు చెల్తిస్తేనే నిర్మాణం పూర్తవుతుందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 25 వేల మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయని అధికారులు పేర్కొంటుండగా వీటిలో చాలా వరకు ఇలా నిర్మాణం వ్యయం సరిపోక మధ్యలోనే పనులు నిలిపివేశారు. ఏజెన్సీలోని అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాల పరిధిలో ఈ పరిస్థితి నెలకొంది. అధికారుల అలసత్వం, ప్రచార లోపం ఈ పథకం అమలుకు అవరోధమైతే.. సరిపడా యూనిట్ విలువ లేకపోవడంతో జిల్లాలో ఈ పథకం లక్ష్యం నెరవేరకపోవడానికి మరో ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇలాగైతే.. ‘స్వచ్ఛ భారత్’ ఎలా?.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పారిశుధ్య పరిరక్షణకు కంకణం కట్టుకుంటూ దేశ వ్యాప్తంగా దీన్ని ముమ్మరం చేసింది. పారిశుధ్యానికి మెరుగుపర్చడానికి తీసుకునే చర్యలో భాగంగా గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఇలాంటి పథకాలు మాత్రం అటకెక్కుతున్నాయి. ఓవైపు స్వచ్ఛభారత్ అంటున్న అధికారులు పల్లెల్లో పారిశుధ్య పరిరక్ష ణ ధ్యేయంగా అమలు చేస్తున్న పథకాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దీంతో పల్లెల్లో పారిశుధ్యం లోపించి విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇకనైనా అధికారులు పారిశుధ్య పథకాల అమలుపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే గ్రామాలు అభివృద్ధి బాట పడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
లక్ష్యం..కనుమరుగు
దామరచర్ల : ‘‘ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి’’ నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ఆరుబయట కాలకృత్యాలకు స్వస్తిచెప్పేందుకు ప్రభుత్వం సంపూర్ణ పారిశుద్ధ్యం పథకాన్ని (నిర్మల్ భారత్ అభియాన్) చేపట్టింది. ఈ పథకాన్ని విజయవంతం చేసే బాధ్యత ఈజీఎస్, డ్వామా అధికారులకు అప్పగించింది. కానీ ప్రజల్లో అవగాహన లేమి, అధికారుల ఉదాసీనత వెరసి జిల్లాలో ఈ పథకం లక్ష్యంలో సగానికి కూడా చేరలేదు. 2013-14 సంవత్సరానికి గాను ప్రభుత్వం జిల్లాలోని 59 మండలాలకు 1,73,870 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేసింది. వీటిని 2014 మార్చినెలాఖరులోగా నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 42,880 మరుగుదొడ్లను మాత్రమే పూర్తి చేసింది. 32,287 అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇప్పటివరకు 98,703 మరుగుదొడ్ల నిర్మాణాలు మొదలేకాలేదు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం..నిధుల మంజూరు జాప్యంతోనే లక్ష్యం నెరవేరలేదన్న విమర్శలున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు జిల్లాలో వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఈజీఎస్ పథకం కింద రూ.4.85 కోట్ల నిధులు మంజూరు చేసింది. అదేవిధంగా నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద రూ.1.79 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు ఈ నిధుల్లో రూ.2.10 కోట్ల నిధులు ఖర్చు చేశారు. 32,297 మరుగుదొడ్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉండగా వాటి బిల్లులు ఆగిపోయాయి. మూలుగుతున్న నిధులు గత ఏడాది వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం మంజూరైన ఉపాధి హామీ నిధులు మూలుగుతున్నాయి. ఒక్కొక్క మరుగు దొడ్డి నిర్మాణానికి ఇచ్చే రూ.9100 మొత్తాన్ని రూ.12 వేలకు ప్రభుత్వం పెంచింది. సాధారణ ఎన్నికలు రావడం కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడంతో నిధులు నిలిచిపోయాయి. ప్రభుత్వాలు మారిన తరువాత ఒక్క మరుగుదొడ్డికి కూడా బిల్లు చెల్లించలేదు. మార నున్న నిర్వహణ శాఖ ప్రస్తుతానికి మరుగుదొడ్ల నిర్మాణ పనులను, పర్యవేక్షణను ఈజీఎస్శాఖకు అప్పగించారు. వారికి పనిభారం వల్ల పనులు మందగించాయని, వేగవంతం చేసేందుకు బాధ్యతను ఆర్డబ్ల్యూఎస్ శాఖకు బదిలీ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా వ్యక్తి గత మరుగుదొడ్ల ప్రాధాన్యతను గ్రామాల్లో ప్రచారం నిర్వహించి లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉంది. అధికారులేమంటున్నారంటే.. ఈ విషయమై డ్వామా ఇన్చార్జ్ పీడీ సుధాకర్ మాట్లాడుతూ సాంకేతిక కారణాలు, లబ్ధిదారు లు బ్యాంకు ఖాతాలను సరిగా ఇవ్వకపోవడంతోనే బిల్లులు ఆగిపోయాయని తెలిపారు. ప్రజ ల్లో అవగాహన కల్పించడంలో స్థానిక అధికారు లు నిర్లక్ష్యం కూడా కొంత ఉందని పేర్కొన్నారు. నిధులు మురిగిపోవని, మరో సంవత్సరంలో నిర్మించుకునే అవకాశం ఉందని చెప్పారు. బిల్లులు ఇప్పించండి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయింది. ఇప్పటికి కేవలం రూ. 1500 ఇచ్చారు. అప్పు తెచ్చి నిర్మించాను. వడ్డీ పెరిగి పోతుంది. ప్రభుత్వం మార డంతో కొత్త ప్రభుత్వం ఇంతవరకు పైసా విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు. నిధులు విడుదల కాగానే బిల్లులు అందజేస్తామని అంటున్నారు. వెంటనే బిల్లులు చెల్లించాలి. - నిమ్మల సైదులు, దామరచర్ల -
సాంస్కృతిక ఉద్యమమే శరణ్యం
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏటా రూ. 50 వేల కోట్లకు పైగా మద్యంపై వెచ్చిస్తున్నారు. ఇందులో నిరుపేద కష్టజీవుల చెమట చుక్కల వాటానే ఎక్కువ. మద్యం వారి కష్టార్జితాన్నే కాదు, కష్టం చేసే శక్తిని కూడా హరించేస్తోంది. ఈ వ్యసనం వల్ల గ్రామీణ యువతను నిష్క్రియాపరత్వం ఆవహిస్తోంది. దీన్ని తక్షణం నియంత్రించాల్సి ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జన జీవితం మధ్య నుండి మద్యాన్ని ఊడ్చి పారేసేందుకు సిద్ధపడాలి. మోదీ ఆదర్శంగా ‘పరిశుభ్రత-పని సంస్కృతి’ నినాదంతో ప్రజలలో మద్య నియంత్రణస్ఫూర్తిని రగిలించడానికి సిద్ధం కావాలి. అప్పుడే ఇదో ఉద్యమం రూపును తీసుకుంటుంది. సాంఘికశాస్త్రం కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలు... సరికొత్త నినాదాలు! గడచిన నాలుగు మాసాలుగా ఒకటే సందడి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు దేశమంతటా కూడా. మన్మోహన్సింగ్ నిస్తేజ పాలనతో విసిగివేసారిన ప్రజలకు ప్రధానిగా నరేంద్ర మోదీ పంచ రంగుల త్రీడీ కలలాగా కనిపిస్తున్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ఆయన సాధించింది ఏమీ లేకపోయినా, నాటకీయంగా చెబుతున్న మాటలకు, ప్రకటిస్తున్న కార్యక్రమాలకు 4జీ ప్రచారం లభిస్తోంది. మిగతా విషయాల మాట ఎలా ఉన్నా, ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ పేరుతో ఆయన చేపట్టిన పారి శుద్ధ్య కార్యక్రమం మాత్రం అందరి ప్రసంశలనందుకుంటోంది. ఇది పూర్తిగా మోదీ బుర్రలో పుట్టిన కొత్త ఆలోచన కాకపోవచ్చు. మునుపటి ప్రభుత్వం కూడా ‘నిర్మల్ భారత్ అభియాన్’ పేరుతో ఒక పథకాన్ని రూపొందించి ఉండ వచ్చు. కానీ క్రియాశీల రాజకీయ నాయకత్వ లోపం వల్ల మూలనపడ్డ ఆ పథ కాన్ని దుమ్ముదులిపి, కొత్త హంగులద్ది ఉద్యమ స్ఫూర్తినివ్వడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని స్వాగతించవలసిందే. జనాభాలో అరవై శాతం బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న దేశం, ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు, పట్టణాల్లో సగానికిపైగా మనవేననే ఖ్యాతిని మోస్తున్న దేశం... జీవ నదులను నిర్జీవమైన మురుగునీటి డ్రైనేజీ కాల్వలుగా దిగజార్చుకున్నామన్న భుజ కీర్తులను ధరించిన దేశం... అణుశక్తిని ఎక్కుపెడితేనేమి? అంగారకుడిని ముట్ట డిస్తేనేమి? అంతర్జాతీయ సమాజం ముందు సిగ్గుతో తలవంచుకు నిలవాల్సిన దుస్థితిలో ఉన్నాం. ఈ మురికిని వదిలించుకుంటేనే మనం తలెత్తుకోగలిగేది. అందుకే ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా వచ్చే ఐదేళ్లూ కొనసాగాలనీ, పరి శుభ్ర భారతాన్ని మహాత్మాగాంధీకి 150వ జయంతి కానుకగా ఇవ్వగలగాలనీ కోరుకుందాం. మద్యం కాటేస్తోంది... నిష్క్రియాపరత్వం వికటిస్తోంది సామాజిక రుగ్మతలను జయించడానికి ప్రభుత్వ పథకాలు మాత్రమే సరిపోవని దశాబ్దాల అనుభవం మనకు నేర్పిన గుణపాఠం. ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తేనే, జన చేతనను వెలిగిస్తేనే ప్రజలను భాగస్వాములుగా మారిస్తేనే ఫలితాలను సాధించగలుగుతాం. కొత్తగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలకు ఇది మరింత అవసరం. నవ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని కేసీఆర్, నవ్యాంధ్రను సువర్ణాంధ్రగా మార్చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. సంక ల్పాలకు స్వాగతం. ఈ బృహత్తర లక్ష్యాలను చేరుకోవాలంటే రెండు రాష్ట్రాల రాజకీయ నాయకత్వం, పాలనా యంత్రాంగం గుర్తించి, పరిహరించాల్సిన విప రిణామం ఒకటుంది. మన గ్రామసీమల్లో పని సంస్కృతి వేగంగా పతనమవు తోంది. గ్రామీణ యువతలో నిష్క్రియాపరత్వం ప్రమాదకరంగా ఆవహిస్తోంది. కారణం.. అందరికీ తెలిసిందే. విశృంఖల మద్య ప్రవాహం! రెండు రాష్ట్రాల్లోని 150 గ్రామాల్లో ఇటీవల ‘సాక్షి’ ప్రతినిధులు చేపట్టిన శాంపిల్ సర్వేలో దిగ్భ్రాం తికరమైన వాస్తవాలు బయటపడ్డాయి. మద్యం గ్రామాలను కబళిస్తోంది. పని చేసే వారైన 25 నుంచి 50 ఏళ్ల వయస్కులే ఎక్కువగా మద్యానికి బానిసలవు తున్నారు. వారిలో పనిచేసే శక్తి నశిస్తోంది. కొందరు పనిచేయడమే మానేసి, వీధుల వెంట తిరుగుతున్నారు. ఈ పరిస్థితి రెండు రాష్ట్రాల్లోనూ ఉంది. తెలం గాణలో కొంచెం ఎక్కువ, ఆంధ్రప్రదేశ్‌లో కొంచెం తక్కువ. తేడా స్వల్పం! మద్యం మోగిస్తున్న చావు డప్పు దాదాపు అన్ని గ్రామాల్లో పనిచేసే వయసులో ఉన్న పురుషుల్లో ఇరవై శాతం మద్యానికి పూర్తిగా బానిసలైపోయారు. మిగతావారిలో అప్పుడప్పుడూ తాగే వారి సంఖ్య ఎక్కువ. తాగుడుకు బానిసలైనవారిలో వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, చిన్న వృత్తి పనులవారే అత్యధికులు. వీరి కుటుంబాల పోషణ భారం ఆడవాళ్ల మీదనే పడింది. తల్లులో, భార్యలో కూలీనాలీ చేసి కుటుంబా లకు అండగా ఉంటున్నారు. జేబులో డబ్బులుంటే 130 రూపాయలతో ఎర్ర మందు (క్వార్టర్ బాటిల్ చీప్ లిక్కర్), లేకుంటే, భార్యల కష్టార్జితాన్ని కొట్టి లాక్కుని పది, ఇరవై రూపాయలతో గుడుంబా ప్యాకెట్లు కొంటారు. సంపాదన లేకపోయినా మందు బిల్లు నెలకు రూ. 1,500కు తగ్గదు. డబ్బు లేకపో యినా, అరువు ఇవ్వడానికి మద్యం అమ్మక కేంద్రాలు సిద్ధం. గ్రామాల్లో సగ టున ప్రతి 250 గడపలకో బెల్టు షాపు. 25 గడపలకో గుడుంబా సెంటర్ అందు బాటులో ఉన్నాయి. వెయ్యి గడపల గ్రామంలో రోజువారీ మద్యం వ్యయం రూ. 30 నుంచి రూ. 40 వేలు. ఏటా కోటి నుంచి కోటిన్నర! ఇందులో అత్య ధిక వాటా నిరుపేదలదే. సంసార భారం మోస్తున్న మహిళల కష్టార్జితం సగాని కంటే ఎక్కువ! చీప్ లిక్కర్, నాటు సారాల ప్రభావంతో ఆరోగ్యకరమైన శరీ రాలు శిథిలమవుతున్నాయి. కాళ్లూ చేతులూ లాగేస్తున్నాయంటూ ఏ పనీ చేయ లేకపోతున్నారు. వారానికి ఒకటి రెండు రోజులు పనికి వెళ్లినా, రోజుకు రెండు మూడు గంటలకు మించి పనిచేయలేకపోతున్నారు. ఆ సంపాదనా మందుకే. ఆరోగ్యాలు పాడైనవారి వైద్య ఖర్చుల కోసం భార్యలు పడే కష్టాలు వర్ణనా తీతం. అప్పుల కోసం ఎక్కని గుమ్మం, దిగని గుమ్మం ఉండటం లేదు. ప్రతి గ్రామంలోనూ ఏటా పది, పన్నెండు మంది ఈ వ్యసనం వల్ల అకాల మరణాల పాలవుతున్నారు. సగటున నెలకోసారి ఊళ్లో మద్యం చావు డప్పు మోగుతోంది. సన్నకారు, చిన్నకారు రైతులు ఈ వ్యసనం వల్ల సొంత వ్యవసాయం పను లు చేసుకోలేకపోతున్నారు. కరెంటు వస్తే బోరు మోటార్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం వరకే వారు పరిమితం. పనులన్నీ భార్యాబిడ్డల పైనే! కూలీతో పాటు నాటు సారా ప్యాకెట్టు, కల్లు సీసా నుంచి క్వార్టర్ బాటిల్ దాకా ఫ్రీ ఆఫర్ ప్రకటిస్తే తప్ప మధ్యతరహా రైతులు, చిన్న పరిశ్రమలకు కూలీలు దొరకడం లేదు. దీంతో అనేక మంది వ్యవసాయాన్నే మానుకుంటున్నారు. సంకల్ప లోపంతోనే చేటు ఈ దుస్థితికి నిందించాల్సింది మన రాజకీయ నాయకత్వాన్నే. ఆచరణ సాధ్యం కాదన్న నెపంతో మద్య నిషేధాన్ని ఎత్తివేసినా, కనీసం దాన్ని నియంత్రించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం లేదు. పెపైచ్చు ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచు కోడానికి కోటాలు నిర్ణయించడం శోచనీయం. ఏపీ ఆర్థికమంత్రి ఇటీవల ఎక్సైజ్ ఆదాయం పెరగాలని బహిరంగంగానే పిలుపునివ్వడం కూడా చూశాం. రెండు రాష్ట్రాల్లో కలిపి ఎక్సైజ్ ఆదాయం గత ఏడాది రూ. 20 వేల కోట్ల పైచిలుకు. అయితే ఇది ప్రభుత్వ రాబడి మాత్రమే. ప్రజలు చేసిన ఖర్చు అంతకంటే చాలా ఎక్కువ. మద్యం ఉత్పత్తిదారునికి చెల్లించిన సొమ్ము, రిటైల్ వ్యాపారి కమీషన్ కలిపి మరో నలభై శాతం వరకు ఉంటుంది. మొత్తం వినియోగదారులు చెల్లించింది 28 వేల కోట్ల పైచిలుకు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా సరఫరా అయ్యే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం మార్కెట్ ఇందులో సగం ఉంటుందని అంచనా. అంటే మరో రూ.14 వేల కోట్లు. ఇక నాటుసారా, కల్లు వాటా మరో పది వేల కోట్ల రూపాయలు ఉంటుంది. మొత్తంగా ఏడాదికి రూ. 50 వేల కోట్లకుపైగా తెలుగు ప్రజలు మద్యంపై వెచ్చిస్తున్నారు. ఇందులో నిరుపేదలైన కష్టజీవుల చెమట చుక్కల వాటానే ఎక్కువ. మద్యం వారి కష్టార్జితాన్నే కాదు, కష్టం చేసే శక్తిని కూడా హరించేస్తోంది. ఇది ప్రమాదకరం. దీన్ని తక్షణం నియంత్రించాల్సిన అవసరం ఉంది. మద్యంపై మొన్నటి ఎన్నికల్లో ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. నియోజకవర్గానికి ఒకటే వైన్ షాపు ఉంటుందనీ, నాటుసారా, బెల్టు షాపులు లేకుండా చూసేందుకు ప్రతి ఊళ్లో పది మంది మహిళా కానిస్టేబుళ్లను నియమి స్తామనీ ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఈ ప్రస్తావన ఎందుకు అవసరమైందంటే దృఢమైన రాజకీయ సంకల్పం లేనిదే మద్యం మహమ్మారిని నియంత్రించడం అసాధ్యం. విషమిస్తున్న ఈ సామాజిక రుగ్మతను నియంత్రించడానికి ప్రభుత్వా లు, పార్టీలు చిత్తశుద్ధితో కృషిచేస్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తారన డంలో సందేహం లేదు. మోదీ ‘స్వచ్ఛ భారత్’ పిలుపునకు ప్రజలు స్పందించిన తీరే అందుకు నిదర్శనం. ఆయన స్ఫూర్తితో మన రెండు రాష్ట్రాల రాజకీయ నాయకత్వం మద్యాన్ని జనజీవితం మధ్య నుండి ఊడ్చి పారేసేందుకు సిద్ధప డాలి. మోదీని ఆదర్శంగా తీసుకొని ‘పరిశుభ్రత-పని సంస్కృతి’ అనే నినా దంతో ప్రజలలో మద్య నియంత్రణ చైతన్యం కల్పించడానికి సిద్ధం కావాలి. అప్పుడే ఇదో ఉద్యమం రూపును తీసుకుంటుంది. రెండు రాష్ట్రాల్లోని అత్యధిక భాగం గ్రామాల్లో పనిచేయాలనుకుంటే పనిదొరకని పరిస్థితులు తక్కువ. కూలి రేట్లు గౌరవప్రదంగానే ఉన్నాయి. భార్యాభర్తలిద్దరు పనిచేస్తే, ప్రభుత్వం అం డగా నిలిస్తే బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వగల పరిస్థితులున్నాయి. కద లాల్సింది ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు. సంఘ సేవకు లంతా ఈ సాంస్కృతిక ఉద్యమంలో ముందు నిలవాలి. వర్థెల్లి మురళి -
మరుగు ఎక్కడా?
రాష్ట్రంలో 64.59 శాతం ఇళ్లకు టాయిలెట్లు నిల్ సరైన నీటి సరఫరా లేకపోవడమే ప్రధాన కారణం క్రూర జంతువులు, ‘మృగాల’ బారిన పడుతున్న మహిళలు హత్యాచారాలు, కిడ్నాపులూ ఈ సమయంలోనే ఎక్కువ వాస్తవాలు బహిర్గతం చేసిన ఎన్బీఏ సర్వే ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో బహిర్బూమికి వెళ్లిన అక్కా చెల్లి విగత జీవులై తేలారు. వారిద్దరే కాదు ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న హత్యాచారాల్లో చాలా మంది మహిళలు బహిర్భూమికి వెళ్లినప్పుడు ఎన్నో ఘోరాలు సంభవించాయని అని ఓ స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలింది. ఇళ్లలో వ్యక్తిగత శౌచాలయాలు లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో మహిళలు బహిర్భూమి కోసం వెళ్లి ‘మృగాల’ బారిన పడుతున్నారు. సమాచార సాంకేతిక రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న కర్ణాటక ఇందుకు మినహాయింపు కాదు. మార్చి నుంచి ఏప్రిల్ వరకూ కర్ణాటకలో నిర్మల్ భారత్ అభియాన్ జరిపిన సర్వేను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని 64.59 శాతం ఇళ్లకు వ్యక్తిగత శౌచాలయాలు (మరుగుదొడ్లు) లేవు. దీంతో వారు చాలా మంది బయలు ప్రదేశాలను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ ఉదాసీనతతో పాటు ప్రజల్లో ఉన్న కొన్ని మూఢనమ్మకాలు కూడా కారణమని నిర్మల్ భారత్ అభియాన్ (ఎన్బీఏ) సర్వేలో తేలింది. రాష్ట్రంలో మొత్తం 1.31 కోట్ల ఇళ్లు ఉండగా అందులో కేవలం 35.41 శాతం ఇళ్లలో మాత్రమే వ్యక్తిగత శౌచాలయాలు ఉన్నాయి. దీంతో వ్యక్తిగత శౌచాలయాల విషయంలో జాతీయ సగటు (40.30 శాతం) కంటే కర్ణాటక పరిస్థితి ఘోరంగా ఉన్నట్లు తేలింది. దేశంలోని అన్ని కుటుంబాలకు 2022 లోపు వ్యక్తిగత శౌచాలయాలు ఏర్పాటు లక్ష్యంగా ఎన్బీఏ పథకం రూపొందించబడింది. ఈ పథకం కింద వ్యక్తిగత శౌచాలయాలు నిర్మించుకోదలిచిన వారికి ఎన్బీఏ నుంచి రూ.4,700 నగదు అందుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామి పథకం కింద మరో రూ.5,400 అదనంగా చేర్చి మొత్తం రూ.10,100 అందిస్తోంది. అయినా కూడా రాష్ట్రంలో అనుకున్నంత మేర వ్యక్తిగత శౌచాలయాలు నిర్మాణం కావడం లేదు. ఇలాంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. సరైన నీటి సరఫరా విధానం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తేలింది. మరోవైపు వ్యక్తిగత శౌచాలయాలను కుటుంబ సభ్యులందరూ ఉపయోగించడం లేదు. కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వ్యక్తిగత శౌచాలయాలను ఉపయోగిస్తుండగా మిగిలిన వారు బయలు ప్రదేశాలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి వ్యక్తిగత శౌచాలయాలు ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్యలో 35 శాతం వరకూ ఉన్నట్లు ఎన్బీఏ పరిశీలనలో తేలింది. ఈ విధంగా ‘ఆ పని’ కోసం బయటకు వెళుతుండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాలు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి వర్షాకాలంలో ఎక్కువగా ఉంటోంది. మరోవైపు బయలు ప్రదేశాలకు వెళ్లిన సమయంలో అటవీ ప్రాంత సమీప గ్రామస్తులు చిరుతలు, ఏనుగుల వంటి వన్యమృగాలు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బహిర్భుమికి వెళ్లిన మహిళలపై హత్యాచారాలు, కిడ్నాపులు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయని సర్వేలో తేలింది. మరోవైపు ఇదే సర్వేలో రాష్ట్రంలోని మొత్తం 72.44 అంగన్వాడీ కేంద్రాల్లోనూ, 4.59 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో శౌచాలయాలు లేనట్లు తెలిసింది. అదే విధంగా 10.87 శాతం పాఠశాలలకు నీటి సరఫరా లేదని సర్వే తేల్చింది. ఈ విషయమై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ...గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇళ్లలో శౌచాలయాలు ఉండటం ఇంటి పవిత్రత దెబ్బతింటుందని భావిస్తున్నారు. అందువల్లే వ్యక్తిగత శౌచాలయాల నిర్మాణం అనుకున్నంతమేర వేగంగా జరగడం లేదని చెబుతున్నారు. అయితే ‘ గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం తాగునీటి సరఫరానే సరిగా ఉండదు. అటువంటి సమయంలో ఇళ్లలోనే శౌచాలయాలు నిర్మించుకోవడం ఎంత వరకూ ఉపయోగకరం.’ అనేది ప్రజల వాదనగా కన్పిస్తోంది. -
వదలని కంపు
=ఫలితమివ్వని సంపూర్ణ పారిశుద్ధ్య పథకం =పదేళ్లయినా పూర్తికాని వ్యక్తిగత మరుగుదొడ్లు =మరో దశాబ్దం వరకు పేరుమార్చి పథకం పొడిగింపు =రూ.కోట్లు ఖర్చయినా క్షేత్ర స్థాయిలో కనిపించని ఫలితాలు =ఐకేపీ సర్వేలో వెలుగు చూసిన ఆశ్చర్యకర విషయాలు సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో పారిశుద్ధ్యం కొరవడింది. అంతటా దుర్గంధం వెలువడుతోంది. అధికారుల నిర్లక్ష్యమో, ప్రజల్లో చైతన్య లోపమోగానీ 2003లో అమల్లోకి వచ్చిన సంపూర్ణ పారిశుద్ధ్య పథకం ఆశించినమేర ఫలితమివ్వలేదు. నిర్దేశించిన పదేళ్లలో రూ.37.74కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం శూన్యం. దీంతో ఆ పథకం పేరు మార్చి (నిర్మల్ భారత్ అభియాన్)మరో పదేళ్లపాటు అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత పదేళ్లలో ప్రగతిని తెలుసుకోవడానికి ఇందిరక్రాంతి పథం(ఐకేపీ) చేపట్టిన బేస్‌లైన్ సర్వేలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెట్టిన ఖర్చంతా ఏమైందన్న వాదన ప్రస్తుతం వ్యక్తమవుతోంది. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలన్నది సంపూర్ణ పారిశుద్ధ్యం పథకం లక్ష్యం. పదేళ్లలో ఇది పూర్తికావాలని కేంద్రప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 40 మందికి ఒక యూనిట్(రెండు మూత్రశాలలు, ఒక మరుగుదొడ్డి) ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ పథకంలో భాగంగా జిల్లాలో 2,52,875 ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టారు. ఇందుకు ప్రభుత్వం రూ.76.01కోట్లు కేటాయించింది. పదేళ్లలో లక్షా 80వేల 513ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్లు నిర్మించారు. 5074పాఠశాలలకు, 605అంగన్వాడీ భవనాలకు, 20కమ్యూనిటీ సెంటర్లకు మరుగుదొడ్లు నిర్మించినట్టు అధికారులు నివేదికలు పేర్కొంటున్నాయి. రూ.37.74కోట్లు ఖర్చు చేసినట్టు గణంకాలు చూపిస్తున్నారు. బేస్‌లైన్ సర్వేలో వెలుగు చూసిన వాస్తవాలు ఐకేపీ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా 4,47,819 ఇళ్లను ఇటీవల సర్వే చేశారు. వాటిలో 76,696 ఇళ్లకు మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నట్టు తేలింది. 3,71,123 ఇళ్లకు మరుగుదొడ్లు లేవు. 2993 ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించగా 263 పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. ఇక 999 అంగన్వాడీ భవనాలను పరిశీలించగా 695కు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. ఇందులో 571పాఠశాలలకు మాత్రమే నీటి సదుపాయం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల విషయానికొస్తే 405 భవనాలను పరిశీలిస్తే కేవలం 57కి మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. ఇందులో 53కి నీటి సౌకర్యం ఉంది. మిగతా భవనాలన్నీ మరుగుదొడ్లుకు నోచుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న 1451అద్దె భవనాలను పరిశీలిస్తే 74కి మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. వీటినిబట్టి పదేళ్లలో రూ.37.74కోట్లు ఖర్చు ఏమైందన్న అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఈ పథకాన్ని గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్) పర్యవేక్షిస్తోంది. రాజీవ్ విద్యా మిషన్, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ, డ్వామా శాఖల ద్వారా ఈ పథకానిన అమలు చేసింది. అంటే లోపమెక్కడన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. మరో పదేళ్ల వరకూ పొడిగింపు రూ.కోట్లు ఖర్చయినా ఆశించిన ఫలితాలు కన్పించక పోవడంతో సంపూర్ణ పారిశుద్ధ్యం పథకాన్ని నిర్మల్ భారత్ అభియాన్ పేరుతో మరో పదేళ్లు అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.340.3కోట్లు అవసరమని కేంద్రానికి ప్రతిపాదించారు. ఇందులో లక్షా 75వేల 289ఇళ్లల్లో, 80కమ్యూనిటీ సెంటర్లలో, 2745పాఠశాలల్లో, 2315అంగన్వాడీ కేంద్రాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం నిర్దేశించారు. అలాగే 932 పంచాయతీల్లో ఘన వ్యర్థ నిర్వహణ చేయాలని నిర్ణయించారు. -
ధనలక్ష్మిపై చర్యలేవి?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ భారత్ అభియాన్(ఎన్బీఏ) నిధుల బాగోతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్ఎల్) నిర్మాణం కోసం కేటాయించిన నిధుల నుంచి రూ.17.60 కోట్లు పక్కదారి పట్టిన వైనం కలకలం రేపుతోంది. జిల్లావ్యాప్తంగా అధికారులు 2012 డిసెంబర్లో లక్ష వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణాలు మొదలు కాకముందే సామగ్రి ముందస్తు కొనుగోలు పేరిట ఆరు నెలల కింద ధనలక్ష్మి ఏజెన్సీకి రూ.17,59,63,892 మూడు విడతల్లో చెల్లించారు. డబ్బులు చెల్లించే నాటికి జిల్లాలో పూర్తయిన మరుగుదొడ్ల సంఖ్య 24 మాత్రమే. ఉన్నతాధికారులు కుమ్మక్కై డబ్బులను 50:30:20 నిష్పత్తిలో పంచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంపీడీవోల ద్వారా నిధులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ప్రమాణాలు పాటించకుండా టూల్‌కిట్స్‌ను మండల, పంచాయతీ కార్యాలయాలకు చేర్చారు. టూల్‌కిట్స్ లబ్ధిదారులకు చేరకపోగా, పైకప్పులు సరిపోవడం లేదని అంటున్నారు. మరుగుదొడ్డి ఐదు అడుగులు దాటి ఉంటే పైకప్పు 4.5 అడుగులు.. తలుపులకు గొళ్లాలు లేకుండా సరఫరా చేశారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం సామగ్రి సరఫరా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిధులు పక్కదారి పట్టిందిలా.. జిల్లాలో ఎన్బీఏ కింద 1,00,653 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.45.29 కోట్లు కేటాయించింది. 2012 డిసెంబర్లో శ్రీకారం చుట్టిన ఈ పథకం నిర్వహణ బాధ్యతలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా)కు అప్పగించారు. రూ.10 వేల విలువ యూనిట్లో రూ.900 లబ్ధిదారుని వాటా ఉండగా, రూ.4,600 గ్రామీణ నీటిసరఫరా విభాగం ద్వారా చెల్లిస్తారు. మిగతా రూ.4,500 ఉపాధి హామీ పథకం కింద కూలీ పనికి చెల్లింపులు ఉంటాయి. అయితే ప్రభుత్వం నిధులు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుడే టూల్‌కిట్స్ కొనుగోలు కోసం నేరుగా ఇంటర్నెట్ ద్వారా డబ్బులు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టింది. లేకుంటే ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఎంపీడీవోల ఖాతాలో ఒక్కో యూనిట్‌కు రూ.4,600 చొప్పున బదిలీ అయిన నిధుల నుంచి చెల్లించాలి. ఈ మరుగుదొడ్ల టూల్కిట్స్లో ఒక తలుపు, పైన కప్పేందుకు రేకు, ఒక బేసిన్(సీటు) ఉన్నాయి. చాలీచాలని పైకప్పు, నాసిరకం టూల్‌కిట్స్‌ను వాడటానికి లబ్ధిదారులు అనాసక్తి చూపిస్తున్నా నిధులు మాత్రం కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించారు. ముఖం చాటేసిన నిర్వాహకులు మరుగుదొడ్ల నిర్మాణం కోసం టూల్‌కిట్స్ పేరిట నిధుల దుర్వినియోగంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలపై కలెక్టర్ అహ్మద్ బాబు స్పందించారు. టూల్‌కిట్స్ సరఫరా కోసం రూ.17.60 కోట్లు చేజిక్కించుకున్న ధనలక్ష్మి నిర్వాహకుడిని కలెక్టరేట్‌కు పిలిపించి మందలించారు. నాణ్యమైన సామగ్రి సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందుకు నిర్వాహకుడు అంగీకరించాడు. ఎన్బీఏ కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన ప్రతి గ్రామంలో ఓ ‘మోడల్’ మరుగుదొడ్డిని నిర్మించాలని కాంట్రాక్ట్ సంస్థకు సూచించారు. కానీ, నిర్వాహకులు ముఖం చాటేసి పత్తా లేకుండా పోయారు. మరుగుదొడ్ల నిర్మాణం జిల్లాలో ప్రస్తుతం 10 వేలకు చేరగా, గతంలో జరిగిన టూల్‌కిట్స్ బాగోతంపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. ఏదేమైనా ధనలక్ష్మిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారు? నాణ్యమైన టూల్‌కిట్స్ సరఫరా కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్న అంశాలు చర్చనీయాంశంగా మారగా, కలెక్టర్ అహ్మద్ బాబు ఈ వ్యవహారంపై సీరియస్‌గా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. నాసిరకం కిట్లు పంపిణీ చేశారు.. నాపేరు గార్లె వెంకట్. మాది అంజీ గ్రామం. నాకు ఈజీఎస్ పథకం కింద మరుగుదొడ్డి మంజూరైంది. నిర్మాణం పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. డబ్బులు వస్తాయనే ఆశతో గోడలు కట్టాను. కానీ అధికారులు ఇచ్చిన రేకులు, బేసిన్, తలుపులు నాసిరకంగా ఉన్నాయి. ఇంకా పై కప్పు రేకులు, తలుపులు చిన్నగా ఉండటంతో వేయలేక వదిలేశాను. కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అధికారులు ఇచ్చి ఏం లాభం. -
నత్తడకన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం
సాక్షి, నల్లగొండ: గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు మౌలిక సదుపాయాలు కల్పిం చాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికీ వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది. జిల్లాలో గతేడాది 76,616 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మొత్తం యూనిట్ల నిర్మాణానికి రూ.32.76 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం వీటిని నిర్మించుకోవచ్చు. గత అక్టోబర్‌లో మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఇప్పటివరకు కేవలం 17వేల యూ నిట్ల నిర్మాణం మాత్రమే పూర్తి కావడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. చెల్లింపులు ఇలా... జాతీయ ఉపాధి హామీ, నిర్మల్ భారత్ అభియాన్ (ఎన్బీఏ) పథకాలు సంయుక్తంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాయి. మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.10 వేలుగా అంచనా వేశారు. గుంతల తీత, సీసీ బెడ్ వేయడం తదితర పనులు చేసినందుకుగాను వేతనం కింది ఉపాధి హామీ పథకం ద్వారా రూ.2,235 చెల్లిస్తారు. సిమెంట్ రింగులు, సిమెంట్, ఇటుకలు, కంకర, ప్లాస్టరింగ్, కుండి తదితర వాటి (మెటీరియర్)కోసం ఎన్బీఏ, ఉపాధి హామీ పథకాలు సంయుక్తంగా రూ.6,815 చెల్లించాల్సి ఉంది. మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయ్యే వరకు పర్యవేక్షించే మేట్కి రూ.50 అందజేస్తారు. ఈ మొత్తం రూ.9,100 పోను మిగిలిన రూ.900 తమ వాటాగా లబ్ధిదారులు భరించాలి. జాప్యానికి కారణాలు... మరుగుదొడ్డి నిర్మాణ దశలను బట్టి రూ.9,100 ప్రభుత్వం నుంచి లబ్ధిదారునికి అందుతాయి. అయితే ఇందులో వేతనం కింద చెల్లించే డబ్బులు మాత్రమే పోస్టాఫీసు ద్వారా లబ్ధిదారుని ఖాతాలో జమవుతున్నాయి. మెటీరియర్ కింద చెల్లించాల్సిన డబ్బులు లబ్ధిదారులకు చేరడం లేదు. కేవలం కూలి మాత్రమే తమ ద్వారా చెల్లిస్తామని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది. మెటీరియల్ చెల్లింపులు తమ వల్లకాదని చేతులెత్తేసింది. దీంతో వేతనాలు పోను మెటీరియల్ కింద ఒక్కో యూనిట్‌కి చెల్లించే రూ.6,865 ఏపీఓల వద్దే నిలిచిపోయాయి. కొన్ని నెలలుగా వీరివద్దే మూలుగుతున్నాయి. ఇలా చెల్లింపులు అరకొరగా, ఆలస్యంగా జరుగుతుండడంతో లబ్ధిదారులు మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో డ్వామా అధికారులు గ్రామీణాభివృద్ధి కమిషనర్‌కు ఇటీవల లేఖ రాశారు. వీలైనంత త్వరలో చెల్లింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఆది నుంచీ ఆటుపోట్లే.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఆదినుంచీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. ప్రభుత్వం రోజుకో నిబంధన తెరమీదకు తెస్తుండడంతో అధికారులు, లబ్ధిదారులు అయోమయంలో పడుతున్నారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో నిర్మాణాలు పూర్తికావడం లేదు. మొదల్లో బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లింపులు చేస్తామని చెప్పారు. లబ్ధిదారులు ముందుగా ఈ మొత్తాన్ని భరించి నిర్మాణం మొదలు పెట్టాలన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక చాలామంది అందుకు సాహసించలేదు. మరుగుదొడ్ల నిర్మాణంలో భాగంగా విసర్జిత వ్యర్థాల కోసం రెండు గుంతలు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ పద్ధతి సరైనదే అయినప్పటికీ స్థలాభావం వల్ల కొందరు వెనకడుగు వేశారు. క్షేత్ర సహాయకులు మొదటగా లబ్ధిదారులను గుర్తించడానికి ఇంటింటి సర్వే చేశారు. ఇది పూర్తికాగానే... ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు అనర్హులని మెలిక పెట్టింది. వెరసి మరో జాబితా రూపొందించేందుకు మరికొంత సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఇటువంటి ఆటుపోట్లను అధిగమించి నిర్మాణానికి ముందుకొస్తున్నారు. ఇటువంటి సమయంలో కూలి డబ్బులు మాత్రమే పోస్టాఫీసు ద్వారా చెల్లించి.. మిగిలిన డబ్బులను నిలిపివేస్తుండ డం మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.