లక్ష్యం కను‘మరుగు’
ఏలూరు :జిల్లాలోని నిర్మల్ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో యూనిట్ రూ. 10,500 వ్యయంతో ప్రారంభించిన ఇవి ప్రజలకు అక్కరకు రాకుండాపోయాయి. 2012లో ప్రారంభించిన ఈ పథకంలో మొత్తం 83,361 మరుగుదొడ్ల నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. దీనికోసం రూ. 84 కోట్ల 9 లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు కేవలం రూ. 20 కోట్ల 21 లక్షల 15 వేలు మాత్రమే ఖర్చు చేశారు. కేవలం 18, 820 టాయిలెట్లు మాత్రమే పూర్తయ్యాయి. వివిధ దశల్లో 9,044 టాయిలెట్లు ఉన్నాయి. 69, 541 నిర్మాణాలు ప్రారంభించలేదు. రెండేళ్లలో 21.35 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో ఇవి నత్తనడకన సాగాయి. పర్యవేక్షణ లేకపోవడం, నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వల్ల, మరుగుదొడ్లకు ఏర్పాటు చేయూల్సిన పిట్లు ఒకటా? రెండా? అన్న అంశంపై తర్జనభర్జన సాగడంతో ఈ నిర్మాణాలు మందకొడిగా సాగారుు. దీంతో కనీసం మండలానికి వెయ్యి చొప్పున కూడా నిర్మించలేకపోయూరు. నిర్మాణ దశలో ఉన్న 9,044 మరుగుదొడ్లను ఇప్పటికైనా డ్వామా అధికారులు పూర్తి చేస్తే కొంతమందికైనా ఇక్కట్లు తీరతాయని లబ్ధిదారులంటున్నారు.
స్వచ్ఛ భారత్‌కు ప్రారంభోత్సవం ఎప్పుడో
జిల్లాలో నిర్మల్ టాయిలెట్ల నిర్మాణాన్ని అక్టోబరు 1వ తేదీ నుంచి నిలిపివేసినట్టు అధికారులు చెబుతున్నారు. అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం పేరు మీదనే మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు గ్రామాల్లో అర్హుల గుర్తింపు జరుగుతోంది. ఈ నెలాఖరు నాటికి ఎంపీడీవోలు లబ్ధిదారుల వివరాలపై నివేదిక సమర్పించాలని కలెక్టరు ఆదేశాలు జారీచేశారు. స్వచ్ఛ భారత్ కింద రాబోయే రోజుల్లో గ్రామీణ నీటిసరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) ద్వారా నిర్మించే మరుగుదొడ్లకు రూ. 12 వేలు చొప్పున మంజూరు చేయనున్నారు. అయితే గతంలో మంజూరై, రద్దైన 69 వేల లబ్ధిదారుల పరిస్థితి మళ్లీ మొదటికి రావడం విమర్శలకు తావిస్తోంది. పాత డేటానే తీసుకుని వీరికి టాయిలెట్లు నిర్మించాలన్న ఆలోచన ప్రభుత్వాలకు రాకపోవడం కూడా లబ్ధిదారులను కలవరపరుస్తోంది.