లక్ష్యం..కనుమరుగు
దామరచర్ల : ‘‘ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి’’ నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ఆరుబయట కాలకృత్యాలకు స్వస్తిచెప్పేందుకు ప్రభుత్వం సంపూర్ణ పారిశుద్ధ్యం పథకాన్ని (నిర్మల్ భారత్ అభియాన్) చేపట్టింది. ఈ పథకాన్ని విజయవంతం చేసే బాధ్యత ఈజీఎస్, డ్వామా అధికారులకు అప్పగించింది. కానీ ప్రజల్లో అవగాహన లేమి, అధికారుల ఉదాసీనత వెరసి జిల్లాలో ఈ పథకం లక్ష్యంలో సగానికి కూడా చేరలేదు. 2013-14 సంవత్సరానికి గాను ప్రభుత్వం జిల్లాలోని 59 మండలాలకు 1,73,870 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేసింది. వీటిని 2014 మార్చినెలాఖరులోగా నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 42,880 మరుగుదొడ్లను మాత్రమే పూర్తి చేసింది. 32,287 అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇప్పటివరకు 98,703 మరుగుదొడ్ల నిర్మాణాలు మొదలేకాలేదు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం..నిధుల మంజూరు జాప్యంతోనే లక్ష్యం నెరవేరలేదన్న విమర్శలున్నాయి.
మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు
జిల్లాలో వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఈజీఎస్ పథకం కింద రూ.4.85 కోట్ల నిధులు మంజూరు చేసింది. అదేవిధంగా నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద రూ.1.79 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు ఈ నిధుల్లో రూ.2.10 కోట్ల నిధులు ఖర్చు చేశారు. 32,297 మరుగుదొడ్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉండగా వాటి బిల్లులు ఆగిపోయాయి.
మూలుగుతున్న నిధులు
గత ఏడాది వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం మంజూరైన ఉపాధి హామీ నిధులు మూలుగుతున్నాయి. ఒక్కొక్క మరుగు దొడ్డి నిర్మాణానికి ఇచ్చే రూ.9100 మొత్తాన్ని రూ.12 వేలకు ప్రభుత్వం పెంచింది. సాధారణ ఎన్నికలు రావడం కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడంతో నిధులు నిలిచిపోయాయి. ప్రభుత్వాలు మారిన తరువాత ఒక్క మరుగుదొడ్డికి కూడా బిల్లు చెల్లించలేదు.
మార నున్న నిర్వహణ శాఖ
ప్రస్తుతానికి మరుగుదొడ్ల నిర్మాణ పనులను, పర్యవేక్షణను ఈజీఎస్‌శాఖకు అప్పగించారు. వారికి పనిభారం వల్ల పనులు మందగించాయని, వేగవంతం చేసేందుకు బాధ్యతను ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు బదిలీ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా వ్యక్తి గత మరుగుదొడ్ల ప్రాధాన్యతను గ్రామాల్లో ప్రచారం నిర్వహించి లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉంది.
అధికారులేమంటున్నారంటే..
ఈ విషయమై డ్వామా ఇన్‌చార్జ్ పీడీ సుధాకర్ మాట్లాడుతూ సాంకేతిక కారణాలు, లబ్ధిదారు లు బ్యాంకు ఖాతాలను సరిగా ఇవ్వకపోవడంతోనే బిల్లులు ఆగిపోయాయని తెలిపారు. ప్రజ ల్లో అవగాహన కల్పించడంలో స్థానిక అధికారు లు నిర్లక్ష్యం కూడా కొంత ఉందని పేర్కొన్నారు. నిధులు మురిగిపోవని, మరో సంవత్సరంలో నిర్మించుకునే అవకాశం ఉందని చెప్పారు.
బిల్లులు ఇప్పించండి
వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయింది. ఇప్పటికి కేవలం రూ. 1500 ఇచ్చారు. అప్పు తెచ్చి నిర్మించాను. వడ్డీ పెరిగి పోతుంది. ప్రభుత్వం మార డంతో కొత్త ప్రభుత్వం ఇంతవరకు పైసా విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు. నిధులు విడుదల కాగానే బిల్లులు అందజేస్తామని అంటున్నారు. వెంటనే బిల్లులు చెల్లించాలి.
- నిమ్మల సైదులు, దామరచర్ల