నిర్లక్ష్యం ‘బహిరంగమే’ | Swachh bharat programme only for canvassing | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం ‘బహిరంగమే’

Published Thu, Mar 5 2015 1:11 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

నిర్లక్ష్యం ‘బహిరంగమే’ - Sakshi

నిర్లక్ష్యం ‘బహిరంగమే’

ప్రచారానికే పరిమితమైన స్వచ్ఛభారత్  
లక్ష్యానికి దూరంగా మరుగుదొడ్ల నిర్మాణం
 
 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ ప్రచారానికే పరిమితం అవుతోంది. ‘ఇంటింటికీ మరుగుదొడ్డి’ పథకం ఆచరణలో మరుగునపడిపోతోంది. ఇక తెలంగాణ రాష్ర్టం లో బిల్లుల చెల్లింపులో  జాప్యం కారణంగా ‘నిర్మల్ భారత్ అభియాన్’ కింద చేపట్టిన లక్షలాది మరుగుదొడ్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపణలు విప్పిస్తున్నాయి.    
 -సాక్షి నెట్‌వర్క్
 
 ఒకవైపు అవగాహన లోపం, మరోవైపు బిల్లుల చెల్లింపులో జాప్యం వెరసి.. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం ముందుకు సాగడం లేదు. దీంతో గ్రామాలతోపాటు, పట్టణాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ అవసరాల కోసం బహిర్భూమికి వెళ్లక తప్పడం లేదు. వాస్తవానికి ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 18వేలు ఖర్చవుతుందని అధికారులే చెబుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.12 వేలు చెల్లిస్తోంది. గతంలో రూ.10వేలు మాత్రమే ఉండగా, ఇటీవలే రూ.2వేలు పెంచారు.లబ్ధిదారులు ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ముకు సరిపోను నిర్మాణం చేసి. మిగిలిన వాటికి డబ్బుల్లేక అసంపూర్తిగా వదిలేస్తున్నారు. మరికొద్దిమంది నిధులు సరిపోవనే సాకుతో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొన్నిచోట్ల మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ అవగాహనాలోపంతో వాటిని సామాన్లు భద్రపరిచే గదులుగా వాడుతున్నారు. మరికొన్ని చోట్ల అయితే మరుగుదొడ్డి వాడకాన్ని పక్కకు పెట్టి బహిర్భూమికి వెళ్లడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ పల్లెల్లో మరుగుదొడ్డి వినియోగించుకోకపోవడానికి నీటి కొరత కూడా కారణమని చెబుతున్నారు.
 
 కరీంనగర్ జిల్లాలో గత మూడేళ్లలో 2,34,000 మరుగుదొడ్లు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 79,527 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన వాటిలో 27,927 నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోగా, 1.26,546 మరుగుదొడ్ల నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. ఈ పథకంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు రావడంతో గతంలో ఏసీబీ అధికారులు దాడులు కూడా నిర్వహించారు. ఆ తరువాత నిర్మాణాన్ని గ్రామీణ నీటిపారుదల, పారిశుధ్యశాఖకు అప్పగించినా పురోగతి లేదు.
 
 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో వరంగల్ అత్యంత అధ్వాన స్థితిలో ఉంది. జిల్లాలో ఏడాది క్రితం మొత్తం 2.50 లక్షలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకు వంద మరుగుదొడ్లు కూడా నిర్మాణానికి నోచుకోకపోవడం దారుణం. ప్రభుత్వం నుంచి కూలీ డబ్బులు మాత్రమే వస్తాయని, సిమెం ట్, ఇటుక వ్యయాన్ని సొంతంగా భరించాలనే ప్రచారంతో ఎవరూ ముందుకురావడం లేదని తెలిసింది. ప్రజల్లో నెలకొన్న ఈ అనుమానాన్ని నివృత్తి చేసి, వారికి అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
   
 నిర్మల్ భారత్ అభియాన్ (ఎన్‌బీఏ) కింద నిజామాబాద్ జిల్లాలో1,18,522 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 54,182 మాత్రమే పూర్తయ్యాయి. అయితే, మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు వెబ్‌సైట్‌లో మాత్రం 1204 ఫొటోలే అప్‌లోడ్ అయినట్టు కన్పిస్తోంది. జిల్లాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ఇసుక కొరత తీవ్ర ఆటంకంగా మారింది. అ సలే డబ్బులు తక్కువగా చెల్లిస్తుండడంతో ఇసుకను బ్లాక్‌లో కొని మరుగుదొడి నిర్మించుకోవడం లబ్దిదారులకు భారంగా మారుతోంది.
 
 ఆదిలాబాద్ జిల్లాలో 1.82 లక్షలు మంజూరు కాగా, 36,844 మరుగుదొడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. 97,454 మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభానికే నోచుకోలేదు. అక్షరాస్యతలో వెనుకంజలో ఉన్న జిల్లాల్లో అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో మెజారిటీ ప్రజలు బహిర్భూమికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
 
 మహబూబ్‌నగర్ జిల్లాల్లో 2013-14లో 41,925 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా 9701, 2014-15లో 68 వేలకు 7 వేల నిర్మాణాలను మాత్రమే పూర్తి చేశారు. బిల్లుల చెల్లింపులో జాప్యం, నిర్మాణ వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల ఆశించిన స్థాయిలో నిర్మాణాలు పూర్తి కాలేదు. నిర్మాణానికి ముందుకొచ్చిన వారికి నిబంధనల పేరిట అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. మరోవైపు నిర్మాణాలు పూర్తయినప్పటికీ వాడుకలోలేని మరుగుదొడ్లు సగానికిపైగా ఉన్నాయి. వీటిని కేవలం స్టోర్‌రూంలకే వినియోగిస్తున్నారు.
 
 మెదక్ జిల్లాకు 62,663 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా, 11,807 మాత్రమే పూర్తయ్యాయి. వీటిలో 22,616 వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 28,240 మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి నేటికీ పనులు ప్రారంభించలేక పోయారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గంలో 34 శాతమే పూర్తయ్యాయి. ఈ నియోజకవర్గానికి 5,103 మంజూరు కాగా 2,362 వివిధ దశల్లో ఉండగా 1,752 మాత్రమే పూర్తయ్యాయి.
 
 రూపాయి కూడా రాలేదు...
 ‘‘మరుగుదొడ్డి నిర్మించుకొని నాలుగు నెలలు అయితాంది. కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదు. రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ఈజీఎస్ నుంచి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు బిల్లుకోసం పంపినట్లు చెప్పుతుండ్రు. అధికారులు స్పందించి బిల్లు అందేలా చూడాలి’’    
 - బెక్కటి గంగాధర్, లబ్దిదారుడు, కరీంనగర్
 
 బిల్లు రాక పనులు ఆపేసిన..
 ఏడాది కిందట మరుగుదొడ్డి పనులు మొదలుపెట్టినం. పునాది తోడుకున్న తర్వాత రూ.3 వేలు ఇస్తమని చెప్పిండ్రు. ఇంత వరకు ఆ డబ్బులు ఇయ్యలేదు. అష్టకష్టాలు పడి లెంటల్ లెవల్ వరకు మరుగుదొడ్డి పూర్తి చేసినం. డబ్బులు వస్తయనే ఆశతో అప్పు చేసి మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టి ఇప్పుడు తిప్పలు పడుతున్నం. బిల్లు ఇస్తేకానీ మరుగుదొడ్డి పూర్తి చేసుకోలేం.
 - జంబి మొండక్క, నెన్నెల, ఆదిలాబాద్ జిల్లా
 
 అధికారుల మాటల నమ్మి మోసపోయా
 ప్రభుత్వం మరుగుదొడి నిర్మాణానికి డబ్బులిస్తరని మరుగుదొడ్డి నిర్మాణానికి పూనుకున్న. అక్కడ ఇక్కడ 5 వేల రూపాయలు అప్పు చేసి మరుగుదొడ్డి నిర్మాణ పనులు ప్రారంభించా.  కానీ, నేటివరకు ప్రభుత్వం నుంచి పైసా ఇవ్వలేదు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం నుంచి రూ.10 వేలకు పైన  అందుతాయని అధికారుల మాటల నమ్మి మోసపోయా.
 - తంగడపల్లి సాలమ్మ,
 చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement