ఆత్మశుద్ధి లేని ‘స్వచ్ఛ’ ఉద్యమమేల? | How Mahatma Gandhi Work For Swachh Bharat | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 9 2018 12:41 AM | Last Updated on Tue, Oct 9 2018 1:04 AM

How Mahatma Gandhi Work For Swachh Bharat - Sakshi

గాంధీ తన బలిదానానికి మూడు మాసాల ముందే దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ,‘‘దేశంలో హైందవ ధర్మాన్ని హిందువులే సర్వనాశనం చేస్తూ ఉండటాన్ని నేను భరించలేకపోతున్నాను. మనం అంతా ఒకే దేశం వాళ్లం. అందరం ఒక్కటే. హిందువులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు, క్రైస్తవులు అందరం ఐక్యంగా ఒక్క శక్తిగా మెలిగి నప్పుడు మనం తన్నులాడుకోవలసిన అవసరం లేదు’’ అని సందేశమిచ్చారు.. గాంధీజీ నిండు మనస్సుతో, ఆర్ద్రతతో, మానవత్వంతో అందజేసిన సువిశాలమైన సందేశాన్ని ఆచరణలో పాటించకుండా ఆయన బోధనల్ని కేవలం ‘టాయిలెట్‌’ సమస్యకే పరిమితం చేయబోవడం అనేక వింతలలో మరొక వింత. 

భారత రిపబ్లిక్‌ కాస్తా నేడు అసహన భారతంగా రూపొందింది. 2010–18 మధ్య దేశ పౌరులపై 63 వేధింపులు, హత్యలు నమో దుకాగా, కేవలం 2014 మే తర్వాతనే 61 హత్య కేసులు నమోదయ్యాయి. ఇంతటి స్థాయిలో దేశపౌరులపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఈ హింసాకాండను కళ్లతో చూస్తూ కూడా స్పందించలేనివారిగా మిగిలి పోతున్నాం. కాగా, మరోవైపున అసలు సంఘర్షణ జరుగుతున్నది సమా జంలో అణగారిన వర్గాలతో–కుల మతాలు, వ్యక్తిగత విశ్వాసాలు కల్గి అవతల గట్టున ఉన్న అసంఖ్యాక ప్రజలతోనని గ్రహించాలి. ఈ పరి ణామం మొత్తం గాంధేయ తాత్విక దృష్టిని బలవంతంగా పక్కకు నెట్టేసిన ఫలితమే.– జస్టిస్‌ (రిటైర్డ్‌) ఎ.పి.షా: హైదరాబాద్‌ ‘గాంధీ మంథన్‌ సంవాద్‌’లో ప్రసంగం, 2–10–18

గాంధీజీని పాలకులు నేడు ఒక టాయిలెట్‌ నినాదానికి, ఓ కళ్లజోడు ఫ్రేము కిందికి దిగజార్చి మానవశ్రమలోని హుందాతనాన్ని కేవలం కక్కూసు దొడ్లకు కుదించి, ప్రచారం కోసం పాలక పెద్దలు చీపుళ్లు చేత పట్టుకుని కొద్ది నిమిషాల సేపు వీధులు ఊడుస్తున్నట్టు చూపించే నాలుగు కెమెరాలకు దిగజార్చారు.– జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, 2–10–18

గాంధీజీ విదేశాల్లో ఉండగా, దక్షిణాఫ్రికా ఫీనిక్స్‌ సెటిల్‌మెంట్‌ టాల్‌ స్టాయ్‌ క్షేత్రంలో, ఎరవాడ జైల్లో తానున్న చోట కక్కూసు దొడ్లను (టాయిలెట్స్‌) తానే శుభ్రం చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. ఆయనతో పాటు భార్య కస్తూరీబాయి కూడా అదే పనిచేశారు. స్వతంత్ర భారత పాలకులెవరూ అలాంటి జీవనవిధానం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలిచినవారని భావించలేం. టాల్‌స్టాయ్, తోరో, రస్కిన్‌ బోధల ఆధా రంగా ఏర్పడినదే ఫీనిక్స్‌ సెటిల్‌మెంట్‌ క్షేత్రం. తర్వాత దేశంలోని జైళ్లలో, సబర్మతీ ఆశ్రమం, ఇతర ఆశ్రమాల్లో గాంధీ అనుసరించిన జీవన విధా నానికి ఆయన మార్గంలో పయనిస్తున్నామని చెప్పే రాజకీయపక్షాల నేతల తీరుకూ పోలికే లేదు. ప్రస్తుత పాలకవర్గంలోని ‘భద్రమూర్తులు’ ఎన్నికల ముందు, ఆ తర్వాత ‘చిట్కా’ విధానాలతో కాలక్షేపం చేస్తు న్నారు. దక్షిణాఫ్రికాలో, మనదేశంలో అనుసరించిన సిద్ధాంత విలువల్లో గాంధీజీ ప్రత్యేకత కనిపిస్తుంది. విదేశాల్లోనూ, ఇక్కడా కూడా సత్యా గ్రహ ఆశ్రమాల్లో కామన్‌ వంటశాల ఉన్నప్పుడు అస్పృశ్యత పేరిట ఆశ్ర మవాసులు కొందరు దళిత కుటుంబీకులతో కలిసి భోజనం చేయడానికి సంకోచించి, పక్కన కూర్చోవడానికి నిరాకరించిన సందర్భాల్లో గాంధీ పాత్ర చాలా గొప్పది. దళితులతో కలిసి భోంచేయడం తప్పు కాదని, పాపం కాదనీ వారికి ఆయన ‘క్లాస్‌’ పీకవలసివచ్చింది. అన్ని ఆశ్రమ సమావేశాల్లోనూ రెండు పూటలా అన్ని మతాలవారినీ స్వయంగా కలు పుకుని  ప్రార్థనలు నిర్వహించేవారు. అలా అన్ని మతాలవారితో కలిసి భోజనాలు, భజనలు చేసేవారు. మత ఛాందసులను సైతం కలుపుకు పోవడం ద్వారా గాంధీజీ మానవ జీవితాన్ని సమానత్వ పునాదులపై నిర్మించారు. ఆ ప్రాతిపదికన అన్ని కులాలు, మతాల వారి కుల దుర హంకారాన్ని, వివక్షను ఛేదించడానికి ఆయన కృషి చేశారు. ఇంతకీ దేవుడనేవాడు ఎక్కడున్నాడంటే–‘శ్రమలో మాత్రమే’ అని ఎన్నో సంద ర్భాల్లో ఆయన చెప్పేవారు. మానవునిలోని ఆ శ్రమైక జీవన సౌంద ర్యాన్ని ఆయన గుర్తించినందునే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో కూడా స్వేచ్ఛగా పాల్గొనగలిగారు. 

ప్రచారం కోసమే శుద్ధి  విన్యాసాలు!
ఈనాటి దేశ పాలకులు పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రచారం కోసమే చేపడుతున్నారు. స్వాతంత్య్రోద్యమ మౌలిక లక్ష్యాలైన సామాజిక, రాజకీయ, ఆర్థిక సమూల పరివర్తనను విస్మరించారు. ఈ నేతలు సూటూ– బూటూ వేసుకుని వీధులు శుభ్రం చేస్తున్నట్టు నడుం వంచినట్టుగా కనిపించే కెమెరా షాట్లతో సరిపెట్టుకునే విన్యాసంగా మలిచారు. అదైనా దేశవ్యాప్తంగా శ్రద్ధగా అమలు చేశారా అంటే లేదని న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘ద వైర్‌’ ప్రతినిధి కబీర్‌ అగర్వాల్‌ గాంధీ 150వ జయంతి ఉత్సవాల ప్రారంభం రోజునే వివరించారు. అంతేకాదు, 2014 నుంచి ఇప్పటి వరకూ గ్రామీణ భారతంలో ‘స్వచ్ఛ భారత్‌’’ పేరిట తలపెట్టిన టాయిలెట్స్‌ నిర్మాణ పథకం అమలు జరుగుతున్న తీరును వివిధ దేశీయ, ప్రపంచ సాధికార సర్వే సంస్థలు ఎండగట్టాయి. ప్రపంచవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనకు ప్రధాన కారణం టాయ్‌లెట్‌ మరు గుదొడ్ల సౌకర్యాలు లేకపోవడం. ఈ సమస్యను పరిష్కరించకుండా పారి శుద్ధ్య కార్మికుల(సఫాయి కర్మచారి)ఉపాధిని దెబ్బదీస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పెంచకుండా పాలకులు టాయిలెట్స్‌ నిర్మించడానికి ఉత్తర్వులు జారీచేయడం వల్ల ఫలితం ఉండదని జాతీయ కర్మచారీ ఆందోళన్‌ సంస్థ ఎన్నోసార్లు ప్రకటించింది. ఆధునిక పరికరాల సాయంతో పౌర నివాసాల్లో మురికి నీళ్లు, బురద, మానవులు విసర్జించే మలమూత్రాలను క్షణాల్లో తొలగించే యాంత్రిక పద్ధతులు ప్రవేశపెట్టా లని జాతీయ కర్మచారీ సంఘం పదేపదే కోరుతూ వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులు తమ చేతులు ఉపయోగించి ఈ పనులకు దిగకుండా పైన చెప్పిన ప్రత్యామ్నాయాన్ని తక్షణం అమల్లోకి తీసుకురావాలని ఈ సంస్థ ఏళ్ల తరబడిగా మొత్తుకుంటోంది. మురుగు కాలువల్లోకి దిగి పనిచేస్తూ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూనే ఉంది. అయినా,  వంద లాది మంది సఫాయీ కార్మికులు ఇలా మరణిస్తూంటే కేవలం డజన్ల కేసుల్లో  మాత్రమే నష్టపరిహారం చెల్లింపు జరిగింది. ఫలితంగా 2017లో ప్రతి ఐదు రోజులకు సగటున ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడు మరణిస్తున్నా డని తేలింది. పైగా పార్లమెంటు చట్టం ప్రకారం సఫాయీకర్మచారులకు జాతీయస్థాయిలో కమిషన్‌ ఏర్పడినా పరిస్థితుల్లో మార్పురాలేదు.

గ్రామసీమల్లో జరిగింది అంతంత మాత్రమే!
గ్రామ సీమల్లో టాయిలెట్‌ సౌకర్యాల గురించి అధికార స్థాయిలో వెలువ డుతున్న ప్రకటనలేగాని ఆచరణలో ఫలితాలు ప్రచారం జరిగినంతగా కనిపించలేదని పలు సర్వే నివేదికలు చెబుతున్నాయి. గమ్మత్తేమంటే, ప్రభుత్వ టాయిలెట్స్‌ నిర్మాణ ప్రచారంలో చెప్పుకున్నట్టు దేశంలోని 28 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ కమిషన్‌ లెక్కల ప్రకారం కేవలం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మాత్రమే కర్మచారుల మృతి వార్తలు నమోదయ్యాయి. పనిలో ఉన్న సఫాయీ కర్మచారులు ఎందరు చనిపోయారన్న వివరాలు ఇంగ్లిష్, హిందీ పత్రి కల్లో వచ్చినంతగా ప్రాంతీయ భాషా పత్రికల్లో రిపోర్టవుతున్న మరణాల సంఖ్య మాత్రం గణనలోకి రావడం లేదు. ఎందుకంటే, పారిశుద్ధ్య కార్మికుల ఉపాధి, పునరావాసానికి చెందిన 2013 నాటి ప్రభుత్వ లెక్కలే ఈ దుస్థితిని బహిర్గతం చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భౌతికంగా చేతులు ఉపయోగించి నిర్వహించే పారిశుద్ధ్య పనులపై విధించిన నిషేధం నాటికి సమయంలో దేశంలో ఉన్నవి 7,40,078 ఇళ్లు. కాగా, సామాజిక, ఆర్థికపరంగా 2011లో కుల ప్రాతిపదిక ఆధారంగా నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం చేతులు ఉపయోగించి  మరుగు దొడ్లు కడిగే కర్మచారుల కుటుంబాలు పెద్ద సంఖ్యలోనే గ్రామీణ భార తంలో ఉన్నాయి. ఈ పరిస్థితికి తోడుగా, ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఆర్భాటంగా ‘గ్రామీణ స్వచ్ఛ భారత్‌ మిషన్‌’ అమలులోకి వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ లాంటి బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఏ మాత్రం మారలేదు. అయితే, తాను దేశ ప్రధాని అయిన తరు వాత బిహార్‌లో ఎనిమిది లక్షల ఇళ్లకు టాయిలెట్లు అందించానన్న మోదీ ప్రకటనను ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఖండిస్తూ, అందులో 6 లక్షలకు పైగా టాయిలెట్లు తాను ఏర్పాటు చేసినవేనని బహిరంగంగా ప్రకటిం చాల్సి వచ్చింది. అనేక గ్రామాల్లో ఏ మేరకు టాయిలెట్‌ సౌక ర్యాలను ప్రభుత్వం కల్పించిందో లెక్కలు తీసేందుకు వెళ్లిన పరిశోధనా సంస్థలు అయిదు ఉత్తర భారత రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించగా వివిధ స్థాయిల్లో పంచాయతీ అధ్యక్షుల నుంచి ప్రభుత్వ అధికారుల దాకా ఎక్కువమంది వివరాలు తెలపడానికి జంకి నోరు మెదపలేదని తేలింది. 

గాంధీజీని హత్య చేసి, ఉరిశిక్షపడిన నాథూరాం గాడ్సే నీడను భారత ప్రజలు మాపేసుకున్నారు గానీ, దేశ పాలనా వ్యవస్థలోని కొందరు ఈ రోజుకీ వదిలించుకోలేకపోతున్నారు. ఆ నీడ చాటునే కొందరు బీజేపీ నాయకులు ఈ రోజుకీ దాగుడుమూతలాడుతున్నారు. గాంధీని గాడ్సే హత్య చేయడాన్ని  మహాత్ముడి 150వ జయంతినాడే బీజేపీ నాయకురాలు ప్రీతీ గాంధీ సమర్థించారు. కానీ, ఆ ప్రకటనను గౌరవ ప్రధాని నరేంద్రమోదీ ఖండించిన వార్తను ఇంత వరకు మనం చూడలేదు. నిజానికి గాంధీ తన బలిదానానికి మూడు మాసాల ముందే (1947 అక్టోబర్‌ 4న) దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ,‘‘దేశంలో హైందవ ధర్మాన్ని హిందువులే సర్వనాశనం చేస్తూ ఉండటాన్ని నేను భరించలేకపోతున్నాను. మనం అంతా ఒకే దేశం వాళ్లం. అందరం ఒక్కటే. హిందువులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు, క్రైస్తవులు అందరం ఐక్యంగా ఒక్క శక్తిగా మెలిగినప్పుడు మనం తన్నులాడుకో వలసిన అవసరం లేదు’’ అని సందేశమిచ్చారు.. అందుచేత గాంధీజీ ఇంత విస్తృతమైన నిండు మనస్సుతో, ఆర్ద్రతతో, మానవత్వంతో అంద జేసిన సువిశాలమైన సందేశాన్ని ఆచరణలో పాటించకుండా ఆయన బోధనల్ని కేవలం ‘టాయిలెట్‌’ సమస్యకే పరిమితం చేయబోవడం అనేక వింతలలో మరొక వింత. ‘భాండశుద్ధిలేని పాకమదియేల’ అని వేమన అన్నట్టుగానే ఆత్మశుద్ధిలేని ‘స్వచ్ఛ భారత్‌’ ఏల అనుకోవాలి!!


ఏబీకే ప్రసాద్‌(abkprasad2006@ahoo.co.in),
సీనియర్‌ సంపాదకులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement