మహాత్ముడిలో విప్లవం | aakar patel write article on mahatma gandhi | Sakshi
Sakshi News home page

మహాత్ముడిలో విప్లవం

Published Tue, Jan 30 2018 1:41 AM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM

aakar patel write article on mahatma gandhi - Sakshi

జాతిపిత గాంధీజీ

రెండో మాట

‘ప్రజాయుద్ధం’ (పీపుల్స్‌వార్‌) నినాదాన్ని చేపట్టిన కమ్యూనిస్టులను స్వాతంత్య్ర పోరాటానికి శత్రువులుగా చిత్రిస్తూ జాతీయ కాంగ్రెస్‌ గాంధీజీ చెవులు కొరికింది. కమ్యూనిస్టు నాయకులపైన విష ప్రచారానికి సిద్ధమైంది. అప్పుడు గాంధీజీ ‘ఇది నిజమేనా?’ అంటూ ఆనాటి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పి.సి. జోషీకి లేఖ రాశారు. జోషీ అంశాల వారీగా వివరణ ఇస్తూ లేఖ రాశారు. గాంధీజీ కృతజ్ఞత తెలుపుతూ ప్రత్యుత్తరం కూడా రాశారు. ఉద్యమ నిర్వహణలో తన తప్పిదాలకు పలుమార్లు క్షమాపణ చెప్పారు.

‘గాంధీజీ ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక రాజనీతిజ్ఞుడే కాదు, ఆయనొక ప్రవక్త. ప్రవక్త తన కాలంలో తరచూ విఫలమవుతూ ఉంటాడు. కానీ ఆయన వైఫల్యాల నుంచీ ఆయన త్యాగాల నుంచీ మానవాళి చిరంతనమైన విలువను సంతరించుకుంటుంది. అనితర సాధ్యమైన ఆ విలువే ప్రవక్త జీవి తాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అది మానవజాతికి కాలావధులు లేని విశ్వజనీన పాఠమై సేవ చేస్తుంది.’‘కమ్యూనిస్టు మార్క్సిస్టు సిద్ధాంతాల వెలుగులో కూడా భారత కమ్యూనిస్టులు గాంధీజీని విశ్లేషించడంలో ఘోర తప్పిదం చేశారు.
                                              – ‘రివల్యూషనరీ గాంధీ’(2012) గ్రంథంలో పన్నాలాల్‌దాస్‌ గుప్తా (1948 వరకు అవిభక్త భారత రివల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి)

‘ప్రపంచ ప్రజలు ముందడుగు వేస్తున్న కొద్దీ, భూప్రపంచం శాంతి కోసం తపన పడుతున్న కొద్దీ, ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం వెల్లివిరుస్తున్న కొద్దీ గాంధీజీ వాణి ఎప్పటి కన్నా ఎక్కువగా, విస్పష్టంగా ధ్వనిస్తుంటుంది. ఆయన భావాలపైన ఎలాంటి పేరు, ఇంటి చిరునామా తెలిపే చీటీ అంటించనక్కర్లేదు– ఒక్క మానవతావాదమనే సువిశాల ముద్ర తప్ప!’
                                        – ‘గాంధీజీ’ (పే.209) గ్రంథంలో ప్రొ. హిరేన్‌ ముఖర్జీ(సుప్రసిద్ధ కమ్యూనిస్టు నేత. ఎంపీ. చరిత్రకారుడు.)

జాతిపిత గాంధీజీని మతోన్మాద హిందూత్వ శక్తి నాథూరామ్‌ గాడ్సే హత్య చేసిన రోజు ఇదే (జనవరి 30, 1948). విభిన్న జాతులు, మతాలు, భాషా మైనారిటీలు, భిన్న తెగలు, దళిత బహుజనుల సమాహారంగా ఉన్న భారతావనిని స్వేచ్ఛ కోసం ఒక్క తాటిపై నడిపించినవారు గాంధీజీ. అలాంటి గాంధీజీని ఏ మిషతో గాడ్సే, అతడి ‘హిందూరాష్ట్ర’వాదులు కొందరు హత్య చేశారో కొంత ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. ‘గాంధీని నేనెందుకు హత్య చేశాను?’ పేరుతో గాడ్సే కోర్టు వాంగ్మూలం పుస్తకరూపంలో వెలువడింది. గాంధీ హత్య కేసును విచారించిన ప్రత్యేక కోర్టులో గాడ్సే ఇచ్చిన వాంగ్మూలమది. మొదట దీనిని నిషేధించారు. 1968లో బొంబాయి హైకోర్టు ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. 

2014 తరువాత బీజేపీ–పరివార్‌ ప్రభుత్వం ఆవిర్భవించిన తరువాత ఇది మరోసారి వెలువరించారు. గాంధీజీని హత్య చేయడానికి ‘హిందూరాష్ట్ర’కు దొరికిన కారణాన్ని అందులో (పేజీ: 45) ప్రకటించారు: దేశ విభజన తరువాత పాకిస్తాన్‌కు రూ. 55 కోట్లు పరిహారం ఇవ్వాలని ఇండియాను ఒత్తిడి చేస్తూ గాంధీ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారన్న వార్త అన్ని దేశ భాషా వార్తా మాధ్యమాలలో ప్రసారమవుతున్న ఘడియలవి. ఆ సమయంలో నాథూరామ్‌ వినాయక్‌ గాడ్సే, నారాయణ ఆప్టే (మరాఠీ దినపత్రిక ‘హిందూ’రాష్ట్ర పత్రిక సంపాదక, మేనేజర్లు) తమ కార్యాలయంలో కూర్చుని టెలిప్రింటర్‌ మీద వస్తున్న ఆ వార్తను చదువుతు ‘గాంధీని చంపేయాలని ఆకస్మికంగా నిర్ణయించుకున్నారు’. అంటే అప్పటి నుంచి నేటిదాకా ఈ పరివార్‌ కూట రాజకీయాలకు ఉప్పు అందిస్తున్నది ఈ మత విద్వేషమేననీ ఇది దేశానికి నిరంతర చెరుపు అనీ స్పష్టం చేయడానికే ఇది చెప్పడం. 

రివల్యూషనరీ గాంధీ
దేశ విభజనతో శాశ్వత కల్లోలానికి అంకురార్పణ చేసిన కాంగ్రెస్‌ నాయకత్వాన్ని సహితం ఎదిరించి పరువు నిలిపిన వారు గాంధీ. ఎన్ని రకాల ఆటుపోట్లను ఎదుర్కొని ఆయన తుది శ్వాస వరకు జాతీయోద్యమాన్ని సాగిం చారో వివరించే మరో గ్రంథం ‘రివల్యూషనరీ గాంధీ’. పన్నాలాల్‌దాస్‌ గుప్తా ఈ చారిత్రక గ్రంథాన్ని రచించారు. అవిభక్త బెంగాల్‌ రివల్యూషనరీ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా 1948 వరకు ఆయన పనిచేశారు. తరువాత పార్టీ నుంచి విడిపోయారు. జాతీయోద్యమ సమయంలో ఆవిర్భవించిన పార్టీలు ఎన్నో! ఎందరో ఉద్యమకారులు పనిచేశారు. అలాంటి దశలో అనుసరించవలసిన వ్యూహాలు, ఎత్తుగడల విషయంలో వ్యత్యాసాలు, వైరుధ్యాలు సహజం. అనేక దేశాల జాతీయోద్యమాలను ఇలాంటి పరిణామాలే ప్రభావితం చేశాయి.
 
అంతా పన్నాబాబు అని ప్రేమగా పిలుచుకునే పన్నాలాల్‌దాస్‌ గుప్తా వేలు విడిచిన విప్లవకారునిగా, మార్క్సిస్టు మేధావిగా గాంధీజీ (విప్లవ గాంధీ)కి అర్పించిన అక్షర నివాళే ఆ రచన. ఉద్యమ అనుభవాలు ఇచ్చిన పూర్వరంగంతో చేసిన చారిత్రక విశ్లేషణ. అహింసా మార్గంలో స్వాతంత్య్రం సాధించాలన్న గాంధీజీ పంథాను శంకించే వ్యాఖ్యను పన్నాబాబు ఆమోదించలేదు. అలాంటి వ్యాఖ్యను ఏ సహ రాజకీయ పక్షం చేసినా ఎదుర్కొన్నారు. అదే సమయంలో భారత జాతీయ కాంగ్రెస్‌తో పాటు, కమ్యూనిస్టు పార్టీల కొన్ని నిర్ణయాలను విశ్లేషించారు. గాంధీజీ ప్రారంభించిన సత్యాగ్రహ విధానాలనూ, ఆయన తీసుకున్న ఆకస్మిక నిర్ణయాలతో ఉద్యమానికి కలిగిన దుష్ఫలితాలనూ పన్నాబాబు తర్కించారు. 

భారత జాతీయ కాంగ్రెస్, కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ వగైరా సంస్థలన్నీ జాతీయోద్యమంలో తమ వంతు పాత్రను నిర్వహించినవే. కానీ ఇవన్నీ ఒకే మూసలో నుంచి వచ్చినవి కావు. కమ్యూనిస్టులు, సోషలిస్టులే కాదు, కొందరు వ్యక్తులు, ఇతర ఉద్యమకారులు కూడా పలు సందర్భాలలో గాంధీతో విభేదించినవారే. అదే సమయంలో గాంధీ దేశ విభజనను వ్యతిరేకించినప్పుడూ, కాంగ్రెస్‌ నాయకత్వం విభజనను భుజాన వేసుకున్నప్పుడూ సీఎస్‌పీ, కమ్యూనిస్టులు, సోషలిస్టులు గాంధీజీకి అండగా నిలిచారు. ‘హింస’ ప్రధాన ఆయుధం కాదనీ, హింసాయుత విప్లవమే ఆదర్శమనీ కూడా నాడు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించుకోలేదు. అహింస ద్వారానే సాతంత్య్రం సిద్ధిస్తుందనీ నమ్మలేదు. కానీ అహింసా ప్రయోగాన్నీ తప్పుగా అంచనా వేసి, గాంధీని ధనికవర్గ ప్రతినిధిగా, బూర్జువా వర్గ ప్రతినిధిగా ప్రచారం చేయడాన్ని పన్నాలాల్‌ విమర్శించారు. అందుకే రజనీ పామీదత్‌ (బ్రిటిష్‌ కమ్యూనిస్టు నేతలలో ఒకరు), ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ల వైఖ రిని, కొంతమేరకు ప్రొఫెసర్‌ హిరేన్‌ ముఖర్జీ లాంటి కమ్యూనిస్టు నాయకులు గాంధీ గురించి వేసిన అంచనాలను ఖండించారు. సత్యాగ్రహోద్యమంతో, అహింసా సిద్ధాంతం ప్రాతిపదికగా నిరక్షరాస్యులైన అసంఖ్యాకులను కనీస కార్యక్రమం ఆధారంగా మాత్రమే సమీకరించగలమే గానీ, స్వాతంత్య్ర పోరుకు ఉద్యుక్తుల్ని చేయగలంగానీ ఒక్కసారే సమూల మార్పునకూ హింసాత్మక విప్లవానికీ సన్నద్ధులను చేయలేమని గాంధీ విశ్వసించారు.

నిరక్షరాస్యుల్ని కదిలించడానికీ, వారికి బతుకుబాట చూపగల కనీస కార్యక్రమాల వైపు ఆకర్షించేందుకూ గాంధీ వ్యూహ రచన చేశారు. వాటిలో ప్రధానమైంది– ‘15 అంశాల’తో కూడిన తక్షణాచరణ నిర్మాణ కార్యక్రమం: అవి హిందూ–ముస్లిం ఐక్యత, హరిజనోద్ధరణ, అస్పృశ్యతా నివారణ, ఆదివాసీల ఉద్ధరణ, మహిళోద్ధరణ, మద్యనిషేధం, ఖాదీ కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం, ప్రాథమిక మౌలిక విద్య, ప్రజారోగ్యం, హిందీ తదితర ప్రాంతీయ భాషల అభివృద్ధి, కార్మికోద్ధరణ, వయోజన విద్య, విద్యార్థి సంఘాల నిర్మాణం, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం వగైరా కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టడం. అయితే కొన్ని మార్క్స్‌ విప్లవ సిద్ధాంతాలకూ, గాంధీ సిద్ధాంతానికి మౌలిక సూత్రీకరణల్లో పెద్ద తేడా కనిపించదని పన్నాలాల్‌ భావన. 

పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో శ్రమజీవులు పరాయీకరణకు లోనవుతారని మార్క్స్‌–గాంధీలు ఏకీభవిస్తారు. దోపిడీని నిరసిస్తారు. దాని నిర్మూలనకు అనుసరిం చాల్సిన మార్గాలలోనే ఉభయుల సిద్ధాంతాలు విభేదిస్తాయి. అంతమాత్రాన నాయకత్వ స్థాయిలో ఉన్న త్యాగ పురుషులకు ఉద్దేశాలు అంటకట్టకూడదన్నదే పన్నాలాల్‌ ఉద్దేశం. అందుకే ‘పోరాటాల ద్వారా తప్ప ప్రజా బాహుళ్యాన్ని ఉద్యమింపచేయలేమన్న వామపక్షాల నమ్మకం ఒక భ్రమ’ అని పన్నాలాల్‌ విశ్వసించారు. కానీ రాజకీయ సంస్థలకు, వ్యవస్థలకు దేశ, సమాజ ఆర్థిక పరిస్థితులే మూలమన్న సత్యాన్ని మనం మరవరాదు. కమ్యూనిస్టులదే కాదు, ఉద్యమ గమనంలో గాంధీజీని అనుసరించి నెహ్రూతో పాటు, కాంగ్రెస్‌లోనే జిన్నా, సుభాష్‌ చంద్రబోస్‌ల స్వాతంత్య్ర సాధన గమ్యం వేరైంది. 

మరో పోరాటం అవసరం ఉంది
పన్నాలాల్‌ గుర్తించినట్టు స్వాతంత్య్రోద్యమంలో వామపక్షాలు సహనం కోల్పోతూ వచ్చాయి. సుభాష్‌ బోస్‌ పరిస్థితీ అంతే. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను వ్యతిరేకిస్తున్న శక్తులనుంచి సహాయం పొంది దేశాన్ని విముక్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు సుభాష్‌. ఆ ఊపులో బోస్‌ చేసిన ఘోర తప్పిదం– ఫాసిస్టు, జర్మనీ, జపనీస్‌లను కలిసి, సహాయం కోరడం (1940–42). రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ను ఎదుర్కొనేందుకు అగ్రరాజ్య మిత్రమండలిలో అమెరికా, బ్రిటన్, సోషలిస్టు సోవియెట్‌ యూనియన్‌లు భాగస్వాములైన తరువాత భారతదేశ స్వాతంత్య్ర సమరంలో భాగస్వామి అయిన కమ్యూనిస్టు పార్టీ ఆకస్మికంగా ఈ ప్రపంచ యుద్ధ స్వభావాన్ని (సోవియెట్‌ రష్యా పాల్గొనడంతో) ‘ప్రజాయుద్ధం’గా ప్రకటించింది. 

అప్పటిదాకా స్వాతంత్య్రం కోసం అజ్ఞాతవాసంలో పోరాటాన్ని సాగిస్తున్న కమ్యూనిస్టు పార్టీపై తన స్వార్థం కోసం బ్రిటిష్‌ పాలకులు నిషేధాజ్ఞలు సడలించారు. ఈ సమయంలోనే ‘ప్రజాయుద్ధం’ (పీపుల్స్‌వార్‌) నినాదాన్ని చేపట్టిన కమ్యూనిస్టులను స్వాతంత్య్ర పోరాటానికి శత్రువులుగా చిత్రిస్తూ జాతీయ కాంగ్రెస్‌ గాంధీజీ చెవులు కొరికింది. కమ్యూనిస్టు నాయకులపైన విష ప్రచారానికి సిద్ధమైంది. అప్పుడు గాంధీజీ ‘ఇది నిజమేనా?’ అంటూ ఆనాటి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పి.సి. జోషీకి లేఖ రాశారు. జోషీ అంశాల వారీగా వివరణ ఇస్తూ సుదీర్ఘ లేఖ రాశారు. గాంధీజీ కృతజ్ఞత తెలుపుతూ ప్రత్యుత్తరం కూడా రాశారు. నిర్మలమైన మనస్సున్నవాడు కాబట్టి గాంధీజీ ఉద్యమ నిర్వహణలో తన తప్పిదాలకు పలుమార్లు క్షమాపణ చెప్పారు.

అన్నింటికన్నా పెద్ద ఒప్పుకోలు– ‘కాంగ్రెస్‌ హిమాలయ పర్వతమంత తప్పులు చేసింద’న్న ప్రకటన. బహుశా అందుకే పన్నాలాల్‌ కూడా స్టాలిన్‌ మాటల్ని ఉదహరించాల్సి వచ్చింది: ‘ఒక చారిత్రక పరిస్థితికి ఫలానా పంథా సరైన మార్గమనుకున్నది మరొక చారిత్రక సందర్భానికి తగిన మార్గం కాకపోవచ్చు’. బహుశా ఈ దృక్పథం నుంచే భారతీయ ప్రొఫెసర్‌ శ్రీమతి అనన్య వాజ్‌పేయి (కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ: 2.10.2017) నేటి గాంధీ భారతానికి జోడించిన వ్యాఖ్య వర్తిస్తుందేమో చూడండి: ‘ఇండియా వలస పాలనా గుదిబండను వదిలించుకుంది. కానీ, స్వాతంత్య్రం తర్వాత, గాంధీజీ హత్యానంతరం మరొకసారి 70 ఏళ్ల తర్వాత స్వేచ్ఛా భారతం కోసం మరొక పోరాటాన్ని చేయక తప్పదనిపిస్తోంది’!
(నేడు గాంధీజీ వర్ధంతి)

ఏబీకే ప్రసాద్‌ సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement