‘ఎవరెన్ని చెప్పినా పేద ప్రజల ప్రయోజనాలకు మాత్రం రక్షణ లేదు. మన ప్రభుత్వం నమ్రతతో ఈ సత్యాన్ని అంగీకరించి తీరాలి’ అని ఒకప్పుడు కఠోర సత్యం చెప్పారు మహాత్మా గాంధీ. కానీ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కూడా ఆ ధోరణిలో మార్పు రాలేదు. తరాలుగా పేద ప్రజలు కాయకష్టం చేసి సంపద సృష్టిస్తున్నారు. అలాంటి పేద ప్రజలకు నిర్ణయాధికారం లేదు. వారి యాజమాన్య హక్కులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రాణం పోశారు. అసైన్డ్ భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించడం ఒక చారిత్రక నిర్ణయం. దశాబ్దాలుగా పోరాటాల రూపంలో వెల్లడైన పేదల కాంక్షలకు నేటి ఈ నిర్ణయం అంతిమ విజయంగా భావించుకోవాలి.
‘‘కోట్లాది దేశ ప్రజలకు ఆహార పంటలు అందించే రైతులకన్నా దేశంలోని పెట్టుబడి దారులకే ప్రభుత్వాలు సర్వ సౌకర్యాలు కల్గిస్తున్నాయి. ఇది కంటికి కన్పించే నగ్న సత్యం. నేను పెట్టుబడిదారులకు వ్యతిరేకిని కాదు. నిజం చెప్పాలంటే, నేను ఒక పెట్టుబడిదారుడికి చెందిన ఇంట్లోనే ఉంటు న్నాను. కానీ పెక్కుమంది పెట్టుబడిదారుల వైఖరి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రభుత్వాలు మాత్రం తాము పేద ప్రజలకు చేయవలసిందంతా చేస్తున్నామని పైకి చెప్పొచ్చుగాక.
ఆ మాటకొస్తే వలస పాలకు లైన బ్రిటిష్ వాళ్ళు కూడా అలాగే చెబుతూండేవాళ్లు. అసలు సత్యం ఏమంటే – ఎవరెన్ని చెప్పినా పేద ప్రజల ప్రయోజనాలకు మాత్రం రక్షణ లేదు. మన ప్రభుత్వం నమ్రతతో ఈ సత్యాన్ని అంగీకరించి తీరాలి. అంతేగాదు, ఏ ప్రయివేట్ ఆస్తి అయినా సరే, అది సిగ్గుఎగ్గూ లేకుండా దొంగిలించిన ఆస్తిగానే నేను పరిగణిస్తాను. ఎవరైనా సరే తన కాయకష్టం ద్వారా సంపాదించని ఆస్తి, లేదా బతుకుతెరువుకు అవసర మైన కనీస శ్రమ ఫలితంగా దక్కని సొమ్ము... సిగ్గూ ఎగ్గూ లేని సంపా దన అవుతుంది.’’
– మహాత్మా గాంధీ (11.12.1947). వి. రామ్మూర్తి ‘హిందూ’ పత్రిక తరఫున ఎడిటర్‌గా సంకలనం చేసి ‘కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ (చెన్నై) తరఫున 2003లో ప్రచురించిన గ్రంథం నుంచి.
తరాలుగా పేద ప్రజలు కాయకష్టం చేసి సంపద సృష్టిస్తున్నారు.ఆ బడుగు, బలహీన వర్గాలకు చెందిన హక్కులను మొట్టమొదటి సారిగా సాధికారికంగా క్రోడీకరించి... ‘దున్నేవాడిదే భూమి’ అన్న దశాబ్దాల వామపక్ష ఉద్యమాల స్ఫూర్తిని కొలది రోజుల నాడు ఆచరణలోకి తెచ్చారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పేద ప్రజల సాగు హక్కులకు ప్రాణం పోశారు. దీనితో పది రకాల వ్యాఖ్యా నాల ద్వారా పేదల భూమి హక్కులను, సాగు హక్కులను తారు మారు చేసే మోతుబరుల ప్రయత్నాలకు స్వస్తి పలికారు. రాష్ట్రంలో మరే ప్రభుత్వం వచ్చినా, దీన్ని చెదరగొట్టే ప్రయత్నాలు చెల్లవు. ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టే శక్తినిచ్చేదే ఈ ముందడుగు.
వామపక్షాలు దశాబ్దాల తరబడిగా ఆంధ్ర, తెలంగాణలలో కౌలు దారీ చట్టాల కోసం చేస్తూ వచ్చిన పోరాటాలతో సాధించిన పాక్షిక విజయాలకు... నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు అసైన్డ్ భూములపై హక్కులు ఇచ్చిన తీరు భూ చరిత్రలో అంతిమ విజయంగా భావించుకోవాలి. పేదలకు ఈ యాజమాన్య హక్కులు రావడం వలన వారు అవసరం అయితే తమ భూమిని విక్రయించుకోవచ్చు.
ఇక, ఇంతకుపూర్వం కౌలు రైతులకు రుణాలు పొందే అర్హత కార్డులు ఉండేవి కావు. ఈ కార్డులు లేకనే బ్యాంకులు రుణాలివ్వలేదు. ఎంతసేపూ భూములకు పట్టాలున్న రైతుల్నే గుర్తిస్తారు. కౌలు రైతులను గుర్తించేది లేదన్న వైఖరిని కేసీఆర్ లాంటి నాయకులు కనబరిచారు. ఏదైనా ఇంట్లో అద్దెకు ఉంటే, ఆ ఇంటిపై హక్కు అతనికి ఇవ్వగలమా అని కూడా ప్రశ్నించారు. కానీ ఒకప్పుడు వై.ఎస్. రాజ శేఖర రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో నాలుగు లక్షల మందికి పైగా కౌలు రైతులు రుణ అర్హత కార్డులు పొందారు. తద్వారా అనేకమంది బ్యాంకు రుణాలు పొందగలిగారు.
కౌలుదారులకు విధిగా వర్తించాల్సిన రక్షణ చట్టాల కోసం సుదీర్ఘ పోరాటాలు జరిగిన చరిత్ర ఉంది. ఆంధ్ర–తెలంగాణ వామపక్ష నాయకులు ఆ యా ప్రాంతాలలో విడివిడిగానూ, ఉమ్మడి గానూ కలిసి పోరాటం జరిపారు. చండ్రరాజేశ్వర్రావు, చలసాని వాసుదేవరావు, రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, ఎస్వీకే ప్రసాద్– సుగుణ దంపతులు లాంటివాళ్లు ఇందులో ఉన్నారు.
ఉభయ రాష్ట్రాల చరిత్రలో తొలి భూపోరాటాలు, పాక్షిక విజయాలన్నీ వామపక్షాల నేతృత్వంలోనే సాధ్యమయ్యాయి. ఒక్క ముక్కలో, పాత ఫ్యూడల్ శక్తులకు ముగుదాడు వేసి సాధించిన విజయాలన్నీ వామపక్షాలు బలంగా ఉన్నప్పటివే. అవి ఎప్పుడు బలహీనపడ్డాయో అప్పటినుంచీ పటిష్ఠమైన పార్టీగా ఉమ్మడి వామపక్షాల మాట గతకాలపు ‘ముచ్చట’గానే మిగిలి పోయింది.
కానీ ప్రస్తుత దశ వేరు. కార్పొరేట్ శక్తుల చేతిలో దేశం నడుస్తున్నది. చాలక, వారి ఆధ్వర్యంలో ప్రసార మాధ్యమాలు కూడా లొంగిపోతున్నాయి. దేశీయ, విదేశీయ ఆశ్రిత పెట్టుబడుల పెత్తనం స్వతంత్ర భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను పాతి పెట్టింది. ఈ దుఃస్థితిని కనిపెట్టిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, ‘రానున్న రోజుల్లో ప్రజలు పార్లమెంట్‌ను కూల్చేస్తా’రని ముందుగానే హెచ్చరించారు.
గత పదేళ్లుగా ప్రతియేటా భారత పరిశోధనా సంస్థ ‘ఏడీఆర్’ నివేదికలు విషాద వాస్తవాన్ని చెబుతున్నాయి. అటు పార్లమెంట్ సభ్యులలో (అన్ని రకాల పార్టీల వాళ్ళు), ఇటు రాష్ట్రాల శాసన సభ్యులలో, మంత్రులలో ఎంత భారీ స్థాయిలో అవినీతి పేరుకు పోయిందో, సవరణకు వీలుకాని స్థాయిలో అవినీతి ఎలా రాజ్య మేలుతోందో ఏడీఆర్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అందుకే మన పాలకుల్ని ఉద్దేశించి ఒక మహాకవి ఇలా హెచ్చరించాడు:‘విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగొస్తేనే పరిణతమతి ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే!’
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment