నత్తడకన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం | individual toilets construction is not in proper way | Sakshi
Sakshi News home page

నత్తడకన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం

Published Fri, Sep 6 2013 4:23 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

individual toilets construction is not in proper way

 సాక్షి, నల్లగొండ:
 గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు మౌలిక సదుపాయాలు కల్పిం చాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికీ వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది. జిల్లాలో గతేడాది 76,616 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మొత్తం యూనిట్ల నిర్మాణానికి రూ.32.76 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం వీటిని నిర్మించుకోవచ్చు. గత అక్టోబర్‌లో మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఇప్పటివరకు కేవలం 17వేల యూ నిట్ల నిర్మాణం మాత్రమే పూర్తి కావడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది.
 
 చెల్లింపులు ఇలా...
 జాతీయ ఉపాధి హామీ, నిర్మల్ భారత్ అభియాన్ (ఎన్‌బీఏ) పథకాలు సంయుక్తంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాయి. మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.10 వేలుగా అంచనా వేశారు. గుంతల తీత, సీసీ బెడ్ వేయడం తదితర పనులు చేసినందుకుగాను వేతనం కింది ఉపాధి హామీ పథకం ద్వారా రూ.2,235 చెల్లిస్తారు. సిమెంట్ రింగులు, సిమెంట్, ఇటుకలు, కంకర, ప్లాస్టరింగ్, కుండి తదితర వాటి (మెటీరియర్)కోసం ఎన్‌బీఏ, ఉపాధి హామీ పథకాలు సంయుక్తంగా రూ.6,815 చెల్లించాల్సి ఉంది. మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయ్యే వరకు పర్యవేక్షించే మేట్‌కి రూ.50 అందజేస్తారు. ఈ మొత్తం రూ.9,100 పోను మిగిలిన రూ.900 తమ వాటాగా లబ్ధిదారులు భరించాలి.
 
 జాప్యానికి కారణాలు...
 మరుగుదొడ్డి నిర్మాణ దశలను బట్టి రూ.9,100 ప్రభుత్వం నుంచి లబ్ధిదారునికి అందుతాయి. అయితే ఇందులో వేతనం కింద చెల్లించే డబ్బులు మాత్రమే పోస్టాఫీసు ద్వారా లబ్ధిదారుని ఖాతాలో జమవుతున్నాయి. మెటీరియర్ కింద చెల్లించాల్సిన డబ్బులు లబ్ధిదారులకు చేరడం లేదు. కేవలం కూలి మాత్రమే తమ ద్వారా చెల్లిస్తామని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది. మెటీరియల్ చెల్లింపులు తమ వల్లకాదని చేతులెత్తేసింది. దీంతో వేతనాలు పోను మెటీరియల్ కింద ఒక్కో యూనిట్‌కి చెల్లించే రూ.6,865 ఏపీఓల వద్దే నిలిచిపోయాయి. కొన్ని నెలలుగా వీరివద్దే మూలుగుతున్నాయి. ఇలా చెల్లింపులు అరకొరగా, ఆలస్యంగా జరుగుతుండడంతో లబ్ధిదారులు మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో డ్వామా అధికారులు గ్రామీణాభివృద్ధి కమిషనర్‌కు ఇటీవల లేఖ రాశారు. వీలైనంత త్వరలో చెల్లింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు.
 
 ఆది నుంచీ ఆటుపోట్లే..
 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఆదినుంచీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. ప్రభుత్వం రోజుకో నిబంధన తెరమీదకు తెస్తుండడంతో అధికారులు, లబ్ధిదారులు అయోమయంలో పడుతున్నారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో నిర్మాణాలు పూర్తికావడం లేదు. మొదల్లో బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లింపులు చేస్తామని చెప్పారు. లబ్ధిదారులు ముందుగా ఈ మొత్తాన్ని భరించి నిర్మాణం మొదలు పెట్టాలన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక చాలామంది అందుకు సాహసించలేదు. మరుగుదొడ్ల నిర్మాణంలో భాగంగా విసర్జిత వ్యర్థాల కోసం రెండు గుంతలు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ పద్ధతి సరైనదే అయినప్పటికీ స్థలాభావం వల్ల కొందరు వెనకడుగు వేశారు. క్షేత్ర సహాయకులు మొదటగా లబ్ధిదారులను గుర్తించడానికి ఇంటింటి సర్వే చేశారు. ఇది పూర్తికాగానే... ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు అనర్హులని మెలిక పెట్టింది. వెరసి మరో జాబితా రూపొందించేందుకు మరికొంత సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఇటువంటి ఆటుపోట్లను అధిగమించి నిర్మాణానికి ముందుకొస్తున్నారు. ఇటువంటి సమయంలో కూలి డబ్బులు మాత్రమే పోస్టాఫీసు ద్వారా చెల్లించి.. మిగిలిన డబ్బులను నిలిపివేస్తుండ డం మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement